ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
రచయిత: శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి                        కనువిప్పు నాటిక
జననం : 1914
నివాసం : హైద్రాబాదు
కార్యకలాపాలు : దేశోద్ధారక గ్రంథమాల నిర్వహణ                        పాత్రలు:
అభిరుచి : విషయసేకరణము, కథలు, నాటికలు, నవలలు                        మల్లయ్య
రచనలు: ముద్రితం: జైలులోపల (కథానికలు)                                        గంగయ్య
పత్రికలలో నాటికలు, కథలు.                                                              కొమరయ్య
అముద్రితం : గంగు (నవల)                                                               వీరయ్య
పరిసరాలు (కథానికలు)                                                                   లింగయ్య
అభిమాన రచయితలు: మార్జింగోర్కీ, ముల్క్‌రాజ్‌ ఆనంద్‌,                         తిరుపతయ్య
కె.ఏ. అబ్బాస్‌, కొడవటిగంటి కుటుంబరావు, ఆచార్య
ఆత్రేయ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి                    రాము

ఒకటో రంగం
(మల్లయ్య వయస్సు 40 సంవత్సరాలు. మంచముమీద, గొంగడి చుట్టపై కూర్చొని ఉంటాడు. మంచానికి చేతికర్ర నిలువుగా పెట్టి ఉంటుంది. తెర ఎత్తేవరకు మల్లయ్య పొగాకుకాడలు తీస్తూ కూర్చుంటాడు. కొడుకు గంగయ్య విచారంతో ప్రవేశించి నెత్తి గోకుతూ మధ్య, మధ్య తండ్రిని భయంతో చూస్తుంటాడు.)
మల్లయ్య: ఒరే గంగడు: ఏమైంది పోయిన పని? ఏమంటడు కొమరయబావ?
గంగయ్య: (మాట్లాడడు.)
మల్లయ్య: ఏం పెట్టుకున్నవు నోట్లో?
గంగయ్య: (మాట్లాడడు)
మల్లయ్య: ఏందిరా. దయ్యం పట్టిందిర. మాట్లాడవు?
గంగయ్య: కొమురయ మావ
మల్లయ్య: ఆ కొమురయ మామ?
గంగయ్య: మన పేరు తీస్తే మండిపోతుండు
. మల్లయ్య: మండి మసికాకపోయిండు.
గంగయ్య: యీరయబావ ఇంటికే రానని ఉత్తరం రాశిండట.
మల్లయ్య: ఆ రాకేంజేస్తడు
గంగయ్య: మన పుల్లమ్మను ఒద్దనంగ పెండ్లి చేయబట్టే యీరయ్య బావ మనిసిరిగిందండు కొమరయమావ.
మల్లయ్య: మొగడు వద్దంటున్నా నా పాణం తీసెనే ఇప్పుడేమంటది యెంకమ్మత్త.
గంగయ్య: యీరయ్యబావ ఉత్తరం వచ్చినకాడ్నించి యెంకమ్మత్త ఒకటే ఏడ్సుడు. యిగ కొమరయ మావేమో. బాగైంది. ఆత పెట్టినట్టయింది అంటున్నడు.
మల్లయ్య: అది సంగతి. తనకిష్టంగాని సంబందం చేసినంగద! కొడుకు ఏమన్నా సూస్తున్నడు (ఆలోచించి) గంగడూ: మీ బావ యీరేశం పెద్ద పెద్ద చదువులు చదువుతాండె. మరి యిదేం బుద్దిరా!
గంగయ్య: ఏమోనే.
మల్లయ్య: (దీర్ఘంగా ఆలోచించి) బావ పతా నీకెరికేనారా? నేడు ఓ ఉత్తరం రాయిస్త. సాతాని పంతులు ఇంటికాడ ఉన్నడేమొ చూచిరాపో.
(గంగయ్య వెళ్ళబోతాడు)
మల్లయ్య: గంగడూ : ఓ పని చేద్దాం. మన సాతాని పంతుల్ను మీ బావ కాడికి పంపి. మీ బావ మనుసేందో తెలుసుకోవాల్రా. సదువుకున్నాండ్లయిరి. మనిసిచ్చి మాట్లాడుకుంటరు ఏమంటవు?
గంగయ్య: అవునయ్య.
మల్లయ్య: గంగడూ: దేనికైన మంచిది నువుగూడ పంతులెమ్మడిపో.
గంగయ్య: అమ్మనుగూడ అడుగుదాం ఏమంటదో.
మల్లయ్య: ఒరేగంగడూ: మీ అమ్మమాట నా ముందల తీయకు. మీ అమ్మ, ఆ యెంకమ్మత్త ఇద్దరు కల్సి పిల్లకు ఉరి పోశిన్రు.
(రంగయ్య ప్రవేశం)
రంగయ్య: మల్లన్నకిప్పుడు తెలిసొస్తున్నయి అన్ని. నేనెప్పుడో చెప్పిన ఈ సంబంధం వద్దని.
మల్లయ్య: దా. రంగయ్య. దా, కూసో. నా మనసంతా ఎట్లగో ఉంది. ఇంకా నాకు పోగేయకు.
రంగయ్య: అప్పుడూ అదే అన్నవు. నేనేదన్నా నీకట్టగే అనిసిస్తది.
గంగయ్య: అంటే. మరి అప్పుడు యీరయ్యబావంటే ఎంతమంచనుకున్నం. సదువు కుంటాండె. ఇంతోఅంతో యగసాయం ఉండె. ఒక్కడే కొడుకాయె. పుల్లమ్మ నసీబ్‌ బాగుందనుకున్నాం.
మల్లయ్య: మనకు సదువులు అచ్చిరావురా? మన పనులు మనకు సక్కగుండాలెగాని. ఈ సదువులు, కొలువులు మనకు పనికిరావు. సరే పో. అమ్మనడుగు ఏమంటదో.
