ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

    నాలుగు నెలలు మందులిచ్చి ఇంటికి పొమ్మన్నాడు నా వైద్యుడు. "నీకిక ఫరవాలేదు. వజ్రకాయుడివి" అని ఆశీర్వదించాడు. నా శరీరము లోని బలహీనతలు, బలహీనతలకు కారణమైన వ్యాధులు మొదలంటా రూపు మాసిపోయినంత ధైర్యము పొందాను. ఏ అమృతమో నేను తెలుసుకోలేని ఇంక ఏదేని గొప్పవస్తువో వైద్యుడు నాకు వాడి ఉంటాడని ఉల్లాసపడ్డాను. వికసించిన ముఖంతో ఇంటికి బయలుదేరాను.

    ప్రతి నిత్యం ఆహారవిషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ వైద్యుడు ఏకరువుపెట్టాడు. ఆయన విధించిన షరతులన్నింటిలో ప్రతినిత్యము పరగడుపున పావుసేరు ఆవుపాలు తాగటం చాలా ముఖ్యమైంది.

    ఇంటికి వచ్చిన తరువాత ఆవుపాల కోసం ఎంతో అవస్థపడ్డాను. నమ్మకంగా కల్తీలేకుండా ఆవుపాలు దొర్కడం ఈ రోజుల్లో కష్టమని నా ప్రయత్న ఫలితం తేల్చివేసింది. "మనుషుల్నే కల్తీ చేస్తున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆవుపాలు ఎట్లా దొరుక్తాయి?" నా మిత్రుడు సీతయ్య అన్నాడు. అప్పుడే అతడు వోట్ల పోలింగు బూత్‌నుండి నిరుత్సాహంతో ఇంటికి వెళ్తున్నాడు. పోలింగులో తన ఆప్తమిత్రులే, బాగా పరిచయం వున్నవాళ్ళే మారుపేర్లతో మభ్యపెట్టే మాటలతో చేస్తున్న చేష్టపై అసహ్యత కల్గిందేమో! వారి ఆటలను కట్టివేయడం నిజాన్ని బట్టబయలు చేయడం శక్తికి మించిన పనైందేమొ! తుదకు సీతయ్యకు నిరాశ నిస్పృహకల్గి నిర్వీర్యుడై దేబె ముఖంతో ఇంటిదోవ పట్టడమే అతని మనసులో చెలరేగుతున్న తుఫాన్ను అడ్డుకొనుటకు మార్గమనుకున్నాడేమొ!

    అతని ఆ మాటలు నా అమాయకత్వాన్ని అద్దంలో చూపించినట్టనిపించింది. అయినా ఆవుపాలు దొరకని పరితాపము నన్ను వేధిస్తూనే వుంది. ముఖ్యమైన పెద్ద పెద్ద పాల దుకాణాలన్నీ తిరిగాను, వేల రూపాయిల బేరం చేసే పాలవాండ్లను అడిగాను. తుదకు విసిగి పోయాను. కాని ఒక విషయంలో మాత్రం నాకు చాలా తృప్తి కల్గింది. పాలబేరం చేసే ప్రతివాడు కల్తీలేని ఆవుపాలు దొరకవని చెప్పే స్థాయి కొచ్చాడు. అటువంటి నగ్నసత్యాన్ని అరమరికలేకుండా బయటపెడ్తున్నాడు. కల్తీపాలు కల్తీకానివని చెప్పి అమ్మ చూచే చైతన్యం మనోనిబ్బరం దెబ్బతిన్నందుకు సంతోషించాను.

    నేను ప్రతి రోజు ఆఫీసునుండి ఇంటికి పోయే సందులో పాలు పెరుగు అమ్మే ఒక చిన్న దుకాణంవుంది. అంత చిన్న దుకాణంలో ఆవుపాలు దొర్కవనే నమ్ముకంతో ఎన్నడూ అడ్గనేలేదు. కాని అనుకోకుండానే ఒకరోజు ఆ దుకాణంలో కూర్చున్న ముసలివాన్ని అడిగాను. "కల్తీలేని పాలు దొర్కడం కష్టం. మనం గట్టిగా మందులకు కావాలని పాలు తెచ్చే వాండ్లకు చెప్తే సరే నంటరు కాని నమ్మటం కష్టం" ఒక్కొక్క మాటను తూచినట్లు గొణ్గుతూ అన్నాడు. ఇంతలో ఒక అమ్మాయి పక్కగదిలోనుంచి తొంగి చూచింది." ఎందుకు దొర్కవుమామ. మన పెంటయ్య తాన మూడు ఆవులున్నయట. పాలు సుతం ఇస్తున్నయట. మనకు పోసే పాలల్లో ఆవుపాలు కల్పుకొనే తెస్తుంది." అంటు ఆ అమ్మాయి నాకెదురుగా వచ్చి నిల్చుంది. ఆ అమ్మాయి కండ్లు వింతగా తెర్చి పరీక్షగా చనువుగా నన్నే చూడసాగింది.

