1990వ దశకం అనంతర కాలం తెలంగాణ సాంస్కృతిక జీవనంలో ఒక మహత్తరమైన పునరుజ్జీవన దశ. ఈ కాలంలోనే తెలంగాణ తనను తాను పునస్సమీక్షించుకున్నది. తనకు అన్ని రంగాల్లో జరిగిన అన్యాయాల్ని, తనకు న్యాయంగా దక్కవలసిన అన్నిరకాలైన వాటాల్ని తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకున్న కాలం ఇది. తెలంగాణ సాహితీ జగతి పడి లేచిన కడలి తరంగం వలె ముందుకు జరిగిన కాలం కూడా ఇదే.తెలుగు నవలా రచన తెలంగాణ ప్రాంతంలో కొంత ఆలస్యంగానే ఆరంభమైంది. అయినా మలిదశలో తెలుగు నవలా వైవిధ్యానికి తెలంగాణ ప్రాంతం ఇతోధికమైన యోగదానాన్ని అందించింది. తెలంగాణ ప్రాంత పరిస్థితులకు ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలకు నవల ముప్పాతిక మువ్వీసం శాతం ప్రతినిధిగా మారింది. కోస్తాంధ్రలో - అందులోనూ ప్రధానంగా కృష్ణా గోదావరి ''వ్యవసాయ ఆర్థిక సంపన్న'' ప్రాంతాల నుంచి వెలువడిన నవలలకు తెలంగాణ నవలలు పూర్తి భిన్నమైనవి. అక్కడి నవలల్లో కాల్పనికతకు ప్రముఖ స్థానం దక్కితే తెలంగాణ ప్రాంత నవలల్లో సమకాలీనతకు, వాస్తవికతకు అగ్రతాంబూలాలు దక్కాయి. ఇంతకూ తెలంగాణలో నవలా ప్రక్రియ ఆలస్యంగా రూపుదిద్దుకొనడానికి కారణాలేమిటి? అందుకు గల విశాలమైన నేపథ్యాన్ని ఒక్కసారి సమీక్షించుకోవడం సముచితం.

''రాచరిక స్వభావం ఎంత బలంగా పునాదులు వేసుకుంటే సంప్రదాయ కవిత్వం రచన అంత విస్తారంగా విజృంభిస్తుంది''. ''సమాజం క్రమేపీ ప్రజాస్వామ్య సంస్కృతి వైపు తరలిపోతున్న తరుణంలో మానవ సాహిత్య ప్రక్రియలు వికసిస్తాయి.'' ఈ రెండు సాహిత్య స్వభావ సూత్రీకరణలు నూరు శాతం నిజమైనవే. వాస్తవానికి ఈ రెండు సూత్రీకరణలకూ మధ్య ఎంతో కొంత సంబంధం కూడా ఉంది. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ''మాగ్నా కార్టా''లతో స్వాగతాలు పలికిన ఇంగ్లీషు ప్రజలు వచన సాహిత్యాన్ని సాదరంగా స్వాగతించారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ క్రమంలో రాజరిక సాహిత్యానికి తిరుగుబాటుగా అక్కడ నవలా ప్రక్రియ వికసించింది. జపాన్‌ గడ్డ మీద పురుడు పోసుకున్న నవలా శిశువు అక్కడ ఒదగలేక లండన్‌ వీధుల్లో ఎదగడానికి అక్కడి ప్రజాస్వామ్య వాతావరణం ప్రధాన కారణం. బ్రిటీష్‌ ప్రజాస్వామ్య సౌధానికి సరికొత్త అలంకారంగా మారిన ఉదారవాదం ఆనాడు వలస పీడిత భారతదేశంలోకి కలకత్తా నగరం ద్వారా ప్రవేశించింది. 19వ శతాబ్ది తొలి దశాబ్దాల బెంగాలీ మేధావి వర్గం ఇంగ్లీషు సంస్కృతీ సాహిత్య సంప్రదాయాలను ఆదర్శాలుగా స్వీకరించింది. దీనితో బ్రిటీష్‌ నవల బెంగాలీలోనూ గొప్ప ఆదరణను అందుకున్నది. తొలి భారతీయ నవలా రచయిత బంకించంద్ర ఛటర్జీ బెంగాలీ మేధావి వర్గానికి చెందినవారే. బంకిం అనంతర తరంలో బెంగాలీ సీమలో ఉత్తమ శ్రేణి నవలా ప్రవాహం పొంగి