(గంగయ్య వెళ్ళిపోతాడు)
రంగయ్య: యీరయ్య సంగతేమన్న తెలిసిందా.
మల్లయ్య: (తల నేలకువేసి ఆలోచిస్తాడు)
రంగయ్య: పాపం పుల్లమ్మ. అందరు పోంగ మిగిలినబిడ్డ తొందరపడి బాయిలో వేశిన్రు.
మల్లయ్య: పోనీ రంగయ్య. ఆ సంగతెత్తకు.
రంగయ్య: నేను పట్నం పోయి నిన్ననే వచ్చిన. సరే. మళ్ళా కల్సుకుంట. నీ మన్సుబాగలేదు. (వెళ్ళబోతాడు)
మల్లయ్య: ఆ పట్నం పోయొచ్చినవ దా. రంగయ్య దా. కూసో. ఏంసంగతి? మా అల్లుడు కనబడ్డాడా?
రంగయ్య: పట్నం పోయినాక. నీ అల్లుడిని చూడకుండ వస్తనా?
మల్లయ్య: అట్టన. అయితే చెప్పవు? ఏమన్నడు? నీకెట్ల కలిసిండు? పట్నానికి దూరంగా ఎక్కడో పెద్ద బంగళాలో ఉంటడటగా? ఆడ పతా దొరకడమే సానా కష్టమంటరు. మా గంగడు ఏమేమో చెప్పుతుంటడు. సరే పోనీగానీ, మరి ఏంమాట్లాడినవు?
రంగయ్య: నేనేం మాట్లాడలే. అసలు నీ అల్లుడు నన్ను గుర్తుపట్టలేదులే. నేనే కనిపెట్టి కొంతదూరం వెనకాల నడ్సుకుంటు పోయిన.
మల్లయ్య: కనబడ్డపుడు మాట్లాడకపోయినవు మరి?
రంగయ్య: నీ అల్లుడ్ని నేను గనుక గుర్తు పట్టినగాని, ఇంకోడికి కష్టం. అసలు యేషమే ఎట్టగో ఉంది.
మల్లయ్య: అవును. పెద్ద పెద్ద సదువులు సదివెటోళ్ళు ఆసుంటి బట్టలే యేసుకోవాల్నేమో.
రంగయ్య: యేషంతోటే పోయిందనుకోకు. (మల్లయ్య వైపు వంగి) ఎవరో పడ్సుపిల్లగూడ యెంబడుంది మల్లయ్యా!
మల్లయ్య: ఆ.... నిజంగనా రంగయ్య? నువు సూసింది నా అల్లుడ్నేనా? బాగా గుర్తుపట్టే చెప్తున్నావా?
రంగయ్య: మల్లన్నా. నీమన్సుబాగలేదు. మళ్ళ కలుస్త. జర చేనుకాడికి పోవాలె. (వెళ్తాడు)
మల్లయ్య: ఎంతపనాయె. అంత కలిసి నా బిడ్డకు యిసం పోశిన్రు. (గద్గద స్వరంతో) పుల్లమ్మా నీగతి ఏమైతదో (కండ్లు తుడుచుకుంటూ లోపలికి పోతుండగా తెర పడ్తది)
రెండో రంగం
(వీరయ్య హాస్టల్‌ గదిలో టాయ్‌లెట్‌ చేసుకుంటుండు. మధ్య మధ్య గడియారం చూస్తుంటాడు)
(తిరుపతయ్య ప్రవేశం)
తిరుపతయ్య: ఏం వీరయ్య. బాగున్నవా?
వీరయ్య: అగో. ఎప్పుడొస్తివి? ఇట్లనే వస్తివా? బట్టలెక్కడ పెట్టినవు?
తిరుపతయ్య: నేను. కొంచెం కచేరిపని ఉండి వచ్చిన్లే. బట్టలు అవి వకీలుగారింట్లో పెట్టి కలిసి పోదామని ఇట్లొచ్చిన.
వీరయ్య: నాయన. అమ్మ బాగున్నారా.
తిరుపతయ్య: బాగుండకేంగాని. నీ ఫికరే వాండ్లకు పొద్దస్తమానం.
వీరయ్య: నాకయ్యే ఖర్చు పెట్టలేకనా?
తిరుపతయ్య: యెహె. కడుపున పుట్టినోండ్లకు పెట్టుకోకపోతే ఇంకెవరికి పెట్టుకుంటరు? కాని మీమామ ఆ మల్లయ్య ఉన్నడే బలే మోసం చేసిండు.
వీరయ్య: మోసమా? ఏమిటది?
తిరుపతయ్య: ఇది మోసం గాక ఇంకేంది చెప్పు? నిన్ను చదివించి గొప్పవాడ్ని చెయ్యాలని మీ నాయినకు ఇంతా అంత ఫికరుకాదు. ఏదో యేడ్నీళ్ళకు చన్నీళ్ళకు ఆసరన్నట్టు మీ మామ మల్లయ్యను కూడా కొంత అడిగిండనుకో.
వీరయ్య: నన్ను చదివించడానికి మా మామను డబ్బు అడిగిండన్న మాట మా నాయన.
తిరుపతయ్య: దీంట్లో తప్పేంఉంది? పరాయివాండ్లమా? అల్లుళ్ళను చదివించెటోండ్లెందరు లేరు?
వీరయ్య: ఊహు అదా సంగతి? అందుకేనేం నేను డబ్బు కావాలన్నప్పుడల్ల మా నాయన రొసరొసలు. రుసరుసలు మొదలు పెడ్తుంటడు.
తిరుపతయ్య: నువ్వే ఆలోచించరాదు? నీ పెండ్లిలో మీమామ సరేనని తల ఊపి ఇప్పుడు మాటతప్పటం ఎంత బాగుంది?