    "ఏమో మరి అడిగిసూడాలె" ఆ ముసలివాడు పాల కింది పొయిలో బొగ్గులు సవరిస్తూ అన్నాడు.

"    రోజు ఎన్నిపాలు కావాలెనీకు" మందహాసం తొణికిస్తు ఆ అమ్మాయి నన్ను ప్రశ్నించింది.

    ఇన్నాళ్లనుండి పాలు లేక విసిగివేసారివున్న నాకు ఆమె మాటలతో ఎంతో ఆశకల్గింది. పైగా ఆమె నా వైపు చూస్తున్న వైనం మాట్లాడే పద్దతి ఎటువంటి వాన్నైనా ఆకర్షిస్తుంది.

    ఆ అమ్మాయి చాలా అందంగానే వుంటుంది. పచ్చని శరీరము, వెడల్పాటికండ్లు, నిటారైన ముక్కు, పల్చని చెంపలు, దానిమ్మగింజల్లాంటి పండ్లు, ఎత్తుకు తగిన స్థూలము, బిగువైన రవికె, అద్దకపు తెల్లచీరెతో సొమ్ములులేని లోపాన్ని కప్పివేస్తున్నది. పాలసంగతి మరచిపోయాను. మనస్సు చెలించింది. నేనూ కండ్లన్ని ఆమె కప్పగించి తనివితీరచూచాను. ముసలివాడు తలనేలకువేసి పక్క చూపులతో ఇదంతా గమనిస్తూనే పాలను కల్పుతున్నాడు. కొంటెగా తనకుతనే నవ్వుకొనుచున్నాడు. నా చిత్తవికారానికి కాకలుతీరిన ఆ వృద్ధుడు తన మధురస్మృతుల్లో విహరించాడేమో.

    అన్ని బలహీనతల నుండి కోలుకొని "వజ్రకాయుడు"గా వైద్యునితో వరము పొందానుకదూ. అయితే నా స్థితి బలహీనమునకు చిహ్నమా, పుష్టికి పునాదా. తికమకపడ్డాను. తిరిగి తలెత్తి ఆ అమ్మాయిని చూడటానికే సాహసంకల్గ లేదు.

    "ఉ" అన్నది ఆ అమ్మాయి.

    తలెత్తిచూచాను. నా ప్రత్యుత్తరానికై ఆ అమ్మాయి తన కండ్లపాపలను, కనుబొమ్మలను ఆడిస్తూ ప్రశ్నించింది. నా మనస్సును స్థిమితపర్చుకొని "రోజు అద్దశేరుచాలు" అన్నాను.

    "రూపాయి కొక...." అంటు ఆ అమ్మాయి కొంటెగా చూపుడువేలు చూపింది.

    "ఆ" అన్నాను.

    "ఒకసారేందే పిచ్చిముండ" ముసలివాడు నవ్వాడు.

    "ఒకసారన్నానా మామ, ఒక సేరంటి" అని పైట సవరించుకుంటున్నట్టు నటించింది. "మరి ఏమంటవు ఇష్టమేనా?" అంటు ద్వారబంధాన్ని కౌగిలించుకొన్నట్లు అనుకున్నది, ఆమె శృతిమించుతున్నది. ఆరునెల్ల ఔషధసేవతో పొందాననుకొన్నశక్తి దారుఢ్యము నీరైపోయాయి.

    తత్తరపడ్తూ వణుకుతున్న నాలుకను స్వాధీన పర్చుకొని "ప్రతిరోజు పైసలిచ్చి పిల్లవాన్ని పంపుతుంటాను. కాగినవే పోస్తుండు తాత" తలవంచుకొని అన్నాను. ఆమెను చూడటానికే భయంవేస్తున్నది.

    "తాతకే చెప్పుకుంటున్నవు ? తాత ఎప్పుడు కూచోపోయినాడు? నేనే అమెశ దుక్నంలోవుంట. మరి ఏడిఏడియి ఇక్కడ్నె తాగిపోరాదు?" ఆ అమ్మాయి పాత బంధువంత చనువుగా అడిగింది.

    ఆ మాటలతో నేను గుటకలు మింగటం ఎక్కువైంది. సమాధానం యిచ్చే యోగ్యతలేకపోయింది. అవుతల పడాలని ఆలోచిస్తున్నాను. నాకు ఆవుపాలు ముఖ్యం. పాలమ్మాయి దూరపు కొండవలె నన్ను ఆకర్షిస్తున్నది. కాని దెగ్గర్కిపోతే?

