ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                                 కాళోజీ జ్ఞాపకాలు

    బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, పొట్లపల్లి రామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి వాండ్లంతాకలిసి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటనలు జరిపిన్రు. అక్కడి రైతుకూలీల పరిస్థితుల్ని గ్రహించిన్రు. ఆ తర్వాత ఆళ్వారుస్వామి పూర్తిగ కమ్యూనిస్టుపార్టీలో చేరి వర్కర్‌గా పనిచేసిండు. 'ప్రజలమనిషి', 'గంగు' ఆయన నవలలు. 'గంగు'కి ముందుమాటగా 'ఆళ్వార్‌' అని నేను రాసిన. దాంట్లోనే కోదాటి నారాయణరావుగారి వట్టికోట జీవిత విశేషాలు కూడ చేరిస్తినని గుర్తు. ఆళ్వారుస్వామి సికింద్రబాద్‌ ఇమాంబలి వీధిలోని ఒక గుడిలో ఉండెటోడు. ఈయన భార్య యశోదమ్మ. చిన్నప్పుడే ఈమె తల్లి చనిపోతే ఈమెని కోమటిముసలమ్మ పెంచింది. ఆమె ఆ గుడికి ధర్మకర్త. అక్కడి పెద్దపూజారి యశోదమ్మ తాతగారే. బోలెడు సంపత్తి గింపత్తి, భూములు గీములు వుండెటివి. అవన్ని ఆ ముసలమ్మ యశోదమ్మకి రాసిచ్చింది. అందుకని ఆళ్వారుస్వామి భార్యతోపాటు ఆ గుడిలోనే ఉండేటిది. అక్కడే దేశోద్ధారక గ్రంథమాల(1938) స్థాపించిండు. ఆ ఏడాది కాశీనాథుని నాగేశ్వరరావుగారు చనిపోతే ఆ పేరుమీద పెట్టిండు. 'ప్రజల ప్రభుత్వం', 'పౌరసత్వాలు' అని సురవరం ప్రతాపరెడ్డిగారి పుస్తకాలు రెండు వేసింది - అందులో ఒకటి టాల్‌స్టాయ్‌కి అనువాదం. వరసగా పద్దెనిమిది పుస్తకాలు అచ్చేశాక ఆయన అరెస్టు కావడంతో గ్రంథమాల ఆగిపోయింది. డెటిన్యూగా ఉండి రాసిన వుత్తరాలనిండా దీన్ని గురించి ఆలోచనలే. 'విడుదలైనంక ఏమి చేయాలె' అని నాకు రాస్తే 'ఉద్యమం ఏ పంథాలో నడిపిద్దామనుకున్నా గానీ అన్ని పంథాలూ, విషయాలు మనం తెల్సుకోవడం ముఖ్యం. కాబట్టి ప్రజలకి విజ్ఞానం కలుగజేసే పుస్తకాలు అచ్చువేసి గ్రంథమాలని కొనసాగించాలె' అని జవాబిచ్చిన. తర్వాత వేసిన పుస్తకాలలో నా వుత్తరంలోని రెండు మూడు వాక్యాలను కోట్‌చేసిండు. పోలీసు యాక్షన్‌ తరువాత గూడ (దాదాపు 51 వరకూ) రావి నారాయణరెడ్డి, ఎల్లారెడ్డిలతో పాటు జైల్లోనే ఉన్నాడు.