పొరలింది. రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, తారా శంకర్‌ బంధోపాద్యాయ, శరత్‌చంద్ర వీరంతా నాటి బెంగాలీ నవలా ప్రవాహంలో మరచిపోలేని మలుపులు. కోస్తాంధ్ర మేధావి వర్గంపై బెంగాలీ మేధావుల ప్రభావం ప్రబలంగా ఉండేది. బెంగాలీ సంస్కరణల్ని అక్కడి సాహిత్య ప్రక్రియల్ని కోస్తాంధ్ర మేధావి వర్గం తమ ఆదర్శాలుగా తీసుకున్నది. ఇట్లా బెంగాల్‌ కేంద్రంగా ఆరంభమైన భారతీయ నవలా ప్రక్రియ తూర్పు కోస్తా తీరం వెంబడి కృష్ణా గోదావరీ తీరాల్లోకి వచ్చి చేరింది. కందుకూరి, చిలకమర్తి వంటి వారు తొలితరం నవలా రచయితల్లో అత్యంత ప్రతిభావంతులు. బ్రిటీష్‌ పాలనా ప్రాంతమైన కోస్తాంధ్రలో అప్పటికే విద్యావ్యాప్తి జరిగింది. నవలా పాఠకులూ తయారయ్యారు. నవలా ప్రక్రియ వికసించేందుకు అక్కడి వాతావరణం బాగా తోడ్పడింది. అయితే నాడు దత్త మండలంగా పిలువబడిన నేటి రాయలసీమ కూడా కోస్తాంధ్ర వలె బ్రిటీష్‌ పాలిత ప్రాంతమే. అయినా అక్కడ నవలా రచన తెలంగాణా కంటే ఆలస్యంగా ఆరంభమైంది. అందుకు కారణం నాడు సీమలో పునాదులు వేసుకున్న భూస్వామ్య వాతావరణం.

ఈ భూస్వామ్య సంప్రదాయమే తెలంగాణలో ఆనాడు ఆధునిక సాహిత్య ప్రక్రియల వికాసానికి అడ్డుగోడగా నిలిచింది. సంస్థానాధీశులు - సంపన్న వర్గాల వారు ''చమత్కార పద్య'' కవిత్వాన్నే ఇష్టపడడంతో వారిని ఆశ్రయించిన కవులు కూడా అదే పద్ధతిలో రచనలు చేయవలసిన అనివార్యత ఏర్పడింది. నాడు సంస్థానాలలోనే తెలుగు ప్రెస్సులు ఉండడంతో ఆధునిక సాహిత్య వికాసానికి అవసరమైన సాంకేతిక సహకారం లభ్యం కాలేదు. 19వ శతాబ్దిలో నిర్దిష్ట ప్రక్రియా సూత్రాలకు లోబడే తెలుగు నవల తెలంగాణలో వెలువడలేదనే చెప్పాలి. ఏవైనా రచనలు దొరికినా అవి జానపద గాథలకు దగ్గరగా ఉంటాయి. మహబూబ్‌నగర్‌ కేంద్రంగా 1910వ దశాబ్దిలో హితబోధిని అనే పత్రికను నిర్వహించిన చి. శ్రీనివాసశర్మ 'ఆశాలేశము' అన్న నవలను రచించినట్టు చెబుతారు. అయితే అది లభ్యం కాలేదు. 1920వ దశకంలో వరంగల్లు నుండి 'ఆంధ్రాభ్యుదయము' అనే పత్రికను నడిపిన కోకల సీతారామశర్మ 'పావన' పేరుతో ఒక నవల వంటి రచన చేశారు. దాన్ని సంపూర్ణంగా నవల అనేందుకు వీలులేదు. ఇందులో కథానిక - నాటకం తదితర ప్రక్రియల లక్షణాలు ఉన్నాయి. ఈ రచన ఆంధ్రాభ్యుదయం పత్రికలో కొంత కాలం పాటు ధారావాహిక ప్రచురణ పొందింది. దేవరకొండకు చెందిన సయ్యదలీ, అజ్మతుల్లా అనే జంట రచయితలు పాతిక వరకు నవలలు రచించారు. ఇవి కోస్తాంధ్రకు చెందిన 'కొవ్వలి- జంపన'ల రచనల వంటివి. వీటికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. గోలకొండ కవుల సంచికలో కనీసం అరడజను మంది నవలా రచయితలున్నారు. వీరిలో పలువురి రచనలు నాటికి (నేటికీ) అముద్రితాలు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన 'శుద్ధాంతకాంత' అనే నవల కూడా వెలుగులోకి రాలేదు.