వీరయ్య: మల్లయ్య మామ ఉత్తరాల్లోమాత్రం ప్రేమ ఒలకపోస్తుంటడే.
తిరుపతయ్య: అదంతా మోసం. మీ మల్లయ్యమామకు బాగా బుద్ధి చెప్పాలని నేనో మంచి ఆలోచన చేసిన, మీ నాయనకూడా ఒప్పుకున్నట్టే.
వీరయ్య: ఏమిటది?
తిరుపతయ్య: నువు గొప్ప గొప్ప సదువులు సదువుతుంటివిగద. అడివిమనిషి ఆ పుల్లమ్మతో ఎట్ల కాపురం చేస్తవో ఆలోచించినవ?
వీరయ్య: అంటే?
తిరుపతయ్య: ఏం లేదు? ఓ మంచి అమ్మాయిని పెండ్లి చేసుకుంటివా చిలుకా గోరింకలోలె హాయిగ ఉండొచ్చు
వీరయ్య: నా సంగతేందో తెల్సుకొందామని మాట్లాడుతున్నావా?
తిరుపతయ్య: నిన్ను నేనట్లా అనుకుంటన? నీతెలివి, నీ ఓపిక చూసి, ఎంతమంది నోళ్ళల్లో నీళ్ళూరుతున్నయను కున్నవు? బండపాలెం మర్రెద్దోరు లేరు, వాండ్ల పిల్లలంతా ఆడ, మగ యిక్కడే సదువుకుంటున్రటగద.
వీరయ్య: అవును. ఆడపిల్ల లెరుకలేదుగాని. మగవాండ్లు మాత్రం నాకు స్నేహితులే.
తిరుపతయ్య: సరే ఇంకేం ఇక ఆడపిల్లల సంగతి ఊరికెనే తెలిసిపోతది.
వీరయ్య: (ఆలోచించి) తిరుపతయ్య నువు పల్లెటూళ్ళో
ఉంటున్నా. ఆలోచనలుమాత్రం బస్తికి తగ్గట్టున్నాయి. సరే కాని మరి మా నాయన దీని కొప్పుకుంటడంటవ?
తిరుపతయ్య: అదంత నీకెందుకు? నువ్వు సరేనంటే అయిపాయె. ఆనిక్కి నేను చూసుకుంటగా!
వీరయ్య: నాయనతో కూడా ఆలోచించందే.
తిరుపతయ్య: అయ్యో! ఆలోచించకుండనే అయిపోతద. అదంత నేను చూసుకుంటానంటిగద. ఈ కొత్త సంబురం అయిపోయిందంటే మీ మామ ఆ మల్లయ్య ఉన్నాడే. వాడి రోగం బాగా కుదురుతది. ముదనష్టపోడు.
వీరయ్య: ఊ.. మొత్తానికి, అసాధ్యుడివి. భలే ఎత్తు వేసినవు.
తిరుపతయ్య: ఇంకా నా సంగతి నీకు తెల్వదు. మనం పట్టిందే బంగారం. మన మనుకుంటే కానిపని లేదనుకో.
వీరయ్య: ఎందుకో తిరుపతయ్య. పెండ్లి అయినప్పటి నుంచి మనుసులో ఒకటే మెరమెర మొదలైంది. ఇవాళ నాకు తలపోసుకున్నట్టుంది.
తిరుపతయ్య: అవును ఉండదు మరి. ఎవరికి తగ్గట్టు వాళ్లకు అన్ని ఉంటూంటే హాయిగా కాలం గడుస్తుంది. నిజం చెప్తున్న యీరయ్య: ఆ పుల్లమ్మ ఉందే, ఒట్టి పిచ్చి పుల్లమ్మ. మరి ఇకపోత. కచేరికి పొయ్యే వేళైంది (లేస్తాడు)
వీరయ్య: ఇంటికి పోగానే ఏంసంగతీ రాస్తావు కదూ?
తిరుపతయ్య: రాయటం ఏందీ, శుభపత్రికే వస్తుందనుకో. ఇంక యెల్తాను.
వీరయ్య: మా నాయన్ను, అమ్మను అడిగిన్నని చెప్పు. రూపాయలు తొందరగా పంపమని చెప్పు. మరిచేవు.
తిరుపతయ్య: ఆ.ఆ. అట్లనే చేస్త యిక రూపాయలేం కరువు. పొయ్యొత్త. (వెళ్తాడు)
(వీరయ్య ఈలపాట పాడ్తూ, ఉత్సాహంతో దుస్తులు వేసుకుంటుండగా రఘు బెడ్డింగుతో ప్రవేశిస్తాడు)
వీరయ్య: హల్లో రఘు మంచి సమయానికి వచ్చినావు. ఒక శుభవార్త.
రఘు: (కోటు విప్పుతూ) అందుకేనా వేషం వేసి బయలుదేరుతున్నావు. పట్నం మీద దాడికి.
వీరయ్య: (బూట్ల దారాలు బిగదీస్తూ) లేకుంటే మనస్తిమితం ఉండదు ఏంచేయాలె.
రఘు: సరేగాని ఎట్లా గడుస్తున్నాయి రోజులు
వీరయ్య: రోజులకేం. బాగానే నడుస్తున్నాయి.
రఘు: ఎట్లైనా నీవు పెట్టి పుట్టిన వాడివి.
వీరయ్య: మా మావ ఓ ఉత్తరం రాశిండు. వివరాలు చాలా ఉన్నాయి. కొడుకును, ఇంకెవరినో రాయబారం పంపుతాడట.
రఘు: ఆ హా మీ మామ ఎందుకింత తొందర పడ్తున్నట్టు?