    మా సర్కిల్‌ లోపట భార్యను కూడా ఈ వుద్యమాలకు పరిచయం చేసి, సభలకి తీసుకుపోయేటోడు ఆళ్వారుస్వామి ఒక్కడే. ఇట్లాంటి ప్రయత్నం తక్కిన ఇండ్లల్ల జరగలేదనుకుంట. ఆమాటకొస్తే నా సంగతేమిటి? నేను స్వయంగ పాల్గొన్న వాడినెకద? కాని నా భార్యని ప్రయత్నం చేసి దాంట్లకి తీసుకురాలేదు. కారణం ఏదైనా కావచ్చు. ఆర్థికంగా నేను స్వతంత్రుడిని కాదు. అన్నగారిమీద ఆధారపడి నేను వూళ్ళు తిరుగుతున్నది కాక ఆమెని కూడా తిప్పినట్టయితె ఎట్లుంటది? అది కూడా ఒక కారణం కావచ్చు. ఆళ్వారుస్వామి 1944 మార్చి 13,14లలో బెజవాడలో జరిగిన అఖిలభారత రైతు మహాసభకి భార్యతో కలిసి వెళుతూ మధ్యలో మా ఇంటిదగ్గర ఆగడం నాకు బాగా గుర్తు. నైజాంరాజ్యంలో ప్రజావుద్యమాలల్ల మగవాండ్లు పాల్గొనడమే చాలా ప్రమాదకరమైన విషయం, ఆడవాండ్లని కూడా తీసుకుపోవడమనేది మరీ కష్టమైన విషయం. కాబట్టి అదికూడా ఒక కారణం కావచ్చు. సాధారణంగా ఆడవాండ్లు రావడమనేది లేదు. మూడో ఆంధ్రమహాసభ ఖమ్మంలో జరిగినప్పుడు పులిజాల వెంకటరంగారావుగారు అధ్యక్షులు. దాంతోపాటు మహిళాసభకూడా ప్రారంభమయింది. దానికి ఎల్లాప్రగడ సీతాకుమారిగారు అధ్యక్షులు. నాలుగో ఆంధ్రమహాసభకి (సిరిసిల్ల) మాడపాటి హనుమంతరావుగారు అధ్యక్షులు. మహిళాసభకి ఆయన భార్య మాణిక్యమ్మగారు అధ్యక్షత వహించిన్రు. ఓబుల రంగమ్మరెడ్డి గారు (డి.ఎస్‌.పి ఓబుల్‌రెడ్డి భార్య) మరు సంవత్సరం అధ్యక్షులు. ఇట్ల స్త్రీలను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు కొంత జరిగినై. స్థానికంగా వరంగల్లులో సభలు జరిగినప్పుడు మా అమ్మ, అమ్మతోబాటు మా వదినె, నా భార్య కూడా పోయి వుపన్యాసాలు వినడం, రావడమేగాని ప్రత్యక్షంగా మాత్రం ఉద్యమంలో పాల్గొన్నట్టు లేదు.కాని కమ్యూనిస్టులు మాత్రం కొంతమంది తమ భార్యల్ని తీసుకొచ్చెటోళ్లు కొందరు, ఉద్యమంలో పనిచేసే ఆడవాండ్లని పెండ్లి చేసుకునెటోళ్ళు, కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకి ముందు 'కామ్రేడ్‌ అసోసియేషన్‌' అని వుండేటిది. దాంట్లో మగ్దుం మొహినుద్దిన్‌, రావి నారాయణరెడ్డి, జహ్వాద్‌ రజ్వీ, ఓంకార ప్రసాద్‌, అలంకుంద్‌ మిరి (తర్వాత ఫిలాసఫీ ప్రొఫెసరయిండు), అక్బర్‌ హసన్‌(ఎడిటర్‌) సులెమాన్‌ అరీబ్‌ (కవి) మొదలైన వాండ్లంత మెంబర్లు. వీండ్లందరు బి.