ఇక సమకాలీనత, వాస్తవికతల విషయాలకు వస్తే బెంగాలీ నవలలు భావుకతకు ప్రాధాన్యతనిచ్చాయి. ఈ భావుకతకు అక్షర రూపమే కాల్పనికతగా మారింది. జమిందారీ జీవితాలు, కళాత్మక హృదయాలు, అపురూపమైన మానవానుబంధాలు వీటిలో చిత్రీకరణ పొందాయి. ఈ నవలల్లో వాస్తవికత బాగా తక్కువ. ఎంతో కొంత సమకాలీనత మాత్రం ఉంటుంది. సహజంగానే కోస్తాంధ్ర నవలల్లోనూ ఇదే ప్రతిబింబించబడింది. అయితే, తెలంగాణ తెలుగు నవలలపై బెంగాలీ ప్రభావం శూన్యం. ఈ రచనలపై ఉత్తర భారత ప్రభావం అందులోనూ ప్రేంచంద్‌ ప్రభావం ఎక్కువ. సమకాలీనత - వాస్తవికతలు ప్రేంచంద్‌ రచనలకు ప్రాణాలు. జీవితాన్ని బెంగాలీ నవల ఆదర్శీకరిస్తే అదే జీవితాన్ని ప్రేంచంద్‌ రచనలు వాస్తవీకరించాయి. నేటి ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతంలోని సామాన్యుల జీవన వేదనలు ప్రేంచంద్‌ నవలల్లో స్పష్టంగా ప్రతిష్ఠించబడ్డాయి. అదే తీరు తెలంగాణ తొలి తరం తెలుగు నవలల్లోనూ ఉంది. దాదాపు ఇదే తీరును మలితరం నవలా రచయితలు కూడా తమ వారసత్వంగా స్వీకరించారు.

నిర్దిష్టమైన ప్రక్రియా సూత్రాలతో వెలువడిన తెలంగాణ తొలి తెలుగు నవల 'ప్రజల మనిషి'. ఇందులో ఎటువంటి రెండవ అభిప్రాయానికి తావులేదు. ఈ వాస్తవాన్ని గత కొద్ది సంవత్సరాల నుండి సాహితీ లోకం స్పష్టం చేస్తూనే వస్తోంది. ప్రజల మనిషిని చిత్రించిన వట్టికోట ఆళ్వారుస్వామి తొలి తెలంగాణ నవలా రచయితగా సాహిత్య చరిత్ర పుటల్లో పదిలమైన చోటును పొందారు. నవలా రచనలో సమకాలీనత - వాస్తవికతల్ని ప్రతిబింబింపజేయడమనే సంప్రదాయం ఆళ్వార్‌ స్వామితో ఆరంభమైంది. ఈ పద్ధతి ఆళ్వారు స్వామి నుండి నేటి దాకా కొనసాగుతోంది. తెలంగాణలో నవలా రచన చేసిన - చేస్తున్న అందరికీ ఆళ్వారుస్వామి ప్రజల మనిషి ఆదర్శం. ఆళ్వారుస్వామి 1930వ దశకం మలిభాగంలో తాము దర్శించిన తెలంగాణ తీరు తెన్నుల్ని మరో రెండు దశాబ్దాల అనంతరం ప్రజల మనిషిలో చిత్రించారు. నల్లగొండ జిల్లాలో జన్మించిన వట్టికోట ఇందూరు జిల్లా జనజీవనాన్ని అత్యంత వాస్తవికంగా వర్ణించారు. ప్రజల మనిషి నవలలో కధాకేంద్రమైన దిమ్మగూడెం అన్న గ్రామం నిజామాబాద్‌ జిల్లాలో లేనేలేదు. ఇది ఆర్‌.కె. నారాయణ్‌ సృష్టించిన మాల్గుడి వంటి ఊహాత్మక గ్రామసీమ. అయితే ఈ ఒక్క పేరు మాత్రమే ఊహ. మిగతా నవల అంతా ప్రత్యక్షర వాస్తవికమే. 1937లో నిజామాబాద్‌ పట్టణంలో చారిత్రాత్మకమైనా ఆరవ ఆంధ్ర మహాసభ జరిగింది. చారిత్రక దృష్టితో చూస్తే ఇది అత్యంత కీలకసభ. సున్నితమైన రీతిలోనిజాం సర్కారుపై ధిక్కార స్వరాన్ని వినిపించిన తొలి సభ ఇది. అయినా, నిజామాబాద్‌ సభల నాటికి ఆంధ్ర మహాసభ ఇంకా మితవాదుల ఆధిపత్యంలోనే ఉండేది. తనను తాను నిజాయితీతో మితవాదిగా ప్రకటించుకున్న మందుముల నరసింగరావు నిజామాబాద్‌ ఆంధ్ర మహాసభ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆంధ్ర మహాసభ మితవాదుల్లో కొందరు భూస్వాములూ ఉండేవారు. భూస్వామ్య వర్గాల్ని సమర్థించేవారూ ఉన్నారు. నిమ్మగూడెం