వీరయ్య: అది వాళ్ళకున్న అలవాటే. పుట్టగానే పెండ్లి. పెండ్లికాగానే పిల్లలు.
రఘు: అయితే నీవేమంటవు?నికరంగా ఇరవై అయిదు సంవత్సరాలు బ్రహ్మచర్యం గడిపి తర్వాతగాని, పెండ్లి చేసుకుంటే బాగుంటదనా?
వీరయ్య: ఈ విషయంలో నాకో అభిప్రాయం లేదుగాని, ఈ పెండ్లిండ్లు, ఈ బొమ్మలాంటి జీవితం నాకేమి బాగనిపించడం లేదు.
రఘు: మరి ఎట్లా బాగుంటుందో చెప్పు. అది బాగలేదు. ఇది బాగలేదు అంటే ఎట్లా?
వీరయ్య: మంచేమిటో చెప్పలేని వాడు చెడ్డను, చెడ్డ అనకూడదా?
రఘు: అదికాదు నన్నొక బాధ వేధిస్తున్నది. నీ బాధలు నీవు చెప్పుకుంటున్నావు. నేను చెప్పుకోవడం లేదు. అంతే నీకు నాకు తేడా.
వీరయ్య: నీకు నావంటి బాధేనా? అయితే ఇద్దరం ఒకటే అర్రలో బాగానే చేరుకున్నాం.
రఘు: నీబాధ నీవు తీర్చుకుంటే తీరిపోతుంది. కాని నా బాధటు వంటిది కాదు. గడ్డు సమస్య. దాని పరిష్కారం కోసం ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాను.
వీరయ్య: సరేగాని బయటకు వెళ్దాం వస్తావా రావా?
రఘు: వెళ్దాంగాని, కొద్దిసేపు కూర్చో. (విచారంగా తల నేలకు వేస్తాడు)
వీరయ్య: ఏమిటి రఘు? విచారంగా ఉన్నావు?
రఘు: చెప్తాను.
వీరయ్య: ఖులాసాగా కాలం గడిపే విద్యార్ధి దశలో ఏమిటోయ్‌ నీ గంభీరం. ఎట్లా అయ్యేది అట్లా అవుతుంది. నీవేమి అధైర్యపడకు.
రఘు: ఊ.. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. సంతోషం అయితే విను. నాకో తమ్ముడున్నాడు. వాడికి చాలా చిన్నప్పుడే పెండ్లైంది. ఇప్పుడు తన భార్యకు కూడా చదువు చెప్పించాలని వాడి పట్టుదల.
వీరయ్య: అది అసంభవమని నా అభిప్రాయం.
రఘు: కాని అత్తమామలు ఒప్పుకోవడంలేదు. దాంతో వాడికి మనసు విరిగిపోయింది. ఆ పెండ్లాం అక్కరలేదట. చదువుకున్నదాన్ని పెండ్లి చేసుకుంటాడట.
వీరయ్య: అది అసలైన పని
రఘు: నేను చెబుతున్నదేమిటో సరిగా వింటున్నావా?
వీరయ్య: అయ్యో! వినకేం. అదే చదువుకున్నదాన్ని పెండ్లి చేసుకుంటానంటున్నాడు మీ తమ్ముడు.
రఘు: రెండో పెండ్లి ఏ విధంగా నీకు బాగనిపించింది?
వీరయ్య: పాతకాలంవాళ్ళ రోగం తిరగాలంటే ఇదే మందు.
రఘు: తల్లిదండ్రులు చేసే తప్పులకు శిక్ష అనుభవించేది పెండ్లైన పిల్లలా?
వీరయ్య: మరి తల్లి దండ్రులకు తమపిల్లల విషయంలో ఆలోచన లేక పోయినప్పుడు మనమేం చేస్తాం.
రఘు: అదే ఆలోచిస్తున్న. నా తమ్ముడు బాగానే ఆలోచించాడు భార్యను చదివించాలని. కాని అది సాగక పోయేవరకు మూర్ఖుడుగా ఆలోచిస్తున్నాడు.
వీరయ్య: చదివించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు?
రఘు: అదేమరి, కష్టమనిపించిన వాటన్నిటితో దూరంగా ఉంటే వాటంతట అవే పరిష్కారమవుతాయా?
వీరయ్య: కావనుకో కాని అవస్థలు ఉన్నవాళ్ళు అనుభవిస్తుంటే లేని అవస్థలు నెత్తిన వేసుకోవడం ఎందుకుచెప్పు?
రఘు: తప్పో. ఒప్పో. ఏదో జరిగిపోయింది దాన్ని ఓ మార్గంలో పెడ్తే బాగుంటుంది కదా!
వీరయ్య: ఈ గుదిబండలు మెళ్ళో వేసుకొని అవస్థ పడ్డదానికంటే చదువుకున్న ఒక అమ్మాయిని పెండ్లిచేసుకుంటే హాయిగా కాలం గడిచిపోతుంది.
రఘు: నీవు ఊహించే ఆ హాయి ఎన్నాళ్ళుంటుందో నేను చెప్పలేను కాని మరి పెండ్లాడిన ఆ అమ్మాయి గతేమంటావు?
వీరయ్య: ఎవరి హాయి వారు చూచుకుంటారు అంతే.
రఘు: అయితే ఈ విధంగా నీవు., నా తమ్ముడు ఒకే విధంగా ఆలోచిస్తున్నారు.
వీరయ్య: నీ తమ్ముడు ఆ అమ్మాయిని చదివించాలనే ఆశ ఒకటి పెట్టుకున్నాడు. నేనటువంటి అమాయకుడిని కాను.
రఘు: అయితే మిమ్ము పెండ్లి చేసుకున్నవారి గతి?
వీరయ్య: ఏమైనా కావచ్చు కాని నాకుమాత్రం వాళ్ళ విషయంలో సానుభూతి లేదు.
