ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                    రిక్షాకూలీలు, ప్రజాసేవకులు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్పించాలి

   సికిందరాబాదు, ఏప్రిల్‌ 18, యుద్దకాలంలో ప్రయాణసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని యుద్దానంతరము ఆరునెలలవరకు రిక్షాలునడుపబడుటకు మాత్రమే మొదట అనుమతివ్వబడినటుల ప్రభుత్వము వారు ప్రకటించారు. 16 ఏప్రిల్‌ నుండి ఆరునెలల తర్వాత మొత్తము రిక్షాలు హైద్రాబాదు పట్టణములో రద్దుచేయబడునని తెలిపారు. యుద్దకాలములో పెట్రోలు, పశువులకొరతవల్ల రిక్షాలు ఉపయోగానికి కారణమనికూడా ప్రభుత్వ ప్రకటనలో ఉంది. అయితే ఈ రోజు పెట్రోలు కొరతని ఆరు నెలలకాలములో పశువులు లభింపగలవని హామీ ఇచ్చే స్థితిలో ప్రభుత్వము లేదని చెప్పవచ్చును. ఆయినప్పుడు ఒకవైపు ప్రయాణ సౌకర్యాలు వృద్ధిచేయక, రెండోవైపు ఉన్న సౌకర్యాలను రద్దుచేయడము ఏవిధముగాను సమర్దనీయముకాదు.
   ఇక రెండవ విషయము నిరుద్యోగ సమస్య. ప్రస్తుతము సుమారు 5 వేలకు పైగా రిక్షాలున్నవి. ఇవి కూలీలవికావు. గుత్తాపద్దతిన పగలు 1-4-0 రాత్రి 0-12-0ల ప్రకారము రిక్షా యజమానులకు చెల్లిస్తుంటారు. వాడుకసమయాన కలిగే నష్టాన్ని కూలీలే భరిస్తారు. రిక్షాలు నిలుచుటకు ప్రత్యేకస్థానాలు లేనందున పోలీసుల అదిరింపులు, జుర్మానాలు, లంచాలకు గురిఅగుతుంటారు. ఇన్ని కష్టాలకు, నష్టాలకు గురియై తర్వాత మిగిలితే దానితో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రభుత్వము నిర్ణయము వల్ల అ మాత్రము జీవనోపాధి కూడా లేకుండాపోతుంది. యుద్దానంతరము నిరుద్యోగ నివారణకు ప్రణాళికలు సిద్దముచేస్తున్నామని ఆర్భాటము చేస్తున్న ప్రభుత్వమువారు ఈ విధంగా నిరుద్యోగులను పెంచుతున్నారు.
   ఇది యిట్లుండగా ప్రజలలో కొన్ని విచిత్రవాదనలను లేవదీస్తున్నారు. రిక్షాలుపోతే ఇంకొకటి లేదా? రిక్షాకూలీలు సంపాదించే కూలి వేరేవిధంగా సంపాదించకూడదా? రిక్షాలు లేనప్పుడు ఏమిచేశారు? అని వాదిస్తున్నారు. దయచేసి ఈ ప్రశ్నలకు - తొలగింపబడనున్న రైల్వేకార్మికులకు, యుద్దకాలంలో చేర్చుకొనబడి నేడు తొలగింపబడనున్న లక్షలకొలది ఇతర కార్మికులకు అన్వయింప చేస్తారా? అందుకు అవునంటే ఈవాదన ప్రభుత్వముది. కాని బాధ్యతగల ప్రజలది, ప్రజాశ్రేయోభిలాషులది కాదు. ఒకటి గమనించమని కోరుచున్నాను. ఉన్నది వద్దంటున్నాము కాని వేరే ఆధారము కల్పించహామీనిచ్చే ప్రభుత్వములేదు. కాబట్టి నిరుద్యోగులు ఎక్కడ వీలు దొరికితే అక్కడికి ఉరికి, ఎన్నికష్టాలనైనా సహిస్తూ కుటుంబపోషణ జరుపుకుంటారు. బానిస భారతదేశములో అందు హైద్రాబాదువంటి సంస్థానాల్లో కొత్తదికాదు.