గ్రామంలో తిరుగులేని పెత్తనాన్ని సాగించిన రామభూపాల రావు నిజామాబాద్‌ సభల్లో చురుగ్గా పాల్గొన్నట్టు ఆళ్వారుస్వామి చిత్రించారు. ఇది ఎంతో సహజమైంది. భూస్వామ్య వర్గం సామాన్య జనం మీద చూపించిన ఆధిక్యం, ఆర్య సమాజ ఉద్యమకారుల చైతన్య ధోరణి, గ్రంథాలయోద్యమ తీరుతెన్నులు, తెలంగాణలో అపుడపుడే ఆరంభమవుతున్న పట్టణీకరణ ప్రక్రియ, గ్రామీణ సమాజంలో శ్రీ వైష్ణవ కుటుంబాల సంప్రదాయ ప్రయత్నం వారిని వదలని బీదరికం ఇట్లా ఎన్నో అంశాల్ని ఆళ్వారుస్వామి అత్యంత వాస్తవిక దృష్టితో వర్ణించారు. ప్రజలమనిషిని ప్రచురించే ముందు ఆళ్వారుస్వామి కొంత భయపడ్డారు. సందేహించారు. నవలా ప్రక్రియ నిర్దిష్టత అందులో ఉన్నదా? లేదా అన్న సందేహం కారణం కావచ్చు. సమున్నత వ్యక్తిత్వమున్న ఆళ్వారుస్వామి అత్యంత స్నేహశీలి అనీ, వినయ సంపన్నులని నాటి ఆయన మిత్రుల అభిప్రాయం. అందుకే ఆయన ప్రజల మనిషి ప్రచురణకు కొంత సందేహించి ఉంటారు. అయితే 'ప్రజలమనిషి' ఇంతింతై వటుడింతై అన్నట్టు నానాటికీ వ్యాప్తిని పొందింది. నేటి ప్రాంతీయ అస్తిత్వ సాంస్కృతికోద్యమ నేపథ్యంలో ఆళ్వార్‌ స్ఫూర్తి ఆనాటి రష్యన్‌ టాల్‌స్టాయ్‌ని గుర్తుకు చెప్తోంది. తెలంగాణ తెలుగు నవలకు ఆళ్వారుస్వామి ఏర్పర్చిన సూత్రీకరణలు ప్రయోగదీపికలు! రమారమి ఆళ్వారుస్వామి నవలలు రచించిన రోజుల్లోనే హైదరాబాద్‌ నవలా రచయిత భాస్కరభట్ల కృష్ణారావు కూడా రచనలు చేశారు. యుగసంధి, వెల్లువలో పూచిక పుల్లలు ఆయన రచనలు. ఆయన బుచ్చిబాబు స్థాయి సాహిత్య మేధావి. భాస్కరభట్లను తెలంగాణా బుచ్చిబాబు అని కూడా వర్ణించవచ్చు. ఆళ్వార్‌స్వామి ప్రజల మనిషి యావత్‌ తెలంగాణకు ప్రతీక అయితే, భాస్కరభట్ల నవలలు ఆయనకు బాగా తెలిసిన హైదరాబాద్‌ పాత నగర పరిసర జీవిత రేఖా చిత్రాలు. వర్తమాన వాస్తవికత ఆళ్వార్‌స్వామి నవలా లక్షణమైతే సమీపగత వాస్తవికత భాస్కరభట్ల నవలల్లోని కీలక లక్షణం. నవలా శిల్పం విషయంలో ఉభయులకూ తారతమ్యాలు ఉన్నాయి. దేశి పద్ధతి ఆళ్వారు స్వామిది. మార్గమార్గం భాస్కరభట్ల తత్త్వం.

ఆళ్వార్‌ స్వామి స్ఫూర్తిని, ఆయన ప్రజల మనిషి నవల ద్వారా చూపించిన సమకాలీనత - వాస్తవికత అన్న సూత్రీకరణల్ని బలంగా ముందుకు తీసుకొనిపోయిన ప్రతిభావతుడు దాశరథి రంగాచార్య. ఆళ్వార్‌ ఆశయాల కొనసాగింపు కోసమే తాను నవలా రచనను ఆరంభించినట్టు రంగాచార్య ఏనాడో ప్రకటించారు. ప్రజల మనిషిలో అత్యంత పరిమిత స్థాయిలోఉన్న తెలంగాణ మాండలిక ప్రయోగాన్ని అత్యంత విస్తారంగా మార్చిన ఘనత రంగాచార్యకే దక్కుతుంది. శిల్పం విషయంలో చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ రంగాచార్య రచనల్ని కాంతివంతంగా మార్చింది. రంగాచార్య తొలి రచన 'చిల్లర దేవుళ్లు'. ఈ రచనలో రంగాచార్య 'కృత్యాద్యవస్థ' ఏదీ కన్పించదు. ఇంగ్లీషు మాటలో చెప్పాలంటే 'ఈజ్‌'లో రచించినట్టుగా ఉన్నదీ నవల. చిల్లరదేవుళ్ళు లోని వాతావరణం నాటి ఉమ్మడి వరంగల్లు జిల్లాలోని సగటు గ్రామ ప్రతిబింబం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో గాఢంగా అలుముకున్న చీకట్లను చిల్లరదేవుళ్ళు బలంగా ఆవిష్కరించింది. 