    "ఏమిటి పిరికివేషం? ముగ్గురు పిల్లల తండ్రిని అంత అసమర్ధత ఎందుకు? నీవూ ఒక మగవాడివని అందులో అందమైన వాడివని ఆ అమ్మాయి మోహించింది. నీవు పక్కకు తొలగినంత మాత్రాన చేస్తున్న ఉద్ధారకమేమిలేదు" హృదయములో తుఫాను రేగింది. జ్వరలక్షణాలు ఏర్పడినై. చెవుల్లో గుయ్యుమని ధ్వనిపుట్టింది. నా మిత్రుడు వెంకట్రావు ఒకసారి వీపుతట్టి ఎన్నడో చేసిన హితవు జ్ఞాపకానికొచ్చింది. "ఎవరో ఏమేమొ తప్పులు చేస్తుంటారని అవినీతిగా మెల్గుతుంటారని మనం అనుకుంటాం కాని అటువంటి వాతావరణ పరిస్థితి ఒత్తిడి మనకు కల్గినపుడు మనము ఏమౌతామొ అప్పుడుగాని తేలదు." వెంకట్రావు నిజంగా అక్కడవుంటే నాకన్నీటితో అతని కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుందామన్నంత ఆవేశం పొందాను. మొఖమంతా మాడ్చుకుని ఆ అమ్మాయిని అసహ్యంగా చూస్తు "పిల్లవాడికి పైసలిచ్చి పంపుత. పాలుమాత్రం కల్తీలేకుండావుండాలే" అని తల నేలకు వేసుకొని గంభీరంగా ఇంటికి బయలుదేరాను.

    నాలుగు గజాలు ముందుకెళ్లి అనుకోకుండా వెనుకకు తిరిగి దుకాణం వైపు చూచాను. ఆ అమ్మాయి దుకాణంముందు నిల్చుండి నా వైపే చూస్తున్నది. "మహామహులను మంటకలిపాం. భస్మాసురున్ని బూడిదపాలు చేసాం. రుక్మాంగదుని రూపే మార్పించాం. దేవేంద్రున్ని దేబెగా తేల్చివేశాం. శివుడిని చిందులు తొక్కించాం. విప్రనారాయున్ని వీధికుక్క చేశాం. మా విసురుకు తూలిపోనివాడు ఎవడూ లేడు. అంతెందుకు బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అన్నంత ప్రతీకారం ఆమె చూపుల్లో తాండవమాడ్తున్నది.

    పాలమ్మాయి వలెనే ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఆహ్వానించిన నా భార్యను చూడగానే వాడిపోయిన నా మొఖంలో తిరిగి ఆనందం కళకళ లాడింది. ఎండలో అలసిసొలసి వచ్చిన నాకు దట్టమైన నీడ దొర్కినంతహాయొ కల్గింది.

    నా భార్య అందించిన కాఫీని తాగుతు నాకు నేనే ముసిముసిగా నవ్వుకుంటున్నాను. వక్కలు తీస్కొచ్చి పక్కకు కూర్చొని "ఏమిటండి! మీకు మీరే నవ్వుకుంటున్నారు?" అంటూ నా అంగీగుండీలను సదిరింది.

    పాలదుకాణం సంగతంతా చెప్పాను. "పాలకోసం పోతె ఆవే దొర్కింది. ఇంకేం? అదృష్టవంతులు". ఆల్మారాలోనుండి అంగీని తెచ్చి అందిస్తు కొంటెగా అన్నది నా భార్య.

    "ఆ ఆవు పాలు నాకెందుకు?" నిర్లక్ష్యంగా అన్నాను.

    "మీకు వైద్యుడిని అడిగి చూడండి. అసలు దొరకాలెగాని మనిషిపాలు చాలా మంచివి అని" కాఫీ కప్పు అందుకొని వెళ్ళిపోయింది.

    "చాలా బింకంగా మాట్లాడుతున్నావు. కాని నేను ఆ అమ్మాయి వలలోపడ్తే నీ వాలకం ఇట్లా ఉంటుందా?" పత్రికను చూస్తూనే అన్నాను.

    గ్లాసులో కాఫీ తెచ్చుకొని, ఒక గుటకవేసి, మందహాసం కురుపిస్తూ కూర్చొని, "అది మీకు ఉండాలె గాని మేము ఎన్నాళ్ళు పట్టి ఉంచగలం?" అన్నది నా భార్య.