   ఇట్టి బాధ్యతారహితసమాజానికిబదులు జీవిత రక్షణ, శాంతి, సౌఖ్యములతో కూడిన సమాజాన్ని నిర్మించుటకు ఇట్టి కష్టజీవుల సంఘాలు పెట్టి, చైతన్యపరచి, దేశమునందలి రాజకీయసంస్థలు చేయూతనిస్తూ కృషిచేయుట తప్ప వేరు గత్యంతరము లేదు. రిక్షాకూలీలు స్వగ్రామాలు వదలి, ఆరోగ్యము నాశనము చేసుకొని, రిక్షాయజమానుల దోపిడికి, పోలీసుల నిరంకుశత్వానికి గురి అవుతూకూడ నేడు రిక్షాను లాగుతూన్నారంటే వినోదానికి కాదు. జీవితము గడవక, విధిలేక యని తెలిసికొనుట మిక్కిలి అవసరం ఉన్నది. వదలితే, వచ్చేది ఒకటి ఉన్నదనిహామీ లేదు కాబట్టి ఎన్ని ఇబ్బందులనైనా భరిస్తున్నారు. రిక్షాలను వ్యతిరేకించేవారు మానవత్వాన్ని, కూలీల ఆరోగ్యాన్ని చాటువెట్టుకుంటున్నారు. నేడు మిల్లుల్లో, ఫ్యాక్టరీల్లో చేతులువిరిగి, కండ్లుపోయితుదకు ప్రాణాలుకూడా కోల్పోతున్న కూలీలు ఉన్నారని తెలుసుకొనుట అవసరము. వారి సంఘాలు వికలాంగులచికిత్సకై, కూలీలు కుటుంబ పోషణకై పోరాడుతుంటే ఎంతమంది మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆరోగ్యాన్ని ఆలకిస్తున్నారు. అట్టిఘటనలు పత్రికలు ప్రకటించవు. ప్రభుత్వము నిర్తక్ష్యము వహిస్తున్నది. యజమానులు సాకులు వెదుకుతుంటారు. ఈ విధముగా నేటి బాధ్యతారహిత బానిస సమాజములో ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మిల్లులను, ఫ్యాక్టరీలను, రైళ్ళను ఆపివేయాలా? ఆలోచించండి. పరిశ్రమలు సంఘాభివృద్ధికి దోహదమిచ్చుటకై మనము ప్రయత్నము చేయాలి. డబ్బుగల వారు తమ పెట్టుబడితో బీదవారిని పీల్చివేస్తుంటే పీడిత ప్రజలకు చేయూతనిచ్చి, పెట్టుబడిని సమాజాభివృద్ధికై ఉపయోగపడుటకు కృషిచేయాలి.
   ఇవన్ని గమనించిన తర్వాత నేడు దేశక్షేమాన్ని కోరువారు నిర్వహించాల్సిన కర్తవ్యవిధియని మనవిచేస్తున్నాము. అందుకు ఆందోళన చేయాలని కోరుతున్నాను.
1. రిక్షాపై ఒకరు మాత్రమే కూర్చొవాలి
2. రిక్షాలకు సైకిళ్లను తొలగించి మనుష్యులు లాగేవే వాడుకలో ఉంచాలి.
3. మోయవలసిన బరువు నిర్ణయింపబడాలి.
4. పనిలో ప్రారంభించే వేళను, యజమానికి చెల్లించాల్సిన కూలీని తెలిపే పుస్తకము ప్రతీ కూలీవద్ద ఉండాలి.
5. రిక్షా యజమానులకు, కూలీలకు ఏర్పడే వివాదాలలో ప్రభుత్వము జోక్యం కలిగించుకొని న్యాయం చేకూర్చాలి.
6. సామాన్యంగా ప్రతిరోజు దొరికే కూలీని బట్టి యజమానికి చెల్లించాల్సింది నిశ్చయింపబడాలి.
7. రిక్షా కిరాయి కూడా నిర్ణయింపబడాలి.
8. రిక్షా యజమానులు అప్పులు బెట్టి శాశ్వతముగా బానిసలు చేయు పద్దతిని నిరోధించాలి.
9. రిక్షాలు నిలబడుటకు ప్రత్యేక ప్రదేశాలు నిర్ణయింపబడాలి.
10. వాడుక సమయమున కలిగిన నష్టము యజమానులే భరించాలి.