1930వ దశకంలో మానవ హక్కులు మృగ్యమైన జాగీరు ప్రాంతాల జీవితాల సారాంశం చిల్లర దేవుళ్ళు. అయితే ఈ నవల ముగింపు అత్యంత నాటకీయ పద్ధతిలో ఉన్నదనే విమర్శలూ వినిపిస్తాయి. ఇది నిజమే. బహుశా 1970 వ దశకం తొలి రోజుల నాటి (అప్పుడే చిల్లర దేవుళ్ళు రచన జరిగింది) తెలుగు కాల్పనిక నవలల ప్రభావం ఈ ముగింపునకు కారణం కావచ్చు. నవల ముగింపులోని కృతకత్వంపై విమర్శలు చేసేవారు కూడా ఆ నవల తెలంగాణ సమకాలీన వాస్తవికతలకు ప్రతిరూపమని అంగీకరించకుండా ఉండలేరు. సమకాలీనత - వాస్తవికత అన్న సూత్రీకరణలు మోదుగుపూలు, జనపదం, మాయజలతారు, పావని వంటి రంగాచార్య అనంతర నవలల్లోనూ బలంగానే ఉంది. మోదుగుపూలు రంగాచార్యకు బాగా ఇష్టమైన నవల. తెలంగాణ సమాజం చైతన్యవంతమవుతున్న 1940వ దశాబ్ది నాటి వాస్తవికత ఈ నవలలో ఉంది. చిల్లరదేవుళ్ళు ముగింపులో ఉన్న నాటకీయత ఏదీ మోదుగుపూలలో లేదు. మోదుగు పూలు నవలకు కొనసాగింపు జనపదం. ఇదొక సుదీర్ఘ నవల. ''ఒక ప్రక్రియగా నవల కొన్ని తరాల జీవితాన్ని చిత్రించాలనే'' సంప్రదాయ సూత్రానికి జనపదం చక్కని అనువర్తన! 1948లో జరిగిన సంస్థాన విమోచనం మొదలుకొని 1970ల్లో అంకురించిన వామపక్ష తీవ్రవాద (నక్సలైట్‌) ఉద్యమం దాకా, తెలంగాణలో సంభవించిన వివిధ పరిణామాల్ని జనపదం కళాత్మకంగా చిత్రించింది. (నవలా శిల్పంలో లోటు లేదని ధ్వనింపజేసేందుకే ఇక్కడ కళాత్మకం అన్న పదాన్ని వాడవలసి వచ్చింది) జనపదం సుదీర్ఘ రీతిలో సాగడం వల్ల పాత్రలు - వాటి వ్యక్తిత్వ చిత్రణలు బలహీనమయ్యాయనే విమర్శ పాక్షికమే. రమారమి పాతిక సంవత్సరాల పరిణామ క్రమ చిత్రణలో ఎన్నెన్నో పాత్రలు రావడం పోవడం కూడా సహజం. ప్రతిపాత్రకూ ప్రాణ ప్రతిష్ఠ చేయాలనుకుంటే శిల్పం బరువు పెరిగి వస్తువు అణగారిపోతుంది. తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలను తట్టుకోలేని బడుగు వర్గాల వారు జీవిక కోసం భాగ్యనగరానికి తరలిపోవడం, అక్కడ మురికి వాడల్లో గూడును ఏర్పర్చుకోవడం, అక్కడి వారి జీవన గమనంలో వినిపించిన పలుశ్రుతులు - కొన్ని అపశృతులు 'మాయ జలతారు' నవలలో చిత్రించబడ్డాయి. ఇందులో 1940-50 నాటి తెలంగాణ గ్రామీణ వలసల చిత్రణ ఉంది. 1970వ దశాబ్దిలో తెలంగాణలో ప్రాథమిక విద్యారంగంలో పలు వికాసవంతమైన పరివర్తనలు జరిగాయి. ఆనాటి తరంలో విద్యపట్ల జిజ్ఞాస పెరిగింది. చైతన్య స్థాయి క్రమేపీ తేజోవంతమైన స్థితికి వచ్చింది. ఈ వాతావరణంలో ఒక ఉపాధ్యాయుని సుదీర్ఘ వ్యక్తిత్వాన్ని రంగాచార్య 'పావని' నవలలో చిత్రించారు. 1978లో రచించిన పావని రంగాచార్య లేఖిని నుండి వెలువడిన చివరి నవల. రంగాచార్య నవలలన్నీ 1970-80 మధ్య కాలంలో రచింపబడినవే కావడం విశేషం. ఆ సంధికాలంలోనే తెలంగాణ తనను తాను సమీక్షించుకుంటోంది! ఒక తరం గడిచిపోయి మరో తరం ముందుకు వస్తున్న కీలక సమయమది.