    కాలుతున్న గ్లాసును పైట కొంగుతో పట్టుకొని, ఒక్కొక్క గుటకవేస్తూ, ఎవరెవరి భార్యలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నది, ఎవరెవరి భర్తలు ఎన్ని పిచ్చిచేష్టలు చేస్తున్నది ఏకరువు పెట్టింది.

    "మరి మనగురించి కూడా మనవలెనే ఎందరను కుంటున్నారో?" పత్రికను చూస్తూనే ప్రశ్నించాను.

    "ఎవరేమనుకొంటే మనకేమండీ! మనసంగతి మనకు తెలియకుండా ఉంది? ఎవరినీతి వారినే కాపాడుతుంది... ఇంతకూ ఆ అమ్మాయి విధవా, ముత్తైదా?" కాఫీగ్లాసును పక్కకు గోడవెంటపెట్టి సోద వాగిద్దామన్నట్టు కూర్చున్నది.

    "ఏమో! అవన్ని ఎప్పుడు పరీక్షిస్తిని, ఆమె చూపులు విన్యాసాలతోనే హడలిపోతిని" అని పత్రికనుమడిచి కిటికిలోంచి బజారువైపు చూచాను.

    నాభార్య పైటకొంగు ముడివిప్పి, వక్కలు నోట్లోవేసుకొని "మగవాడికో ఆడది, ఆడదానికో మగవాడు - ఇద్దరూలేందే ఈ కుళ్ళు బయలుదేరదు గదా! దీంట్లో ఎవరిది తప్పంటాం" నిస్పృహతో అన్నది.

    మెల్లగావచ్చి నా పక్కకు నిల్చుండి, కిటికీలోంచి బజారువైపు చూస్తూ, "ముఖ్యంగా మీకు ఆవుపాలు దొరికాయి. కండ్ల కింపైన అమ్మాయి కనబడింది. కంటికింపైతే కడుపుక్కూడ ఇంపుగా వుంటాయి. తాగిన పాలు బాగా వంటపడ్తాయి." అనికొంటెగా నన్ను చూచింది.

    నా భార్య గొప్పతనానికి మనోనిబ్బరానికి నేను ఉబ్బిపోయాను. అటువంటి భార్యను కలిగియున్నందుకు చెప్పరాని ఆనందం కలిగింది.

    ప్రతి రోజూ పాలు తెప్పించుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజు ఆ బాటన ఆఫీసుకు వెళ్తూ, వస్తూనే ఉన్నాను. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు సుమారు వంద గజాల దూరంనుంచి నన్ను కనిపెడ్తూ చూస్తూ ఉండేది. ఆ అమ్మాయి , యీలోగా లక్షసార్లేనా ఆ బాటన నేను పోతుండగా చూచి ఉంటుంది. కాని నేను మాత్రం ఆ విషయం కనిపెట్టలేదు.

    పాల బేరం కుదిరింతర్వాత ప్రతిరోజు ఆమెకండ్లు, నా కండ్లు కలుసుకోవడం, అప్పుడు నా మిత్రుడు వెంకట్రావు కండ్లలో ప్రత్యక్షమవడం జరుగుతుండేది.

    ఓసారి సినిమాకు పోతూ, ఆ అమ్మాయిని నా భార్యకు చూపించాను."పాపం! ఏదో మంచి ఇంటి అమ్మాయివోల్నే ఉంది. ఎట్లా ఈ కుళ్ళులో ప్రవేశించిందో" నా భార్య తనకు తానే మధనపడ్డది. "అవకాశాలు తక్కువున్నాయి గనుకనా?" తిరిగి అన్నది.

    సుమారు మూడు నెల్లు గడిచాక ఒకనాడు సాంయంత్రం ఆ బాటన వెళ్తున్నాను. మసక, మసక చీకటి ఉంది. నేను ఆ దుకాణం దాటి రెండుగజాలు ముందుకు వెళ్ళానోలేదో "లెక్క చూసుకోకపోతివి" ఆ అమ్మాయి పెద్దగా అన్నది. నేను వెనుకకు తిరిగి చూచాను. "నిన్నే రమ్మన్నది" చేతులాడించుకుంటు అన్నది.

    నాకు పరీక్ష సమయమాసన్నమైందనుకున్నాను. వెనుకకు తిరిగి దుకాణం వద్దకు వెళ్ళాను. "ఏంలెక్క? ఎప్పటికప్పుడు డబ్బులిస్తూనే ఉన్నానుగా" అంటూ కండ్లల్లో కండ్లు నిలిపి ప్రశ్నించాను.

