Jambi
 
MediMarg
 
 

పద్దెనిమిది సంవత్సరాలనాటి మాట, 1996వ సంవత్సరం మండువేసవి ఉదయ సమయంలో ఈ వ్యాస రచయిత లింగంపల్లి (హైదరాబాద్‌)లో ప్రసిద్ధ పరిశోధకులు బి.ఎన్‌.శాస్త్రిని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్ళాడు. 'సరస్వతీనిలయం'లో సాదాసీదాగా ఉన్న శాస్త్రి ఆత్మీయంగా ఆహ్వానించారు. తన వయసులో సగం కూడా లేని ఈ వ్యాసరచయితతో ఎన్నో ఏళ్ళపాటు పరిచయమున్న మిత్రుడిలా మాట్లాడారు. నిజంగానే ఆ సహృదయత మరచిపోలేనిది. ఆరోజు రమారమి రెండు గంటలపాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. అది పత్రికలోనూ ప్రచురితమైంది. ''నేను స్పష్టంగా చెబుతున్నా నన్నయ ఆదికవి కాదు'' అన్నారాయన. తాను ఎంతో శ్రమించి ఆవిష్కరించిన ఈ సత్యాన్ని చెప్పేందుకు ఆయన ఎక్కడా వెనుకాడలేదు. వందలకొద్ది గ్రామాలు తిరిగి వేల కొలది శాసనాల్ని సేకరించిన ఆ మహావిద్వాంసుడు తెలంగాణ ముద్దుబిడ్డ. తన ప్రగాఢమైన ప్రత్యేక తెలంగాణ వాంఛను కూడా నాటి మాటల సందర్భంగా గట్టిగానొక్కి తెలిపారు. బహుశా కొమర్రాజు వెంకట లక్షణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మల తరువాత అంతగా పరిశోధనావాఙ్మయాన్ని అందించిన మరొక విద్వాంసుడు తెలుగునాటలేరు. శాసనపరిశోధననే తన ఊపిరిగా మార్చుకున్న బి.ఎన్‌.శాస్త్రిని ''శాసనాలశాస్త్రి'' అని ఎంతో గౌరవంతో అభివర్ణించేవారు. అయితే ఆయన జీవితకాలంలో రావలసినంత గుర్తింపు దక్కనేలేదు. 2002లో కన్నుమూసిన శాస్త్రికి ఆయన జీవనచరమాంకంలో తెలుగు విశ్వవిద్యాలయం మాత్రం విశిష్టపురస్కారం (1997)తో సత్కరించింది. ప్రాచీన చరిత్రలో తెలంగాణ వైభవాన్ని తెలియజేసిన బి.ఎన్‌.శాస్త్రిని ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో గుర్తు చేసుకొనడం మన కర్తవ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రచించినదే ఈ వ్యాసం. బి.ఎన్‌.శాస్త్రి పాండిత్యం, సహృదయత, తెలంగాణ పట్ల ఆయన చూపించిన నిబద్ధత, సత్యప్రీతి మన తరతరాలకు ఆదర్శంగా ఉంటుంది. స్ఫూర్తిగా నిలబడుతుంది.