ఏ. లు చదివెటోళ్ళు. కామ్రెడ్‌ అక్తర్‌ హసన్‌, కామ్రెడ్‌ రావి నారాయణరెడ్డి - ఇట్ల పేర్ల వెంబడి కామ్రేడ్‌ అని వుండడం వాండ్ల పద్దతి. (నార్ల వెంకటేశ్వరరావు 'దాంపత్యం' నాటికలో భార్య భర్తని అడుగుతొంది అమాయకంగా 'ఏంటండీ, కామ్రేడ్‌ ఇంటిపేరు వాండ్లు ఇంతమంది వున్రా' అని!) వాండ్లలో కొంతమంది ఆంధ్రమహాసభలో చేరిన్రు. అటువంటి యువతతోపాటే వచ్చిండు ఆళ్వారుస్వామి. వైష్ణవకుటుంబంలో పుట్టి పెరిగినవాడు. మన సంస్కృతి జీర్ణించుకున్నవాడు. చిన్నప్పటినుంచీ కూడా గ్రామాల్లో వుండే పెత్తందార్ల గురించి తెలిసిన మనిషి. ఫ్యూడల్‌ సొసైటీలో వుండె చెడుగులన్నిటినీ కూడా ప్రత్యక్షంగా చూచినవాడూ, అనుభవించినవాడూను. కాబట్టి ప్రజావుద్యమాల్లో చేరిన తర్వాత కమ్యూనిస్టు ధోరణికి సహజంగానే మారిండు. కాని ఆ చాదస్తాలు మాత్రం ఆయన దగ్గర లేవు - అంటే 'పార్టీవ్రత్యం' పార్టీ పట్టింపులు, లేకపోతే కమ్యూనిజం, మార్క్సిజం అని గాంధీని హేళన చేయడం వగైరా. ఆ వీరశైవులూ, వీరవైష్ణవులు తీవ్రంగా తిట్టుకున్నట్టు వీరగాంధియన్లు, వీరమార్క్సిస్టులు ఒకరినొకరు తిట్టుకోవడం - గాంధీ దేశాన్ని నాశనం చేసిండు. గాంధీవల్లనే పిరికిపందలయిపోయిన్రు. లేకపోతే వయొలెన్స్‌తో రెవల్యూషన్‌ చేసి ఎప్పుడో స్వతంత్య్రం సంపాదించుకునెటోళ్ళం. గాంధీ ఇంపీరియలిస్ట్‌ ఏజంటు, సుభాష్‌ ఫాసిస్ట్‌ ఏజంటు అనేటోళ్ళు. కాని ఆళ్వారుస్వామి అటువంటి వాడు కాదు. ఏ పార్టీల వుండినా సిన్సియర్‌గా పనిచేసెటోడు. దాంట్లో ఉండేవారి పద్ధతుల్ని కూడా మార్చేందుకు ప్రయత్నించెటోడు. ఇంట్లోని జీవిత విధానంతో కూడా సరిపడక భార్యతోటి, తాతతోటి చాలా అవస్థ పడిండు. కొన్నాళ్ళు భార్యనీ, ఇంటినీ కూడా వదిలి వచ్చేసిండు. కేవలం రాజకీయాల్లోనే కాకుండా నిత్య జీవితంలో కూడ నిజమైన కమ్యూనిస్టుగా బతికిండు. అటువంటి ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల స్థాపించినప్పుడు 800 మంది మెంబర్లుగా చేరిండ్రు. గ్రామాల్లో రెడ్లకూ వెలమలకూ, గోల్కొండ వ్యాపారులకు గురుస్థానంలో వుండే వైష్ణవ కుటుంబానికి చెందిన ఆళ్వారుస్వామికి అంతమంది పరిచయస్థులుండెటోళ్ళు. నల్లగొండ, వరంగల్లు జిల్లాలో వూరూర తిరిగి విద్యాధికులైన కుటుంబాలవాండ్లందరినీ మెంబర్లుగా చేర్పించిండు. మెంబరుపిప్పెంత, నాలుగు రూపాయలో ఆరు రూపాయలోను. ఒకోపుస్తకం మెంబర్లకి పావలా, ఇతరులకి ఆరు అణాలకి ఇచ్చేటోడు. కొంతమందేమో గ్రంథమాల నుంచీ ఏడాదికి రెండు పుస్తకాలొస్తున్నయని ముచ్చటపడి ఇంటరెస్ట్‌తో కొనెటోళ్ళు. 'అయ్యవారు చెప్తుండు, ఇంటికొచ్చి కూచున్నడు పాపం, ఆయనకి సంవత్సరానికి నాలుగైదు రూపాయలిస్తే ఏం పోదు తీ' అనే బాపతు కొందరు. కొంతమంది చందాదారులకైతే చదువుకూడారాదు. 'ఇదో, ఈ ఆరునెల్లలోపట ఈ పుస్తకాలొచ్చినయ్‌' అని వాళ్ళకని అప్పజెప్పి చందాలు వసూలు చేసేటిది. సిటీలకచ్చి చదువుకునే వాండ్లకెగాని ఆనాడు టపా సౌకర్యం లేనందున, గ్రామాలకి పుస్తకాలందడం కష్టమే. కాని అతను తీసుకునే ప్రత్యేక శ్రద్ధ వల్ల ఊళ్ళకి కూడా చేరేటివి.


   (కాళోజీ ఆత్మకథ 'ఇదీ నాగొడవ' (1995) నుండి)