    ఆ అమ్మాయి ఆలోచిస్తున్నట్టు తల వంచుకొని "మేమే మీకు పైసలివ్వాలె" అన్నది. ఆమె శరీరం పులకించింది. అలసినట్టు ఒక దీర్ఘ నిశ్వాసాన్ని వదిలింది.

    ఒక స్త్రీని వలలో వేసుకోవడానికి, ఆమెలో దుర్బుద్ధి రేకెత్తించడానికి నూటికి నూటాయేబైవంతు పురుషుని దుష్టచింతన, ప్రేరేపణ ఉంటుందని నా విశ్వాసం. కాని ఆ అమ్మాయచొరవ, నిర్భీతి నా విశ్వాసాన్ని తప్పని తేల్చివేశాయి.

    ఆ బాటన పొయ్యేవాండ్లు మమ్ములను వింతగా చూసి, తిరిగి,తిరిగి వెనుకకుమళ్ళీ చూస్తూపోసాగారు.

    "ముసలాయన లేడూ? ఎక్కడపోయాడు?" లోపలికి చూస్తూ అడిగాను.

    "అవు! లేడు. ఊరికిపోయిండు. రేపో, ఎల్లుండో వస్తడు" అని దీనంగా నావేపు చూచింది" ఆ దీనతలో "ఈ అవకాశాన్ని వృధా పోనియ్యవద్దు" అని ఆమె కండ్లు అంటున్నాయి.

    ఒయ్యారంగా తలఎత్తి "నీకోసం మీగడ దాచి ఉంచిన తినరాదు!" అన్నది.

    "నిక్కముదాపనేల ధరణీసురనందనయింకనీపయిన్‌

    జిక్కె మనంబు నాకు ననుజిత్తజు బారికినప్పగించెదో

    చొక్కి మరంద మద్యముల చూఱల బాటలువాడు తేండ్ల సొం

    పెక్కిన యిట్టిపూవు బొదిరిండ్లను గౌగిటగారవించెదో."

    అన్నట్టు ఆమె ఒయ్యారం ప్రదర్శించింది. దాంతో నాకు కలిగిన ఉద్రేకాన్ని చంపుకొని, "మీగడ వద్దులే. కాని పాలుకల్తీ లేకుండా పోస్తున్నవా?" విషయం మార్చాను.

    "కల్తీ ఎందుకు లేదు గానీ..... " తలెత్తి కొంటిగా నన్ను చూచింది." ఆ కల్తీ నీకు నుక్సాన్‌ చెయ్యలేదులే. మరింత బలంవస్తది" అని ఫక్కున నవ్వింది.

    "అంటే?" బొమ్మలు ముడిపెట్టి ఆశ్చర్యంగా అడిగాను.

    "మనిషిపాలు .... యిష్టమేనా?" వంకరగా మెడలు తిప్పి ప్రశ్నించింది. నేనేమీ సమాధానమివ్వకముందే "నాపాలే కలుపుతున్న" అని పెండ్లి పిల్లవలె తల నేలకువేసి "రాత్రి ఎనిమిది గంటలకువస్తే.... " సమాధానానికై నిరీక్షిస్తున్నట్టు అట్లాగే తలకునేలకు వేసి ఉంచింది.

    స్త్రీ నోట ఆ విధంగా వినడం నాకేసిగ్గుగా తోచింది. ఆమె పరిసరాలు ఆమెలోని స్త్రీత్వమును, లజ్జను మొదలంట రూపుమాపాయని ఆదరిపోయాను. నా ఒళ్ళంతా చెమటలు పట్టింది. నా భార్య మాటలు జ్ఞాపకాని కొచ్చాయి. మితృడు వెంకట్రావు కండ్లల్లో ప్రత్యక్షమయ్యాడు.

    వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ అమ్మాయిలోఅప్పుడు సిగ్గు ఆవరించింది. నన్ను భూమిని మెల్లగా చూడసాగింది.

    ఇంతలో నా మిత్రుడు మల్లేశం ఆ బాటనపోతు, నన్ను చూచి ఆగిపోయాడు. "ఇక్కడ నిల్చున్నా వెందుకో?" అని భుజాన చేయివేచి, క్రీగంట అమ్మాయని చూచాడు. నేను ఏమీ సమాధాన మివ్వకనే పరీక్షగా మల్లేశాన్ని చూచాను.

    "అవును, పనిఉండే వచ్చాను. నేనిక్కడ ఆవుపాలు కొంటున్నాను. వెళ్దాంపద" అని బయలుదేరి రెండడుగులు తిరిగి వెనుకకు వేసి, "చూడు అమ్మాయి ఇప్పుడే వస్తాను." అని తోవ బట్టాను. ఆమె మల్లేశాన్ని క్రోధంగా చూడసాగింది. "సమయానికి వీడెవడో తారసిల్లిండు" అని ఆమె బొమలు ప్రకటిస్తున్నాయి.