నల్లగొండ జిల్లా వలిగొండలో 1932వ సంవత్సరంలో ఒక సాంప్రదాయ కుటంబంలో జన్మించారు భిన్నూరి నరసింహ శాస్త్రి. ఆయన బాల్యంలో నల్లగొండ జిల్లా యావత్తు నిజాం వ్యతిరేక పోరాటంలో నిమగ్నమైంది. ఈ వాతావరణం ఆయన మీద కూడా గట్టి ప్రభావాన్నే వేసింది. ఆయన కూడా పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. కొంతకాలం పాటు అజ్ఞాత జీవితాన్ని కూడా అనుభవించారు. బహుశా అప్పుడే ఆయనకు రావి నారాయణ రెడ్డి గారితో పరిచయం ఏర్పడి ఉంటుంది. నారాయణ రెడ్డి గారి పట్ల శాస్త్రి చూపించిన అభిమానం ఎంతో గొప్పది. అది సుదీర్ఘ కాలపు అనుబంధంగా ఎదిగింది. భువనగిరి, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరువాత నగరంలో అధ్యాపక వృత్తిలో చేరారు శాస్త్రి. 1952లో నారాయణగూడ పాఠశాలలో అధ్యాపక జీవితాన్ని ఆరంభించారు. నాటి తెలంగాణ యువతరానికి తెలుగుతో పాటు ఉర్దూలోనూ తగినంత ప్రవేశం ఉండేది. బి.ఎన్‌. ఉర్దూ మాధ్యమ విద్యార్ధులకు కూడా బోధన చేసేవారు. మంచి అధ్యాపకుడిగా గుర్తింపు పొందారు. అయితే తన తొమ్మిదవ ఏటనే దృష్టిపడిన పరిశోధన అనే విలక్షణ అంశం ఆయనను అధ్యాపకవృత్తికే పరిమితం కాకుండా చేసింది. శాసనాలను గురించిన పరిశోధన, పరిష్కరణలు లక్ష్యంగా ముందుకు సాగాలనుకున్నారు. అందుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో 1959లో చేరారు. ఎం.ఏ లో చేరి వినూత్న అధ్యయనాన్ని ఆరంభించారు. సుప్రసిద్ధ సాహితీవేత్త, సహృదయ పరిశోధకులు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ఆశీస్సులు లభించాయి. అప్పటికే శాస్త్రి శ్రీనాధుడి రచనపై ప్రామాణిక వ్యాసాల్ని రచించారు. అవి ఖండవల్లితో పాటు డాక్టర్‌ బిరుదురాజు రామరాజు, పల్లాదుర్గయ్య వంటి విద్వాంసుల్ని కూడా ఆకట్టుకున్నాయి. బి.ఎన్‌.శాస్త్రి ఏదో ఒకనాటికి అత్యుత్తమస్థాయి పరిశోధకులుగా ఎదుగుతారని రామరాజుగారు ఆనాడే ఊహించారు. కాలక్రమంలో అది నిజమైంది. ఎం.ఏ. పూర్తిచేసుకున్న తరువాత పి.హెచ్‌.డిలో చేరాలనుకున్నారు బి.ఎన్‌. అప్పట్లో ఆయన పి.హెచ్‌.డి మౌలికపరీక్షలో తెలుగు విభాగం ఆచార్యులతో పాటు నాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సులర్‌ డాక్టర్‌ డి.ఎస్‌.రెడ్డి కూడా కూర్చున్నారట. శాస్త్రికి పి.హెచ్‌.డిలో చోటు దొరికింది. తొలినుండే శాసనాలే ధ్యాసగా ఉన్న బి.ఎన్‌ అందుకు అనుగుణమైన అంశాన్నే ఎన్నుకున్నారు. ''డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు లాంగ్వెజెస్‌ త్రూ ఇన్‌స్క్రిప్షన్స్‌'' (శాసన సాహిత్యం ద్వారా తెలుగు భాషా వికాసం) అనే శీర్షికతో బి.ఎన్‌. పరిశోధనా పర్వం ఆరంభమైంది.

రమారమి ఆరు సంవత్సరాలపాటు శాస్త్రి పి.హెచ్‌.డి పరిశోధన కొనసాగింది. ఈ కాలక్రమంలో ఆయన ఎన్నోచోట్ల పర్యటించారు. ''ఫీల్డ్‌ వర్క్‌'' అనే మాటకు నిజమైన నిదర్శనాల్ని చూపించారు. రెండువేల శాసనాల్ని ఆయన పరిశీలించి ఉంటారని ఒక అంచనా. ఈ నేపధ్యంలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్ని నాటి సంప్రదాయ పండిత లోకం ఎంత మాత్రం అంగీకరించనివి. ఒక నిర్ధారిత సత్యం సంచలనాత్మకంగా ఉన్నప్పుడు అది ప్రకంపనల్ని సృష్టించడం సహజం. ఈ సత్యాన్ని జీర్ణించుకునే ప్రజాస్వామ్య వైఖరి ఉన్నవారు ''ఔరా'' అని ఆశ్చర్యపోయారు. అంగీకరించలేని వారు కొత్త సత్యాలు వెలుగులోకి రాకుండా శాయశక్తులా అడ్డుకుంటారు. బి.ఎన్‌. పరిశోధనల విషయంలో అదే జరిగింది. క్రీ.శ 938 నాటి తామ్ర శాసనం ఆధారంగా తెలుగులో ఆదికవి నన్నయ కాదనీ, అది ఖచ్చితంగా నన్నెచోడుడేననీ ప్రతిపాదించారాయన. తన పరిశోధనలో ఈ ప్రతిపాదనను తిరుగులేని విధంగా నమోదు చేశారు.