రఘు: బాగుంది. కేవలం వేడుకకోసం బాల్యవివాహాలు చేస్తే తల్లిదండ్రులను మనం అజ్ఞానులంటున్నాము కదు!
వీరయ్య: అనట మేమిటి? అజ్ఞానులే.
రఘు: మనమంతా జ్ఞానులం అవునా?
వీరయ్య: వాళ్ళకంటే వేయిరెట్లు
రఘు: మన జ్ఞానం, ఆ అజ్ఞానుల కేమైనా దోవ చూపిస్తున్నట్టా?
వీరయ్య: (మాట్లాడడు)
రఘు: అజ్ఞానులైన తల్లిదండ్రులవల్ల వారి సంతానం, వాండ్లతోపాటు జ్ఞానులమైన మనం అవస్థలకు గురి అవుతామనికదా మన వాదం? అయితే మన జ్ఞానంతో ఆ సంతానం ఏవిధంగా సుఖపడుతున్నట్లు?
వీరయ్య: నీవు ఆ పల్లెటూరి వాళ్ళవలె వాదిస్తునావు.
రఘు: చదువుకున్నా. చదువుకోకపోయినా మంచి చెడ్డల విచక్షణ మాత్రం ఒకే విధంగా జరుగుతుంది.
వీరయ్య: రఘు, నీ తమ్ముని సమస్య తెచ్చి నన్ను అనవసరంగా వేధిస్తున్నావు.
రఘు: మీరిద్దరు చేస్తున్నపని ఒకటే కాబట్టి.
వీరయ్య: అయితే ఏమంటావు?
రఘు: తలిదండ్రుల అజ్ఞానానికి బలియైన సంతానం గురించి కొంచెం ఆలోచించుమంటున్నాను.
వీరయ్య: ఆలోచించి ఏంచేయమంటావు?
రఘు: ఇంకా ఏం చెప్పను?
వీరయ్య: (గడియారం చూచి) రఘు, నేను తొందరగా వెళ్ళాల్సి ఉంది.
రఘు: ఆ తొందర పనులు నాకు తెలుసు. నీ మనసును వంచించి, బయట పడ్దామని చూస్తున్నావు.
వీరయ్య: రఘు, ఇన్నాళ్ళనుండి నాతో కలిసి మెలసి ఉన్నందుకా నా స్వంత విషయాల్లో జోక్యం కలిగించు కుంటున్నావు?
రఘు: నీ స్వంత విషయమే. నేను కాదనను. కానీ నీవు నా స్వంత తమ్ముడివని భావించి మాట్లాడుతున్నాను.
వీరయ్య: (పరీక్షగా రఘుని చూచి) మొదట నీ తమ్ముడి విషయం ఆలోచించుకో. దాన్ని నీవు సాధించితే. తర్వాత నా సంగతి చూసుకుందాం.
రఘు: (వీరయ్య చేతులు పట్టుకొని) నిజం చెప్తున్నా. నాకు నీవు తప్ప వేరే తమ్ములెవరూ లేరు. నా బాధంతా నీ కొరకే.
వీరయ్య: రఘు? ఏమిటిది, నాటకమాడుతున్నావా?
రఘు: ఏమైనా అనుకో. నేను మీ మామ ఊరినుంచే వస్తున్నది. మీ మామ స్థితి. మీ అత్త ఆవేదన చూచి నా మనసు నీరై పోయింది. అమాయకుడు గంగయ్య ఆడదానివలె కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు.
వీరయ్య: ఆ. మా అత్తవారి ఊరు వెళ్ళినావా?
రఘు: పోగా మిగిలిన ఒక్క బిడ్డను నీవు బుద్ధిమంతుడవని, చదువుకుంటున్నావని నీకిచ్చి పెండ్లి చేసినారు. కాని నీవు మూర్ఖుడివై ఆ పిల్లగొంతు కోయ చూస్తున్నావు. చదువుకున్న మనం పాతకాలం వాండ్లు కండ్లు తెరిచేటట్టు ప్రవర్తించాలి. లేకుంటే చదువులంటే గౌరవం లేకుండా పోతుంది.
వీరయ్య: (సందిగ్ధావస్థలో అటు, ఇటు తిరుగుతాడు. చేతి గడియారం విప్పుతాడు. ముఖం చీదరించుకొని కుర్చీపై ఆలోచిస్తూ కూర్చుంటాడు.)
రఘు: నేను వచ్చేవరకు ఉండు. స్నానం చేసి వస్తా. బయటికెళ్దాం. (వెళ్తాడు. తెర పడుతుంది.)
మూడో రంగం
(తెర ఎత్తేవరకు మల్లయ్య చుట్టను చుట్టుతుంటాడు. ఇంతలో రంగయ్య వస్తాడు.)
రంగయ్య: ఏం మల్లన్న: ఎటో బయలుదేరినవు
. మల్లయ్య: ఏం చెప్పాలె రంగయ్య. ఇంటికాడ కూసుంటే చికాకేస్తుంది. ఉండలేక ఇటొచ్చాను.
రంగయ్య: మీ వియ్యంకుడు కొమరయ్య వస్తడంటివి, మరి యింకారాలేదే?
మల్లయ్య: అవును రంగయ్య! వస్తాడట. ఆయన ఏం గంద్రగోళం చేస్తాడో ఏమో.
రంగయ్య: నేనున్నాలే. నీవే భయపడకు. నిలదీసి గట్టిగా అడుగుతాలె.