    ఆ అమ్మాయి విషయం, ఇదివరకే మల్లేశానికి చాలా వివరాలుతెలుసు. వివరంగా ఆ విషయాలన్ని నాతో చెప్పాడు. నాకు కలిగిన అనుభవాన్ని వివరించాను. ఆ అమ్మాయిని ఆ విధంగా గాలిపటం వలె ఉండనివ్వొద్ధనుకున్నాను. నా నిశ్చయానికి మల్లేశం చేయూతనిస్తానన్నాడు.

    మల్లేశం, నేను నేరుగా మా యింటికివెళ్ళి నాటి సంఘటన వివరాలన్నీ నా భార్యకు చెప్పాం మా నిర్ణయాన్ని తెలిపాం.

    "మీకెప్పుడూ ఏదో ఇటువంటివే వెంటపడ్తుంటాయి. సరే కానియ్యండి, చలికాలం చాలా రాత్రి వరకూ పోకండి" అని నా భార్య అమోదముద్ర వేసి అనుమతిపత్రం ప్రసాదించింది.

    ఆ అమ్మాయి కంటపడకుండా మల్లేశాన్ని మమ్ముల అనసరించమని చెప్పి, నేను రాత్రి ఎనిమిదిగంటలకల్లా పాలదుకాణం చేరుకున్నాను. అమ్మాయి సింగారించుకొని, ఉల్లాసంగా ఉంది.

    "మా మామ ఇప్పుడే ఊర్నించి వచ్చిండు. బయటపనుండిపోతనని సెప్పిన. నీవాడికి రమ్మంటే ఆడికొస్త" చనువుధోరణిలో అంది.

    "సరే అయితే, బయలుదేరు"

    "నువ్వు ముందుగా నడువు. నేను ఎనకాల ఒస్త"

    నేను ముందట, కొంచెందూరంగా ఆమె, ఆమెకు చాలా దూరంగా మల్లేశం, పబ్లిక్‌ గార్డెన్స్‌కు చేరుకున్నాం. మల్లేశం మాకు కనిపించేటట్టే దూరంగా కూర్చున్నాడు. యధార్థములో నాకు తోడుగా ఉండాలనే మల్లేశాన్ని రమ్మన్నది.

    పబ్లిక్‌ గార్డెన్స్‌లో లైటుకు దూరంగా ఒక చెట్టు కింద, ఆమె నేను ఎదురుబడి కూర్చున్నాం. ఆమె మాట్లాడాలని ప్రయత్నిస్తున్నది. కాని మాట ఉబికి రావడం లేదు. ఉత్తమ ఇల్లాలువలె బిడియంతో కూర్చుంది.

    "నీకు పెండ్లి అయిందా?" గంభీరంగా అడిగాను.

    "ఆ! మూడుసార్లు"

    నిర్విణ్ణుడయ్యాను.ఆమె కండ్లల్లో నీళ్ళు తిరిగాయి.

    "ఆ ముసలాయన నీకు మామెట్లా?

    "ఏదో ఒక వరుస ఉండాలని "మామ" అని పిలుస్తున్నా" గద్గదస్వరంతో అంది.

    "అతనికి నీకు సంబంధం?"

    నీళ్ళతో మెరుస్తున్న కండ్లను నా కండ్లమీద నిలిపి, "నాకు ఆయనకేం సంబంధం?" తిరుగు ప్రశ్న వేసింది.

    "అదికాదు సంగతి. నీకు ఆయనకు ఎట్లా పరిచయం కలిగింది. నిన్నెక్కడ్నించి, ఏమని ఇక్కడికి తెచ్చిండు అని అడుగుతున్న."

    "పెండ్లి చేస్తానని తీస్కొచ్చిండు."

    "ఉ నాలుగో పెండ్లా?

    "పెండ్లిలేదు, పెడాకులులేదు. అందరు పెండ్లి చేస్తనని యీడికి తెచ్చిన్రు." కన్నీరుతుడుచుకుంటు అన్నది!

    నా తల దిమ్మెక్కింది.

    "ఎందుకు ఏడుస్తున్నావు?"

    వెంటనే ఆమె సమాధాన మివ్వలేదు

    "ఇల్లూ, పిల్లలతో సంసారం చేద్దామని నా కన్పిచ్చదా. మామ మందికి భయపడి లేకలేక పుట్టిన పసిగుడ్డును మాయంచేసిండు." చిన్నపిల్లలాగ ఏడ్పునాపుకుంటు మెల్లగా చెప్పింది.