ఇక్కడ నన్నెచోడకవి ప్రత్యేకతల్ని గుర్తించిన సంక్షిప్త సమీక్ష అవసరం. నన్నెచోడుడనే కవి ఉన్నట్టు 1909 వరకు తెలుగు సాహితీలోకానికి తెలియదు. పాలమూరు జిల్లాలో మానవల్లి రామకృష్ణ కవి పరిశోధనలు చేస్తున్నప్పుడు ఆయనకు 'కుమార సంభావం' (నన్నెచోడ కృతి) కళ్ళబడింది, అప్పుడే ఆయన నన్నెచోడుని గొప్పతనాన్ని గురించి స్పష్టంగా తెలియజేశారు. నన్నెచోడుని కవిత్వాన్ని గురించి అటుతరువాత కాలంలో వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, నేలటూరి వేంకట రమణయ్య, జయంతి రామయ్య పంతులు, శ్రీపాదలక్ష్మీపతి శాస్త్రి, వేదం వేంకటరాయ శాస్త్రి, అమరేశం రాజేశ్వర శర్మ వంటి పండితులు ప్రామాణిక రచనలే చేశారు. చాలామంది విద్వాంసుల నిర్ణయం ప్రకారం నన్నెచోడుని కుమార సంభవంలో ''దేశీయత'' ఎక్కువ. వర్ణనలోనూ, వస్తువును నిర్వహించిన తీరులోనూ ఈ లక్షణం స్పష్టం. సంస్కృత సంప్రదాయానికి భిన్నంగా ఆనాటి ద్రవిడ రచనా సంస్కృతికి సన్నిహితంగా నన్నెచోడ కుమారసంభవ రచన జరిగిందనే అభిప్రాయమూ ఉంది. కుమార సంభవం గొప్ప రచన అని ఒప్పుకున్న వారు కూడా ఆయన నన్నయకంటే ముందు కాలంవాడనే సాహసం చేయలేకపోయారు. ఇది బి.ఎన్‌. శాస్త్రికే సాధ్యమైంది. ''ఆదికవి నన్నెచోడుడు'' అనే పేరుతో ఆయన ప్రతిపాదిత అంశాలు 1972 భారతి, ఫిబ్రవరిలో ప్రచురణపొందాయి.

''కుమార సంభవము తెలుగులో రచింపబడిన మొట్టమొదటి గ్రంథము'' అనే వాక్యాలతో ఆరంభమైన ఈ వ్యాసంలో ''నన్నెచోడుడు నన్నయ - తిక్కనల తరువాత కవి అనే అభిప్రాయానికి ఆధారాలు లేవు'' అ ని రాశారు బి.ఎన్‌. కుమార సంభవము ''కావ్యశైలిలో రచించిబడిన ప్రబంధము'' అని సూత్రీకరించారు. నన్నెచోడుడు ఎందుకు ఆదికవి అవుతాడో శాసనాల ఆధారంగా ఈ వ్యాసంలో విశ్లేషించసాగారు. నన్నెచోడుడు రెండవ యుద్ధమల్లుని సామంతుడు (930-934) అని పేర్కొన్నారు. ఈ వ్యాసాన్ని ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా చదివిన వారికి నన్నెచోడుడే తెలుగు ఆదికవి అనే అభిప్రాయం బలపడుతుంది. అంత తర్కబద్దంగా ఉన్న వ్యాసమిది. వ్యాసంలోని ముగింపు వ్యాఖ్యను ఒకసారి నిశితంగా పరిశీలించండి.

''ఇట్లు ఆంధ్రభాషలో తొలి కావ్యమును రచించిన ఆదికవి నన్నెచోడుడు శివకవియైనందున మరుగుపడి, పదియవ శతాబ్ధిలో ఆంధ్రమునందాది కావ్యము రచింప, ఇరువదియవ శతాబ్ధిలోనా గ్రంథము వెలుగులోనికి రాగా, ఆంధ్ర పండిత ప్రకాండులు చారిత్రకులు, నన్నెబోడుని పన్నెండవ శతాబ్దివాడుగా నిర్ణయించుట చూడగా కొన్ని కొన్ని దురభిమానములెంత శక్తిమంతమైనవో ఊహింపవచ్చును.. ''