మల్లయ్య: కాని ఆ తిరుపతయ్యలేడు. వాడితో వచ్చింది తిప్పలు రంగయ్య. మా కొమరయ్య బావ వాడేదంటే అదే పట్టుకుంటాడు. కొడుకు పట్నంగాలి తగిలి పట్టపగ్గాల్లేకుండ ఎగురుతుంటే తండ్రికైన బుద్ధి ఉండొద్దు. ఏంకాల మొచ్చింది
రంగయ్య: కొమరయబావ తల్సుకుంటే కొడుక్కి బుద్ధి చెప్పలేడంటావా?
రంగయ్య: ఇయ్యాల రేపు పోరగాండ్లు భలే నడమంత్రపోళ్ళు మల్లన్న. ఎటుపడితె అటే.
మల్లయ్య: రంగయ్య, మనలోమాట. పెండ్లి చేసుకున్నాడు వద్దంటే వదలిపోతదా? ఏంరోజు లొచ్చినయే.,
రంగయ్య: కొమరయ్యకు ఓ బిడ్డ ఉంటే తెలిసొచ్చు నీ తిప్పలు.
మల్లయ్య: యీరయ్య సదువుకున్నాడుగద! యీకొద్ది తెలిసుండొద్దు.
రంగయ్య: కొమరయ్య వస్తడుగద. రంగేందో తెల్సుకుందాం.
మల్లయ్య: రంగయ్య, నీకు దండం పెడ్త. యావారం మాత్రం బెడసకుండ సూడాలెమరి. ఏన్లేదుగాని, మనం రోశాలుపడ్తె పుల్లమ్మ బతుకు బండలై పోతది.
రంగయ్య: కాని మల్లన్నా, మనం మెత్తబడితె కొమరయ్య కొమ్మెక్కి కూసుంటడు.
మల్లయ్య: అవును. పిల్లగానోళ్లంటే అంతేగద మరి.
రంగయ్య: చూడు:, నేనొకమాట చెప్పుత. కాదు పోదంటే పదిమంది పెద్దమనుషుల ముందర, నచ్చచెప్పమని నిలదీసి అడుగుత.
మల్లయ్య: అట్ల బాగుండదు రంగయ్య:, మనం, మనమే రచ్చకెక్కితే ఏం బాగుంటది చెప్పు? రంగయ్య: ఓ, సంగతి చెప్పమరిచిన. మొన్న మా అల్లుడి దోస్తూ ఒకడొచ్చిండె. ఇద్దరూ ఒకటే అర్రలో ఉంటరట.
రంగయ్య: వాడెవడో నీ అల్లుడిజుట్లోంచి వెళ్ళినోడుంటడు.
మల్లయ్య: కాదు రంగయ్య:, బలే నెమ్మదిమనిషి అనిపించిండు. నేను చెప్పిందంతా మన్సుపెట్టి యిన్నడు.,
రంగయ్య: మరి నీ అల్లుడి తైతక్క యేశాల సంగతి అడగలే.
మల్లయ్య: అడిగిన్ననుకో. నేన్‌ చెప్పుతుంటే యిన్నడేగాని ఎంత కుచ్చి కుచ్చి అడిగినా ఒక్కమాటన్న చెప్పిండనుకున్నవా?
రంగయ్య: నేం చెప్పలేమరి? వాండ్లంతా ఒకటే, నీ పిచ్చిగాని.
మల్లయ్య: కాని రంగయ్య. పోయేటప్పుడుందే, నీవేం భయపడకన్నడే. అనే నాకు జర ధైర్యంగుంది.
రంగయ్య: నీమర్మం తెల్సుకుందామని నీ అల్లుడే పంపుంటడని నా అనుమానం.
మల్లయ్య: అంతేనంటవా. ఏమన్యాయం? అయిపోయిందే రాగ, రాగ కల్జుగం, గల్జుగమంటే ఇదేగామాలు.
రంగయ్య: అట్ల గుండెపగిలితే బ్రతకడం కష్టం మల్లన్నా. అయిన కాడికి నిలదొక్కొని ఉండాలె.
మల్లయ్య: నువు బలెగ మాట్లాడతవుగాని నాకివన్ని చూస్తుంటే ఈ జీవుడు యెల్లిపోతే బాగనిపిస్తది.
రంగయ్య: (లోపలికి చూస్తూ) అగో. కొమరయ్య. తిరుపతయ్య వస్తునే ఉన్నరు
మల్లయ్య: నిజంగంటున్నవ. తిరుపతయ్య కూడా వస్తున్నడ (లోపలికి చూస్తాడు)
(కొమరయ్య, తిరుపతయ్య ప్రవేశం)
మల్లయ్య: బావా. బావా. దా దా తిరుపతయ్య. దా. అంతా బాగున్నట్టేనా. యీరయ్య పట్నంలో బాగున్నాడా.
తిరుపతయ్య: నీవు మూటలకు మూటలకు పంపుతుంటే ఎందుకు బాగుండడు?
కొమరయ్య: నీవీడ కూసున్నవు బావ. మంచిదైంది. కట్టపొంటె పోతే నువు కలవక పోదువు ఈనంగొచ్చిందే బాగైంది.
రంగయ్య: కొమరయ్యను చూడక చానారోజులాయె పాపం. మనిషి గుర్తుపట్టకుంటైండు.
తిరుపతయ్య: సుఖ మెక్కువవుతాంటె ఎట్లుంటడు మరి.
మల్లయ్య: నిలబడితివి బావా, కూచో, నువు వస్తవనే యెదిరిచూస్తున్నం. అప్పటాలనుంచి నీసంగతే మాట్టాడుకుంటున్నం.
రంగయ్య: కొమరయ్య, మీరేమనుకోకపోతే నేనొకటి అడుగుత.
తిరుపతయ్య: ఒకటేమిటి, ఇష్టమొచ్చినన్ని అడుగు.
మల్లయ్య: (కొమరయ్య తిరుపతయ్య ముందర పొగాకు వేసి) జర దమ్ము తీసుకోనీయి రంగయ్య నడిసి నడిసి వచ్చిన్రు. చుట్టకాల్చురి.