తెలంగాణ నవలా రచయితల్లో నవీన్‌ మార్గం ప్రత్యేకమైనది. ఆయన అత్యంత ప్రతిభావంతుడైన రచయిత. ఇంగ్లీషు సాహిత్యంలో పరిమిత పరిధిలో పరిచయమైన చైతన్యస్రవంతి స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్షియస్‌నెస్‌ శిల్పాన్ని తెలుగువారికి తన రచనానువర్తన (అంపశయ్య నవల) ద్వారా పరిచయం చేసిన ఘనత నవీన్‌కే దక్కుతుంది. చైతన్య స్రవంతిని ప్రధాన శిల్పధోరణిగా ఎంపిక చేసుకున్న తొలి తెలుగు నవలా రచయిత ఆయనే. (రావిశాస్త్రి అల్పజీవిలో ఈ ధోరణి ఉన్నప్పటికీ అది పాక్షికం) నవీన్‌ తొలి రచన 'అంపశయ్య' ఇప్పటికీ ఆయన అత్యుత్తమ రచన. అంపశయ్య నవల ప్రస్తావన వచ్చిన వెంటనే నవలా విమర్శకులు ఆ నవలను 'శిల్ప సాంకేతికాంశాల' విశ్లేషణలోనే ప్రశంసిస్తారు. నిజమే, అసాధారణ స్థాయి 'శిల్ప సాంకేతికత' అంపశయ్యలో ఉంది. అయితే ఈ నవలలో చిత్రించిన పరిస్థితుల సమకాలీనత - వాస్తవికత అనే కొలమానాలతో మదింపు వేయడం కూడా అవసరం. నవలాకేంద్రం ఉస్మానియా యూనివర్సిటీ. నవలా వస్తువుతో మనకర్థమవుతున్న కాలం 1960. రవి ఒక తెలంగాణ విద్యార్థి. సంపన్నుడు కాడు. ఆర్థికంగా నిరంతరం చితికిపోయే 'వర్షాధార వ్యవసాయ' కుటుంబం నుండి వచ్చిన యువకుడు. రవి - అతడి ఆలోచనలు - అతడి మిత్రులు - అతడి మిత్రుల్లో అప్పటికే అల్లుకు పోయిన పలు తాత్త్విక ఆకాంక్షలు, ప్రత్యేక రాష్ట్రం కోసం వ్యక్తమవుతున్న ఆసక్తులు - హిపోక్రసీ అలుముకున్న వాతావరణంలో రవి వంటి సరళ స్వభావి పడ్డ అవస్థలు; రవి స్వగ్రామంలో మారని సామాజిక స్థితిగతులు - ఇట్లా కొత్త కోణంతో అంపశయ్యను తిరిగి అంచనా వేసినట్లయితే సమకాలీనత - వాస్తవికతలకు చేరువయ్యే అనేక అంశాలు అందులో దొరుకుతాయి. సమకాలీనత - వాస్తవికతలకు వినూత్న శిల్ప సాంకేతికతను మిళితం చేయడం ద్వారా అంపశయ్యను అపూర్వంగా తీర్చిదిద్దారు నవీన్‌. చీకటి రోజులు - అంతస్స్రవంతి నవలల్లోనూ శిల్ప సాంకేతికత ఎంతో విలక్షణంగా ఉంది. అయితే ఈ నవలల్ని కూడా సమకాలీనత - వాస్తవికత అనే సూత్రాలపై తిరిగి బేరీజు వేయడం నేటి సందర్భంలో సముచితంగా ఉంటుంది. అయితే నవీన్‌ రచనలన్నిటిలోనూ పై సూత్రాలు అనువర్తింపజేసే అవకాశం లేదు. 21వ శతాబ్ద ఆరంభంలో నవీన్‌ రచించిన 'బాంధవ్యాలు' ఇతర నవలల్లో సమకాలీనత - వాస్తవికతలు ఉన్నా నవలా ప్రక్రియకు ప్రాణం వంటి శిల్పం బాగా బలహీనపడింది. అంపశయ్య - చీకటి రోజులు - అంతస్స్రవంతి - ఈ మూడు నవలల్ని సమకాలీన వాస్తవికతల ప్రాతిపదికలపై తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఖచ్ఛితంగా ఉంది. నవీన్‌ శిల్ప ప్రతిభను ఎందరో అభిమానించారు. అయితే ఈ విషయంలో ఆయనను అనుకరించిన వారు మాత్రం కనిపించరు.