పండిత ప్రకాండుల ''పూర్వనిర్ధారిత అభిప్రాయాలే'' బి.ఎన్‌. శాస్త్రిని డాక్టర్‌ బి.ఎన్‌ శాస్త్రి కాకుండా అడ్డుకున్నాయి. ఆయన పి.హెచ్‌.డి చేస్తున్న కాలంలో ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యక్షులు. ఆరోజుల్లో ఆయన మాట చెల్లుబాటుగా సాగిపోయేదని అప్పటివారు చెబుతారు. ఆయన గోదావరి జిల్లాకు చెందిన వారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్ధి. ఆయనకు బి.ఎన్‌. అంటే ఎందుకో ఇష్టం ఉండేది కాదు. ''మొదటినుంచీ కీర్తి శేషులు దివాకర్ల వేంకటావధాని గారికి నేనంటే గిట్టేదికాదు..'' అని ఒక ఇంటర్వ్యూలో బి.ఎన్‌. స్పష్టంగా తెలిపారు. దివాకర్ల పదహారణాల నన్నయ అభిమాని. నన్నయను కాదని నన్నెచోడున్నే ఆదికవిగా బి.ఎన్‌. తన సిద్ధాంత గ్రంథంలో పేర్కొనడం దివాకర్లకు ఎంతమాత్రమూ రుచించలేదు. తన సిద్ధాంత గ్రంథంలోని ప్రతిపాదనను మార్చి తిరిగి రాయాలని దివాకర్ల సూచించారు. బి.ఎన్‌. అందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదు. చివరకు తన పిహెచ్‌డిని సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డారు. తాను ఆవిష్కరించిన ప్రామాణిక సత్యం విషయంలో రాజీలకు తావేలేదని తేల్చిచెప్పారు. పిహెచ్‌డికి దూరమయ్యారు. అయినా ఆయన ఏనాడూ ఈ అంశంపై విచారించలేదు. అది ఆయన వ్యక్తిత్వం.

ఘనాపాఠీల వంటి పరిశోధకులు సాధించని ఘనత విష్ణుకుండినుల విషయం లో బి.ఎన్‌ ఖాతాలోకే చేరుతుంది. తెలుగునేలను పాలించిన రాజవంశీయుల్లో విష్ణుకుండినులు తక్కువ వారేమీ కాదు. నాలుగైదు దశాబ్దాల పాటు ఇక్కడి ప్రాంతాన్ని పరిపాలించారు. వైదిక సంస్కృతికి పునర్‌ వైభవాన్ని చేకూర్చారు. అయితే నాడు ఆంధ్ర దేశ చరిత్ర పరిశోధనలో కోస్తాంధ్ర పండితుల ఆధిక్యతే ఉండేది కనుక వారు విష్ణుకుండినుల రాజధానిని తమ ప్రాంతంగానే చెప్పుకున్నారు. గుంటూరు జిల్లాలోని వినుకొండ లేదా అమరావతి నాటి విష్ణుకుండినుల రాజధాని అని ఊహించారు. బి.ఎన్‌ ఈ అంచనాలను పొరపాటుగా ఏర్పర్చుకున్నారని నిర్ధారించారు. ఇందుకోసం అప్పటి వరకు వెలుగులోకి రాని రెండు కీలక శాసనాల్ని మౌలిక ఆధారాలుగా మార్చుకున్నారు. అవి 1) విష్ణుకుండిన గోవింద శర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనం. 2) విక్రమేంద్ర భట్టారక వర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనం. శాస్త్రి తాను శోధించిన అంశాల్ని భారతిలో ప్రచురించారు.

ఈ వ్యాసాలు 1965 జూన్‌, జులై భారతి సంచికల్లో ప్రచురణపొందాయి. ఆంధ్రదేశ చరిత్రను మలుపు తిప్పిన సాక్ష్యాలు ఇవి. నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం ప్రాంతం (పూర్వం ఇంద్రపాలనగరం) విష్ణుకుండిన రాజధాని అని తేల్చారాయన. ఇక్ష్వాకుల అనంతరకాలంలో సుదీర్ఘకాలపు అస్పష్ట చరిత్రకు ఈ పరిశోధనలు సుస్పష్టతను చేకూర్చాయి. విష్ణుకుండిన చరిత్ర విషయంలో బి.ఎన్‌. అవగాహన సాగరమంతటి లోతైనది. ఆరోజుల్లో భారతి పత్రికలో తెలంగాణ వారి రచనలు బహు స్వల్ప సంఖ్యలో ప్రచురణపొందేవి. తెలంగాణ ప్రాంతం నుండి భారతిలో ఎక్కువ పరిశోధనా వ్యాసాల్ని ప్రకటించగలిగిన వారిలో బి.ఎన్‌ పేరు అందరికంటే ముందుంటుంది.