కొమరయ్య: (చుట్ట కాడలు తీస్తూ) బావ! నేనెందుకొచ్చిన్నో నీకెరికే గద! నేను జరిగిన యన్ని తొవ్వుకొని చెడ్డవనిపించు కొనటమెందుకు?
రంగయ్య: మీరిద్దరు అనుకోంగనే అయిపోదు. ఊళ్ళోమంచి చెడ్డ తెలిసినవాళ్ళు ఉన్నరు.
తిరుపతయ్య: మేము మంచి చెడ్డ మంచిగ ఆలోచించుకొనే వచ్చినం.
కొమరయ్య: నా మంచి చెడ్డలు నాకు తెలుసును సంసారం చేసే మొగుడికే ఇష్టం లేనపుడు నేనేం జేస్త? నీ బిడ్డను తీసుకపోయి వాడి కాలుకు కట్టేయమంటరా పెద్దలు.
రంగయ్య: లోకం మీద ఎక్కడ పెండ్లిండ్లు పేరంటాలు జరగనట్లే చెప్పబడ్తివి.
తిరుపతయ్య: ఇసుంటి పెండ్లిమాత్రం కాలేదు.
మల్లయ్య: బావ.! మన పిల్లలకు మనం బుద్ధి చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు. నువు చెప్తే వీరయ్య యినడా చెప్పు?
కొమరయ్య: (రంగయ్యను చూపుతూ) ఆ సంగతి ఆ మనిషికి చెప్పు. ఎవరో పెద్ద మనుషులున్నారట పంచాయితీలు చెప్పడానికి.
మల్లయ్య: దీంట్ల కోపమెందుకు బావ. ఆయన మన మంచికే అన్నడు గిట్టకంటున్నడ.
తిరుపతయ్య: ఆ. ఇందాక జరిగిన మంచి చాలు.
కొమరయ్య: మల్లయబావ, సాఫ్‌గచెప్తున్న, మా యీరయ్య ఉన్నడే ఓండ్ల మాటలు యినేటోడు కాడు.వాడన్నట్టల్లా సాగించుకుంటడు. నీ కోసమని, నా కడుపున పుట్టిన కొడుకుతో కంటుబెట్టుకోమంటవా?
తిరుపతయ్య: నీవేంది కొమరయ్య. ఎవరైన అదే చూసుకుంటరు. ఎడ్డిపిల్లను పెండ్లి చేసి అందరిని దగా చేస్తుమని అనుకుంటన్న వేమొ?
మల్లయ్య: ఎవరు? నా బిడ్డ పుల్లమ్మ ఎడ్డిదా?
కొమరయ్య: అదంతెందుకు - ఎడ్డిదిగాని గుడ్డిదిగాని పెండ్లి అయిందో లేదో, పట్నం పోయిండుగద మా యీరయ్య. అప్పట్నుంచే వాడెందుకో మన్సు మార్చుకున్నడు. అదేందోగాని పెండ్లాం మాటెత్తితే మండిపోతున్నడు.
రంగయ్య: ఎందుకు మండడు. పట్నం....
మల్లయ్య: (రంగయ్యను వారించి) ఎత్తు ఒంపులు తెలియని పిల్లలు బావ. వాండ్లు వాండ్లను దోవకు తెచ్చుకోవాలె బావ.
తిరుపతయ్య: అయితే నీ కోసమని సదువుకుంటున్న బంగారంవంటి పిల్లగాడిని చెడగొట్టుకుంటామా?
రంగయ్య: అయితే ఇంతకు నీ మన్సులో మాటేంది? సంబంధం వదులుకుంటనంటావు. అంతేనా?
కొమరయ్య: పెండ్లి చేసుకున్న మొగుడు వద్దంటుంటే నన్నేం చేయమంటరు?
రంగయ్య: రేపు నీ కొడుకు పట్నంనించి ఓ బజారుముండను తెచ్చి నా పెండ్లాం అంటడు. ఒప్పుకుంటవా?
తిరుపతయ్య: బలే తెలిసినోడోలె మాట్లాడబడ్తివి. సరే, మా యీరయ్య చెడ్డోడే. అసుంటోడితో మీకేం పని? మీదారి మీది. మాదారి మాది.
మల్లయ్య: నా అల్లుడ్ని ఎవరు ఏమన్నా, నా అల్లుడు. ఏమైనా యీరయ్య నా అల్లుడు. ఇది మాత్రం అబద్ధం కాదుగద బావా?
కొమరయ్య: నువ్వు నేను అనుకోంగనే అయిపోతదా? మరి అసలోడి సంగతి?
మల్లయ్య: జర నిదానించి మాట్లాడు బావా. నాకు పిచ్చి లేచేటట్టుంది.
తిరుపతయ్య: మాటకు, మాట పెరుగుతుంటే ఎవరికైనా అట్లనే ఉంటది మరి. అందుకోసం మాటలొద్దు. పోట్లాటలొద్దు. పెండ్లప్పుడు పెట్టిన సొమ్ము లీవల పారెయ్యి. మా దోవన మేము పోతం.
మల్లయ్య: అవునా బావా. అంతేనంటవ. ఇందుకేనా బావ ఇంతదూరమొచ్చింది? నా గొంతుపిసికి చంపేయరాదు బావ.
రంగయ్య: కొమరయ్య, బాగావిను. ఇది మీఊరనుకోకు, అనుకున్నట్లా సాగిరావడానికి. నువు చేస్తున్నది. తప్పుపని పదిమందితో చెప్పి మెప్పిస్త. ఏమనుకున్నవో.
కొమురయ్య: వినేవాడుంటే చెప్పి మెప్పిచ్చు.