    నా కండ్లల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. "చావసిద్దమయిన ముసలివాడికి ఎంత సాహసం" నాలో నేననుకున్నాను.

    "పెండ్లి చేసుకొని ఓ చోట హాయిగా పడి ఉండరాదు" మనసును స్వాధీనం చేసుకొని అన్నాను.

    "నీకు పెండ్లి అయిందిగదా?"

    "అవును, మరి నన్నెందుకు రాత్రి ఎన్మిదిగంటలకు రమ్మన్నావు?"

    "మీ మొగోండ్లకు పెండ్లయితేం" ఇంకా ఏదో అనబోయి, గంభీరించి ఊరుకుంది. వింతగా నన్ను చూచింది.

    "చూడు! నీ ఊరేదో చెప్పితే నిన్ను తీసుకెళ్ళి నీకేచిక్కు లేకుండా ఏర్పాటు చేస్త.

    "మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని మా ఊరుకుపోతా?"

    "మరి అయితే ఇక్కడెవరినన్నా పెండ్లి చేసుకుంటావా?"

    "మా మామ ఇప్పుడు పెండ్లి కొప్పుకోవడంలే."

    "అవును ఎందుకు ఒప్పుకుంటాడు? వ్యాపారం దెబ్బతినదు?"

    ఆ అమ్మాయి బెదిరినట్టుచూచి, "నా సంగతిఅంతా నువు బాగనే తెల్సుకున్నవు!" అన్నది.

    "తెలిసికోబట్టే నీ విషయంలో పట్టుదలకలిగింది. నిన్నీ విధంగా ఊరికి బలిచేయతలచుకోలేదు. నేనునీ కొడుకుగా చెప్తున్న. నీ పాలు తాగుతున్నగదా! నీవు నాకు తల్లితో సమానం. నీకు పెండ్లి చేసుకోవాల్నని ఉంటే నీ మామ గీమ ఎవరూ అడ్డం రానివ్వం. నీకేం భయంలేదు. ఇప్పుడే నావెంటవస్తే ఓచోట నిన్ను పదిలంగా కాపాడుతాం. మంచి పిల్లవాడ్నిచ్చి పెండ్లి చేస్తాం. ఏమంటావు?"

    "ముంగట పెండ్లి చేయించినోళ్లు, చేసుకున్నోళ్లు గిట్టనే మాట్లాడిన్రు."

    మా విషయంలో ఏ విధంగా నమ్మకం కలిగించాలో నాకు అర్థం కాలేదు. కొంతసేపు నిశ్శబ్దంగా గడిచింది.

    "నాకు పాలు తాపడంలో నీ అభిప్రాయం?" ప్రశ్నించాను.

    "రోజు పిండి పారపోసేకంటె అదే మంచిదనుకున్నా............ నా పాలు ఒట్టిగా పారపోయటానికి మన్సొప్పలే". గుడ్లలో నీళ్ళు తీసుకొని అన్నది.

    "నీ పాలు తాగే నామీద కన్నెయ్యడం మంచిది కాదనుకోలే?"

    "నేననుకున్నట్టు ఏది అయితున్నది? గిట్ట బతకటం నా కిష్టముందనుకుంటున్నావా?" గంభీరంగా ఎదురు ప్రశ్న వేసింది.

    నా విషయంలో నమ్మకం కలిగించటానికి ఏం చేయాలనో నాకే తోచటంలేదు. కాసేపు తత్తర పడ్డాను. నిశ్శబ్దంగా కూర్చున్నాను.

    "ఇంకెంతసేపు ఇట్ట కూసుందాం" తల నేలకువేసి అన్నది.

    "ఏం జేయమంటావు? నా వెంట వస్తావా?

    "ఎక్కడికి, నీయింటికా?" భయంతో అడిగింది.

    "అవును. నా ఇంటికే. నీకు నామీద విశ్వాసము లేకపోతే నా భార్యకు నా మీద విశ్వాసముంది.

    ఆ అమ్మాయి అసమ్మతిగా తల నేలకు వేసింది. రాత్రి మించిపోతున్నది. పరిష్కార మార్గమేమి తోచ లేదు. ఎటూ పాలుపోక లేచి నిల్చున్నాను. ఒక నిట్టూర్పు విడిచి ఆ అమ్మాయికూడ లేచి నిల్చున్నది. నేను ముందుకు సాగుతుంటే మల్లేశం ఎదురైనాడు. ఆ అమ్మాయి అతన్ని చూసి బెదరిపోయింది.

    "భయపడకు నా స్నేహితుడే" అన్నాను.