సాంఘిక చరిత్ర రచన బి.ఎన్‌ శాస్త్రి వైదుష్యానికి ప్రతినిధిగా నిలుస్తుంది. ''ఆంధ్రుల సాంఘిక చరిత్ర''ను తొలుత తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి చేపట్టారు. ఒక పరిపూర్ణ పరిశోధనాత్మక రచనగా దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో ఆయన తూర్పు చాళుక్య యుగమునుండి 1907 అంటే ఆధునిక కాలం వరకు ఉన్న పలు సాంఘిక విశేషాల్ని, సాహిత్యంలో ఆయా అంశాల చిత్రీకరణను బింబప్రతిబింబ పద్ధతిలో నిరూపించారు. 1950 అక్టోబర్‌లో ద్వితీయ ముద్రణకు పీఠిక రాస్తూ ''ఇకముందు ఈ సాంఘిక చరిత్ర పూర్వభాగమును శాలివాహనుల కాలమునుండి రాజరాజనరేంద్రుని కాలము వరకు వ్రాయుటకు పూనుకుందును'' అని చెప్పారు. అయితే ఈ రచన ఆరంభం కాకముందే ఆయన కన్నుమూశారు. దీనితో సాంఘిక చరిత్ర రచన అసంపూర్ణంగా ఉండిపోయింది. బి.ఎన్‌. శాస్త్రి తన సాంఘిక చరిత్రలో దీనికి సంపూర్ణతను సాధించిపెట్టారు. ఆయన రచించిన సాంఘిక చరిత్ర క్రీ.పూ 4 శతాబ్దిలో ఆరంభమై క్రీ.శ 11వ శతాబ్ధి వరకు కొనసాగిన విశేషాల్ని వివరించింది. సురవరం వారి సాంఘిక చరిత్ర తరహాలోనే ఇది కూడా ప్రామాణికమైనదిగా గుర్తింపు పొందింది. ఈ రచనను ఒక ప్రత్యేకమైన దృష్టితో అంచనావేయాలి. క్రీ.పూ 4 - క్రీ.శ 5 శతాబ్ధాల తెలుగువారి చరిత్రలో సంక్లిష్టతలు ఎక్కువ. ఇదివరకటి విద్వాంసుల అభిప్రాయాల్లోనూ ఎన్నో తేడాలున్నాయి. ఈ పరిస్ధితుల్లో సరళంగా సాంఘిక చరిత్రను అందించేందుకు విషయం పట్ల అవగాహన కావాలి. ఈ అవగాహన వల్లనే బి.ఎన్‌. సాంఘిక చరిత్రకు ప్రామాణికత లభించింది. బృహత్కధను రచించిన గుణాఢ్యుడు కొండాపురం (మెదక్‌ జిల్లా) నివాసి అన్నది బి.ఎన్‌ నిర్ధారణ. ఇటువంటి ఎన్నో కొత్త విశేషాలు ఈ గ్రంథంలో దొరుకుతాయి. మౌలికంగా సురవరం వారి పరిశోధనా ఉపకరణాలు సాహిత్యరచనలు కాగా, బి.ఎన్‌.కు శాసనాలే ఈ రచనలోనూ కీలక సాధనాలు అయ్యాయి.