రంగయ్య: అన్నిటికి కొడుకును అడ్డమేసుకొస్తున్నవుగద. ఆ కొడుకుతో మాట్లాడి ఆ సంగతేందో తెల్సుకుంటాంపోండి. మీతో మాకేం పనిలేదు.
తిరుపతయ్య: అడుగొచ్చు మాకేం భయం లేదు.
కొమరయ్య: నన్నుకాదని నా కొడుకు ఒక్క అడుగేయడు ఎరికేనా?
మల్లయ్య: (ఆవేదనతో) అయినప్పుడు కొడుకుకు నచ్చచెప్పితే అయిపోతదికద బావ?
రంగయ్య: మల్లయ్యా, ఇంకేం తేలిపోయింది. ఇదంతా కొమురయ్య చేస్తున్నదే.
తిరుపతయ్య: అవును. ఎవరిమంచి వాళ్ళు చూసుకుంటరు. ఎవరివాండ్లకు వాళ్ళు చెప్పుకుంటరు.
కొమరయ్య: ఏమన్న అనుకోండి. మాకు మాత్రం మీ సంబంధం అక్కరలేదు.
మల్లయ్య: ఎప్పటిదో పగ యెళ్ళతీస్కుంటన్నవు బావ.
కొమరయ్య: ఇప్పుడు యాదికొచ్చింది. నువు మరిచినవనుకున్న.
రంగయ్య: ఏందది?
మల్లయ్య: కొమరయ్యబావకు చచ్చిపోయిన మా రామక్కను ఇచ్చి పెండ్లిచేసినప్పుడు చెరువుకింది బొత్తలపొలం మా అయ్య అరణం ఇస్తనన్నడు. ఏమైందో ఏమో భూమి ఇయ్యలేదనుకో. ఇంతట్లకే మా రామక్క చచ్చిపాయె. అంతా గందరగోళమైంది.
రంగయ్య: ఆ పొలం కరణమోరిదేమో.
మల్లయ్య: అసలు మొదట మాదే. ఆనిక్కె కరణమాయన గుంజుకున్నడు.
తిరుపతయ్య: ఎంగిలి తిండి అరుగుతాది మరి?
రంగయ్య: మీ బావ తెలివితక్కువోడేంగాడు.
తిరుపతయ్య: తెలివితక్కువోడని కదు. ఎడ్డి పిల్లను అంటగట్టి ఎగిరి గంతులేస్తున్నడు.
కొమరయ్య: బావా. ఇంతకూ ఏమంటవు. నగ, నట్ర ఈవల పారేస్తవా లేదా?
(వీరయ్య, రఘ ప్రవేశిస్తారు)
మల్లయ్య: వచ్చినావు కొడుక (కౌగిలించుకుంటాడు. రఘు వాళ్లకు దండం పెడ్తాడు)
రంగయ్య: ఏమయ్యోయ్‌ బాగున్నవా, గుర్తున్నమా?
తిరుపతయ్య: యీరయ్య మాత్రం సరిగ ఊడిపడ్డడు.
కొమరయ్య: సదువు సట్ర వదిలిపెట్టి పుట్టి మునిగిపోయినట్టు ఉ రికొచ్చినవు?
వీరయ్య: అవునయ్య! మునిగిపోతున్నదనే వచ్చిన (రఘును చూపుతూ) ఈయన నా స్నేహితుడు. నా కండ్లు తెరిపించిండు.
కొమరయ్య: అయితే ఏందంట ఆ మునిగి పోతున్నది?
తిరుపతయ్య: నీవేం భయపడకు కొమరయ్య
మల్లయ్య: ఎందుకు తొందర పడ్తావు బావ. ఏం చెప్తాడో విందాం.
కొమరయ్య: యీరన్న, మనుసులో ఉన్నదున్నట్టు కక్కేయి యింకా దాపరికమెందుకు?
తిరుపతయ్య: ఏం భయపడకు.
వీరయ్య: అవునయ్య. అందుకే వచ్చింది. నేనిన్నాళ్ళు నీకు వ్రాసిన ఉత్తరాలు, చెప్పిన మాటలు మరిచిపో అయ్య.
కొమరయ్య: అంటే?
తిరుపతయ్య: యీరయ్య, ఏందది?
వీరయ్య: నేను పుల్లమ్మను పెండ్లి చేసుకున్నా. నేను ఆమెకు భర్తను. అంతే. వేరే ఏమీ లేదు.
కొమరయ్య: వీరన్న. నీదోస్తు నీకేదో మాయ చేశిండురా.
తిరుపతయ్య: మాయనా, మాయనా (రఘుతో) ఎవరయ్య నువ్వు?
రంగయ్య: పెండ్లి చేస్కున్న పిల్లను పెండ్లాం అంటుంటే మాయ అనిపిస్తున్నదా మీకు. మీరు మనుషులేనా?
తిరుపతయ్య: మాట సరిగారాని, పెద్దమనిషివైతే అయినవు గాని.
(గంగయ్య ప్రవేశించి బావా అని వీరయ్యను కౌగిలించుకుంటాడు.)
వీరయ్య: మధ్యన నీకెందుకొచ్చిన తగాదా, పుల్లమ్మ నా పెండ్లాం అని చెప్పుతుంటే!
మల్లయ్య: మనం అంతా ఇంటికి పోదాం. ఆడోళ్ళకు తెలిస్తే పండగ చేసుకుంటరు. రా బావా! యింటికి పోదాం.
కొమరయ్య: నేను నీ వాకిలి తొక్కను.
తిరుపతయ్య: ఎంత మోసమాయె కొమరయ్య?
(కోపంతో ఇద్దరు వెళ్ళిపోతారు. వాండ్లవైపు మల్లయ్య దీనంగా చూస్తుండగా తెరపడ్తుంది.)