1970ల్లోనే దిగంబర కవి చెరబండరాజు నవలా ప్రక్రియా రచన చేపట్టారు. చెరబండ రాజు సిద్ధాంత నిబద్ధత, విప్లవ నిమగ్నతలు తిరుగులేనివి. విప్లవమే అన్ని సమస్యలకు పరిష్కారమవుతుందనే సూత్రాన్ని చెరబండరాజు త్రికరణశుద్ధిగా నమ్మారు. ఇదే సత్యాన్ని ఆయన తన 'మా పల్లె' నవలలో ప్రకటించారు. మా పల్లె 1970వ దశాబ్ది ఆరంభంలో విప్లవ పవనాల్ని స్వాగతించిన గ్రామ జీవిత చిత్రణ. అప్పటికే బలపడిన భూస్వామ్య వర్గాలకూ అప్పుడపుడే వెల్లువెత్తుతున్న విప్లవ తరానికీ సంఘర్షణలు సంభావించడం సహజం. ఈ నేపథ్యంలో రచయిత తాను విప్లవ తరం వైపు ఉంటానని మా పల్లెలో స్పష్టం చేసినట్టు అవగతమవుతోంది. నవలలో పాత్రల అల్లిక, కథాకథనం ఒకక్రమ పరిణామంలో ఉన్నాయి. అయితే మా పల్లెలో మరింత శిల్ప సౌందర్యం ఉంటే బాగుండేదనిపిస్తుంది. పల్లెల నుండి బీద ప్రజల ప్రస్థానమే చెరబండ రాజు 'ప్రస్థానం' సమకాలీనత - వాస్తవికత అన్న సూత్రాలకు చెరబండరాజు నవలలు దూరం కాలేదు.

1980-90 సంవత్సరాల మధ్యకాలంలో తెలుగు నవలా రంగ పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఈ సందర్భంలో ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. తెలుగులో ప్రధాన స్రవంతి నవలలన్నీ 'వ్యాపార నవలలు'గా, గుర్తింపును పొందిన కాలమది. ప్రసిద్ధ రచయితలుగా పేరున్న పలువురు నవలా కర్తలు నేల విడిచి సాము చేసే వస్తువులతో నవలల్ని వండివారుస్తున్న సమయమది. అత్యంత కృతకత్వంతో నవలల ఉత్పాదకత పెరిగిన వాతావరణమది. ఆనాటి వ్యాపార నవలలు ఈ రోజు పత్తా లేకుండా పోవడం ఆయా నవల్లోలోని సత్తాను తెల్పుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఇటువంటి వ్యాపార నవలలకు కొంత ఆదరణ దొరికింది. తెలంగాణ సీమల్లోనూ ఈ తరహా నవలలకు పాఠకులు ఉండేవారు. సమకాలీనత -వాస్తవికత అన్న సూత్రాన్ని ఈ కృతక నవలలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనువర్తించలేము. అయితే, ప్రధాన పత్రికలు - పాఠకలోకం కూడా వ్యాపార నవలల్నే బాగా ఇష్టపడుతున్న రోజుల్లో తెలంగాణ నుండి సమకాలీనతకు వాస్తవికతకు అద్దంపట్టే నవలలు వచ్చాయి. అదీ గొప్ప విశేషం. 1940ల నుండి అదిలాబాద్‌ జిల్లాలో గోండు ఆదివాసీలపై జరుగుతున్న దోపీడీల తీరును వసంతరావు దేశ్‌ పాండే 'అడవి' నవల 'కళాత్మక డాక్యుమెంటరీ'గా చిత్రిస్తే; కరీంనగర్‌ పల్లె పట్టుల్లో నివురు గప్పిన నిప్పుల్లా జన విప్లవకాంక్షల్ని అల్లం రాజయ్య 'కొలిమంటుకున్నది' చూపించింది. బీడీ కార్మిక జీవన నేపథ్యంలో కరీంనగర్‌ పల్లె జీవితం బి.ఎస్‌.రాములు ''బతుకు పోరు''లో స్పష్టంగా కనిపించింది.ఈ రచయితలు శిల్ప సాంకేతికత విషయంలో ఎటువంటి సంక్లిష్టతలు వైపు దృష్టి పెట్టలేదు. అత్యంత సహజంగా వాస్తవికతను చూశారు, రచనల్లో చిత్రించారు. గ్రామీణ సామాజిక పరిణామక్రమాన్ని బోయజంగయ్య వంటి రచయితలు వాస్తవికంగా చిత్రించారు. మాండలిక ప్రయోగాలకు ఏ మాత్రం వెనకాడకపోవడం ఆ దశాబ్ది తెలంగాణ నవలా రచయితల విశిష్టతల్లో ఒకటి.