1970 - 80 కాలం లలో తెలంగాణ ప్రాంత సాహిత్యంలో ఇప్పటివలె బలమైన అస్తిత్వ ఆకాంక్షలు లేవు. కోస్తాంధ్ర సాహిత్య ప్రవాహంలో తెలంగాణ ఒక పాయగా ఉండవలసిన పరిస్థితి. ఇంకా అప్పటికి తెలంగాణ సాహిత్యాంశాలపై ప్రత్యేక అధ్యయనాల్ని నిర్వహించాలనే ఆలోచన చాలా మందికి లేదు. ఖండవల్లి లక్ష్మీరంజనం, బిరుదురాజురామరాజు, ఆదిరాజు వీరభద్రరావు, గడియారం రామకృష్ణశర్మ వంటి విఖ్యాత విద్యాంసుల దృష్టిలో తెలంగాణ సంపూర్ణ సాహిత్యసీమ. వెలుగులోనికి రాని అనేక అంశాలు బయల్పడాలంటే మారుమూల ప్రాంతాలమీద కూడా కాంతిరేఖలు ప్రసరించాలి. ఇందుకు జిల్లా సర్వస్వాల రచన ఎంతో ఉపకరిస్తుందని బి.ఎన్‌. శాస్త్రి విశ్వసించారు. ఇది వ్యూహాత్మకరీతిలో అత్యుత్తమ ఆలోచన. ఈ దిశలో తన వంతు ప్రయత్నాలు ఆరంభించారు. తొలుత నల్లగొండ అటుతరువాత ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా సర్వస్వాలు వెలుగుచూశాయి. ఇవి త్వరితగతిన ప్రామాణికతను సంతరించుకున్నాయి. ఈ జిల్లాల గురించి ఆధ్యయనం చేయాలనుకునేవారు ఇప్పటికే ఈ గ్రంథాల్ని పరామర్శించ వలసిందే. బి.ఎన్‌. వెలువరించిన ఈ మూడు జిల్లా సర్వస్వాలు ఆయా జిల్లాల్లోని మారుమూల పల్లెలకు చేరువయ్యాయి. అటు తరువాత కాలంలో శాస్త్రుల రఘురామ శర్మ వంటివ వారు మెదకు జిల్లా, నిజామాబాద్‌జిల్లాల సర్వస్యాల్ని రచించేందుకు బి.ఎన్‌. కృషి ప్రేరణగానిల్చింది. ఆయన వరంగల్లు జిల్లా సర్వస్య రచనకూడా ఆరంభించారట. అది పూర్తికాకముందే ఆయన కన్నుమూశారు. అట్లాగే ''శ్రీలక్ష్మీనరసింహ క్షేత్ర సర్వస్వరచన'' ఆరంభించారు. అదికూడా అసంపూర్ణంగా ఉండిపోయింది.

బి.ఎన్‌. వెలువరించిన శాసన సంపుటాలు ఎన్నెన్నో. ఒక్కరే ఇన్ని సంపుటాల్ని ప్రచురించడం విస్మయాన్ని కలిగిస్తుంది. శాసన సంపుటాల విషయంలో ఏకవ్యక్తికృషితో ఇంతటి విజ్ఞానసంపద అందుబాటులోకి వచ్చింది. ఆ శాసనసంపుటాలు ఇవి.

1) శాసన సంపుటి 1,2 భాగాలు
2) త్రిపురాంతక దేవాలయ శాసనములు
3) కందూరు చోడుల శాసనములు, చరిత్ర-సంస్కృతి
4) బెజవాడ దుర్గామల్లీశ్వరాలయ శాసనములు
5) ముఖలింగ దేవాలయ శాసనములు
6) చెరుకు రెడ్డి వంశచరిత్ర - శాసనములు
7) గోలకొండ చరిత్ర - సంస్కృతి, శాసనములు
8) రేచర్ల రెడ్డి వంశచరిత్ర - శాసనములు
9) రేచర్ల పద్మ నాయకులు
10) కాయస్థరాజులు
11) వేములవాడ చరిత్ర - శాసనములు
12) మల్యాల వంశచరిత్ర - శాసనములు

వీటితోపాటు రెడ్డి రాజ్యసర్వస్వం, బ్రాహ్మణ రాజ్య సర్వస్వం అనే ప్రామాణిక గ్రంథాల్ని రచించారు. బి.ఎన్‌. పద్మనాయక సర్వస్వం కూడా రచించాలని సంకల్పించుకున్నారు. అది పూర్తికాలేదు. రెడ్డి, బ్రాహ్మణ రాజ్య సర్వస్వాలలో ఇంత వరకు చరిత్రకు చిక్కని ఎన్నో కొత్త అంశాలున్నాయి. ''ఆంధ్ర దేశ చరిత్ర- సంస్కృతి'' మూడు సంపుటాలతో అత్యంత సరళంగా రచించారు. బి.ఎన్‌. ఇవి పరిశోధక విద్యార్ధులకు పునాదిస్థాయి ఆధారాలుగా ఉపయోగపడతాయి. భారతదేశ చరిత్రను మొత్తం 21 సంపుటాలుగా రచించాలనుకున్నారు. వీటిలో కొన్ని మాత్రమే పూర్తి అయ్యాయి. ఇంకా సృజనాత్మక స్థాయిలో పలు నవలలను, ఒకటి రెండు నాటికలు కూడా బి.ఎన్‌ రచించారు. అయితే ఆయనను ప్రధానంగా పరిశోధకులుగానే విద్వల్లోకం గుర్తించింది.