    ఆమె ఇంకా బెదిరినట్టు చూడసాగింది.

    "ఏమంటది?" మల్లేశం ప్రశ్నించాడు.

    "పాపం, నేటివరకు ఆమెకు కల్గిన అనుభవాలవల్ల మనలను నమ్మటం లేదు." అన్నాను.

    "అయితే మరి ఈమెను తిరిగి ఈ ముసలోనికి ఒప్పచెప్తే ఏమి లాభం. మనం అనుకున్నదంతా మంట్లో కలిసినట్టే." మల్లేశం అన్నాడు.

    "ఇప్పటికైనా ఆలోచించుకో, నీ మంచికే చెప్పుతున్న, మమ్ముల్ను నమ్ముకో, నీకుచెడుపే చేయదల్చుకుంటే మేమీవిధంగా ప్రవర్తిస్తామా" దీనంగా అడిగాను.

    "ఇంతకన్న ఎక్కువ మంచిగ మాట్లాడి నోళ్ళను నూసిన.

    ఒక్కొక్క అడుగువేస్తు ముందుకు సాగాం. ఆలోచిస్తు ఆ అమ్మాయి కూడా మమ్ముల అనుసరించింది. ఊళ్లో ప్రవేశించాం. సద్దుమణిగింది. మాఇల్లు సమీపించింది. కిటికీలోనుంచి నా భార్య నాకోసం ఎదురిచూస్తుంది.

    "అదిగో! అదే నాయిల్లు. ఆకిటికీలోనుంచి చూస్తున్నదే, ఆమే నా భార్య. కావాలంటే ఆమెతో కూడా మాట్లాడు" అన్నాను.

    "ఈ సంగతంతా మీ ఆమె కెరికేనా?" భయంతో అడిగింది.

    "అవును. ఇందులో రహస్యమేముంది. ఆడవాండ్ల సంగతులు ఆడవాండ్లకు రహస్యమా?" అంటూ ఇంటితోవతీసాను. ఆమె మమ్మనుసరించి ఇంటిలోకి వచ్చింది.

    "మొత్తానికి మెప్పించి వెంటతీసుకొచ్చినట్టున్నారు. పాపం! ఏదో మంచిపనే అయింది. రా! అమ్మారా!! అట్లా కూర్చో" నా భార్య ఆహ్వానించింది.

    ఆమె తలవొంచుకొని కండ్ల నీళ్లు తుడ్చుకుంటూ ఒక కుర్చీమీద కూర్చున్నది.

    "పాపం! ఆమెను దగ్గరతీసినవాండ్లందరు మోసం జేస్తూ వచ్చారట. అందువల్ల మమ్ములను నమ్మటం లేదు. నీవు కూడ చెప్పిచూడు" నా భార్యతో అన్నాను.

    "అవును, మీ మొగవాండ్లు సామాన్యులా? ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెల్సికోటం కష్టం" అంటూ నా భార్య ఆమె పక్క కుర్చీలో కూర్చున్నది. "మా వారు నమ్మకస్తులని మాత్రం నేను చెప్పగలను" అని అమ్మాయి వీపుపై చెయి నిమిరింది.

    "నా సంగతి మీకు బాగ తెల్సిందేకదా! నా మీద మీకు అనుమానం లేదనుకుంట" మల్లేశం మందహాసంతో అన్నాడు.

    "నీకేం? గురువుకుమించిన శిష్యుడివి" నా భార్య అన్నది.

    "ఇతడేనా?" అన్నట్టు అమ్మాయి మల్లేశాన్ని ఓరకంట చూసింది.

    అంతా సపంక్తి భోజనంచేసి లేచాం.

    "ఏం మల్లేశంగారు! మాటకు వెనుకకు పోవద్దు. చూడు మా వారికి మాట దక్కటమేకాదు. ఆమెజీవితం కూడ బాగు పడ్తుంది. పాపం, ఎన్నికష్టాలు అనుభవించిందో, ఇప్పటికైనా కష్టాలు గట్టెక్కితే మంచిది." నా భార్య అన్నది.

    "మొదలే అన్ని ఆలోచించుకోవాలెగాని మాట అన్నాక తిరుగు వుంటుందా." ఆ అమ్మాయిని చూస్తు నా భార్యకు సమాధానంగా అన్నాడు.

    "అయితే మీ వివాహం నిశ్చయం" నా భార్య అన్నది.

    ఆ అమ్మాయి అమాంతంగా వచ్చి నన్ను కౌగలించుకున్నది. చేపిన ఆమెపాల రొమ్ములు నా చొక్కాను తడిపాయి.

    "పాపం" అంటూ నా భార్య కన్నీరు పెట్టింది.