కాలువ మల్లయ్య తెలంగాణ నుడికారంపై చక్కని అవగాహన సాధించారు. 1990వ దశాబ్ది ఆరంభంలో ఆయన రచించిన వ్యాసాలు ఈ సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయన అదివరకే తెలుగు కథానికా ప్రక్రియల్లో పరిణితిని సాధించారు. 1990ల్లో నవలా రచన ఆరంభించారు. 'సాంబయ్య చదువు' నవల స్వాతంత్య్రానంతర కరీంనగర్‌ జిల్లా గ్రామీణ జీవితానికి అక్షరాక్షర ప్రతిబింబం. ఈ జిల్లాల్లో చోటు చేసుకున్న ఉద్యమాలు హేతువుల్ని సాంబయ్యచదువులో ప్రతీకాత్మకంగా చూడవచ్చు. విశాలాంధ్ర అవతరణ అనంతర కాలంలో పలు ఉద్యమాలకు కరీంనగర్‌ జిల్లా ఆరంభ కేంద్రమైన చారిత్రక సత్యం విస్మరణకు వీలులేనిది. తిరుపతయ్యనవలల్లోనూ కరీంనగర్‌ జిల్లా జీవన పార్శ్వం ఆవిష్కృతమైంది.

1990వ దశకం అనంతర కాలం తెలంగాణ సాంస్కృతిక జీవనంలో ఒక మహత్తరమైన పునరుజ్జీవన దశ. ఈ కాలంలోనే తెలంగాణ తనను తాను పునస్సమీక్షించుకున్నది. తనకు అన్ని రంగాల్లో జరిగిన అన్యాయాల్ని, తనకు న్యాయంగా దక్కవలసిన అన్నిరకాలైన వాటాల్ని తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకున్న కాలం ఇది. తెలంగాణ సాహితీ జగతి పడి లేచిన కడలి తరంగం వలె ముందుకు జరిగిన కాలం కూడా ఇదే. కోస్తాంధ్ర ప్రాంతం తన గత వైభవ స్మరణతో ఉన్న కాలంలో తెలంగాణ ప్రాంతం తన సమకాలీన వైభవంపై ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించేందుకు సంసిద్ధమైన కాలం కూడా 1990వ దశకమే. 1990 నుండి ఆరంభమైన విద్యాకాంక్షలు, 1980ల నాటి సామాజిక రాజకీయ ఉద్యమాలు తెలంగాణాలోని అన్నివర్గాల నుండి ప్రతిభావంతులైన రచయితల్ని తయారుచేశాయి. సామాజిక వాస్తవికతల్ని, మరచిపోయేందుకు వీలులేని సమకాలీనతల్ని కళాత్మకంగా రికార్డు చేయగలిగిన ప్రతిభావంతులు ఈ రచయితలు. 1990లలోనే విజృంభించిన ప్రపంచీకరణ వెల్లువ ఈ ఒత్తిడిలో తెలంగాణ గ్రామీణ జీవిత నిర్మితిలో చోటు చేసుకున్న విధ్వంసం, వలస బ్రతుకులు, మార్పును కోరుతున్న మార్పును అంగీకరించని వర్గాల మధ్య ఘర్షణలు ఇవన్నీ ఈ తరం తెలంగాణ నవలా రచయితల్లో రచనల్లో గుర్తించవచ్చు. అయితే శిల్పం విషయంలో మరింత వినూత్నత అవసరమేమో.

తెలంగాణ పునాది వాస్తవికతలు మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఊహాత్మక స్థాయిలో రచించబడిన మృత్యుంజయులు (బొల్లిముంత శివరామకృష్ణ) రథ చక్రాలు (మహీధర రామమోహనరావు) వంటి రచనలకు గతంలో తెలంగాణ పోరాట సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉండేది. అయితే తెలంగాణ నవలా సాహిత్యాన్ని కొత్త కొలమానాలతో అంచనా వేస్తున్న క్రమంలో ఈ ఊహాత్మక నవలలు గత ప్రాముఖ్యతను కోల్పోయాయి. వాస్తవికతలకు ఆమడదూరంలో తెలంగాణ పోరాటాన్ని వర్ణించిన తెలంగాణ రచయితల నవలలుకూడా విమర్శల్ని ఎదుర్కొన్నాయి. తెలంగాణ 'వ్యావసాయిక వాస్తవికతల్ని' చిత్రించడంలో విఫలమైన అన్యప్రాంతీయుల రచనలపై బలమైన విమర్శలు వెలువడ్డాయి.

నవల ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ. సుదీర్ఘమైన కాల గమనాన్ని స్వతంత్ర రీతిలో ఆవిష్కరించగలిగే అవకాశమున్న ఏకైక సాహిత్య ప్రక్రియ. ఒక తరాన్ని చరిత్ర గ్రంథాలలో అవసరం లేకుండానే మనకు పరిచయం చేయగలిగే ఏకైక సాహిత్యప్రక్రియ. వాస్తవికత - సమకాలీనత ఈ ప్రక్రియకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన ఆభరణాలు కూడా. తెలంగాణ తెలుగు నవల ఈ అద్భుత ఆభరణాలతో నిండుగా అలంకరించబడింది. అందుకే సమకాలీనత + వాస్తవికత = తెలంగాణ తెలుగు నవల.