చాలామంది పరిశోధకులకు ఏదో ఒక ''దృక్పథం'' ఉంటుంది. ఆ దృక్పథం వారి రచనల్ని నిర్ధారించడమూ జరుగుతుంది. ఈ వ్యాసరచయిత బి.ఎన్‌ గారిని చరిత్ర రచనలో ఆయన దృక్పథాన్ని గురించి ప్రశ్నించాడు. తాను మార్కిస్టు చరిత్ర కారుడిని కాననీ, మార్కిస్టు చరిత్ర రచనా దృక్పథం మీద తాను విమర్శలు కూడా చేయనని ఆయన అన్నారు. చరిత్ర రచనలో శాసనాల్ని మించిన ఆధారం మరేదీ లేదన్నది తన స్పష్టమైన అభిప్రాయంగా ప్రకటించారు. ''శాసనాధారిత రచనే'' తన దృక్పథమనీ చెప్పారు. ఈ సందర్భంలోనే మల్లంపల్లి సోమశేఖర శర్మ, గడియారం రామకృష్ణ శర్మలను పరిశోధకులుగా తాను ఎక్కువగా అభిమానిస్తాననీ చెప్పారు. బి.ఎన్‌. చరిత్రరచనలు సరళ గ్రాంథికంలో ఉంటాయి. ఎక్కడా క్లిష్టత ఉండదు, విసుగూ పుట్టదు.

\

బి.ఎన్‌. తెలంగాణవాది అని ఈ వ్యాసంలోనే ఇదివరకే పేర్కొనడం జరిగింది. దీనికి అద్దంపట్టే తీరు ''మూసీ'' అనే పేరుతో పత్రికను నిర్వహించడంలో తేటపడుతోంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో దుర్గంధానికి ప్రతీకగా చెప్పుకునే మూసీనది ఒకప్పుడు భాగ్యనగర అమృతధార. మూసీ అనే పేరులో ఉన్న గత వైభవ సాంస్కృతికతను బి.ఎన్‌ గుర్తించారు. అందుకే 1980లో మూసీ సాహిత్య సాంస్కృతిక పత్రిక ఆరంభమైంది. 1986 వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచింది. మంచి పత్రికగా మన్ననల్ని పొందింది. దశాబ్ధి కాలంపాటు ఆగిపోయిన మూసీ పత్రిక 1992లో తిరిగి మొదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతోంది. బి.ఎన్‌ కన్నుమూసిన తరువాత ఆయన కుమార్తె మనోహరి, అల్లుడు డాక్టర్‌ సాగి కమలాకర శర్మ పత్రికను చక్కగా నడిపిస్తున్నారు.

కొంతమంది పరిశోధకులు నిరంతరం తమదైన ప్రపంచంలోనే గడుపుతారు. వీరిలో కొంతమందికైతే బాహ్య ప్రపంచంతో నామమాత్ర సంబంధాలే ఉంటాయి. ఇందుకు వారిని విమర్శించేందుకూ అవకాశం లేదు. వారి వారి సంకల్పాలు, పరిధులు అటువంటివి. అయితే బి.ఎన్‌ వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నమైనది. నిత్యం ఆయనను ఎంతో మంది కలుసుకునే వారు. వీరిలో సుప్రసిద్ధ చరిత్ర పండితులు, సాహిత్యాచార్యులు, నిత్యపరిశోధకులు, పరిశోధక విద్యార్ధులు, పాత్రికేయ ప్రముఖులతో పాటు రాజకీయరంగంలోని వారూ చేరేవారు. ఇంతమందికి తన స్నేహహస్తాన్ని ఆయన అందించారు. ఆయనతో తమ ఆత్మీయతను గురించి రెండు మూడు తరాల వారు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ఆత్మీయమైన సంభాషణ, ఆత్మ విశ్వాసాన్ని కలిగించే వ్యక్తిత్వపు తీరుతో చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నారు శాస్త్రి. ఇంతమందిలో ఉంటూనే ఇన్ని వేల పుటల వాజ్మయాన్ని ఆయన ఎట్లా రచించగలిగారన్నది ఆశ్చర్యకరమే. ఆయన రాత్రిపూట తన రచనా వ్యాసంగాన్ని ఆరంభించి కొన్ని వందల పుటల దాకా రాసేవారట. ఈ అలవాటు ఆయన చివరి వరకూ కొనసాగింది. తన రచనల ద్వారా వచ్చిన ఆదాయంలో కేవలం పదిశాతం మాత్రమే గృహావసరాలకు వినియోగించిన ఉదారులు బి.ఎన్‌. ఆయన దాతృత్వంతో ఎందరి రచనలో వెలుగు చూశాయి. ఆయన సహకారంతో ఎందరో రచయితలుగా ఎదిగారు.

ఎవరైనా పరిశోధన చేయాలనుకుంటే ముందుగా ఏదైనా స్ధిరమైన ఉపాధి ఉండాలి. ఆ ఉపాధి ద్వారా లభించే ఆదాయంతో పరిశోధన సాఫీగా సాగుతుందనే అంచనా ఏర్పడుతుంది. శాస్త్రిగారు 1959లోనే తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఏం.ఏ పూర్తి కాగానే పరిశోధన (పిహెచ్‌డి) ఆరంభించారు. ఇదివరకే చెప్పినట్టు పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథ రచన అయితే పూర్తి అయింది కానీ పట్టా రాలేదు. దీనితో విశ్వవిద్యాలయాల్లో ఆచార్యత్వం పొందలేని పరిస్ధితి. ఆయనకు ఎటువంటి స్థిరమైన ఉద్యోగమూ లేకపోయింది. అయినా ఆయన ఎప్పుడూ ఇందుకోసం చింతించలేదు. నిరంతరం రచనావ్యాసంగంలో మునిగిపోయారు. ఎంతో మంది చేయలేని పనిని ఒక్క చేతితో చేసి చూపించారు. తెలంగాణకు ఎన్నో తరాలకు అవసరమైన చారిత్రక విజ్ఞానాన్ని సంతరించారు. తాను బాగా అభిమానించిన పరిశోధకులు మల్లంపల్లి, గడియారంగారల జీవితంతో ఈ విషయంలో బి.ఎన్‌కు పోలికలున్నాయి. వారిద్దరూ జీవితాంతంలో ఏదోఒక ఉద్యోగంలో స్థిరపడలేదు. పరిశోధనలే ప్రాణంగా బ్రతికారు. ప్రామాణికత పరమలక్ష్యంగా రచనలు చేశారు. చరిత్రలో నిలచిపోయారు. బి.ఎన్‌ శాస్త్రి కూడా ఆ వరుసలో చేరారు.

ఏదీ ఆశించకుండా పరిశోధనే పరమావధిగా జీవించిన బి.ఎన్‌ శాస్త్రికి ఆయన జీవితకాలంలో రావలసినంత గుర్తింపు రాకపోవడం తెలంగాణ వాజ్మయశోధకులకు వేదన కలిగించే అంశం. ఇందుకు గల కారణాల్ని అన్వేషిస్తే, ఆనాడు తెలంగాణ వారికి జరిగిన అన్యాయం ఒక కారణం కాగా, బిఎన్‌లోని రాజీలేని సత్యప్రతిపాదనతో కూడిన వైఖరి మరో కారణం. నికార్సయిన వ్యక్తిత్వ గరిమతో నిలబడిన బి.ఎన్‌ భావిపరిశోధకులకందరికీ ఒక మంచి మార్గదర్శి. ఆనాడు తెలంగాణ శోధనలో తమ జీవితాన్ని హారతి కర్పూరంవలె వెలిగించిన ఎందరో మహనీయుల కోవలోనివారు బి.ఎన్‌. శాస్త్రి. ఆయన రచనలకు కావలసినంత ఆదరణ లభించేలా చేయడం, ఆయన గొప్పతనాన్ని పదిమందికీ పరిచయం చేయడం ఈనాడు మన కర్తవ్యాలు.