ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                                 వట్టికోట ఆళ్వారుస్వామితో ఆనాటి పరిచయం!
                                                                                                                  - నిఖిలేశ్వర్‌

   సికింద్రాబాద్‌ నుండి దేశోద్ధారక గ్రంథమాల ద్వారా వెలువడిన "జైలులోపల" కథలు చదవగానే, ఎవరీ వట్టికోట ఆళ్వారుస్వామి అనే జిజ్ఞాసకలిగింది. 1957లో నేను జమీస్తాన్‌పూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌.ఎస్‌.సి చదువుతున్న రోజులవి. సాయంత్రంకాగానే ముషీరాబాద్‌లోని ఆనాటి గౌరీశంకర్‌ గ్రంథాలయానికి వెళ్ళి ఆంధ్రప్రభ, భారతి చదివేవాణ్ణి. అక్కడే వట్టికోట వారి సాహిత్యంతో పరిచయం.

   గౌరీశంకర్‌ గ్రంథాలయాన్ని నిర్వహించిన వెంకట్రామయ్యజోషీ గారు వృత్తిరిత్యా పురోహితుడైనా, స్థానికంగా ప్రజాభిమానం పొందిన కాంగ్రేస్‌ నాయకుడు. ఆయనతో వట్టికోట వారికి మంచి స్నేహం ఉండేది. ఆరోజుల్లో మేమంతా నెహ్రూ సోషలిజానికి ఆకర్షితులమై, ఆ ఆశయమే భారతదేశాన్ని ఉద్ధరించగలదని భావించేవాళ్ళం. అయితే ఆళ్వారుస్వామి "ప్రజలమనిషి" చదివిన తర్వాత, కమ్యూనిష్టు భావజాలంపై ఆసక్తి కలిగింది.

   ముషీరాబాద్‌లోనే నేను ఇతరమిత్రులతో కలిసి 1958-60 మధ్య అభ్యుదయ యువకసంఘం ూతీశీస్త్రతీవరరఱరవ ్‌శీబ్‌ష్ట్ర ూరరశీషఱa్‌ఱశీఅ స్థాపించి నిర్వహించిన రోజులవి. సాహిత్య, సాంస్కృతిక క్రీడలు నిర్వహణ మున్సిపల్‌ పార్కులలోనే ఒక పఠనాలయం, విడిగా ఒకగదిలో మా సంఘం కార్యాలయం ఉండేది.

   ప్రతినెలా మేము నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో ఆయా రంగాలకు చెందిన వారిని పిలిచి, ప్రసంగాలు వినేవాళ్ళం. అదే క్రమంలో జోషీగారితో సంప్రదించి ఆళ్వారుస్వామిని ఆహ్వానించాం. ఆనాటికీ ఆయన గుమస్తా సంఘం, కార్మిక ఉద్యమాలలో చురుకైన పాత్రవహించి, రచయితగానే కాకుండా, గ్రంథాలయ ఉద్యమకర్తగా, కమ్యూనిస్టుపార్టీ సభ్యుడిగా ఎంతో పేరున్నవాడు.

   సికింద్రాబాద్‌ రాష్ట్రపతి రోడ్‌లో ఆనంద్‌భవన్‌ హోటల్‌ పక్కసందులోనేవున్న దేవాలయంలో భాగమైన ఇంట్లో మొదటిసారి ఆళ్వారుస్వామిని కలుసుకున్నాము. దబ్బపండుచాయ - నిండైన విగ్రహం - అందమైన ప్రశాంత ముఖవర్చస్సున్న "ప్రజలమనిషి" రచయిత! జోషీగారు పంపించారని తెలుసుకొని, ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.

   ఆ తర్వాత ఆదివారం సాయంత్రం ముషీరాబాద్‌ పార్క్‌లోనే బహిరంగసభ - ప్రధాన వక్తగా విచ్చేసిన ఆళ్వారుస్వామి నెహ్రూ సోషలిజం- కమ్యూనిజం - ప్రజా ఉద్యమాల" గురించి ప్రసంగించారు. ఆయనతో ఆ తర్వాత ప్రశ్నలడిగిమరి కొన్ని విషయాలు తెలుసుకోగలిగాము.

   1959-60లో కాబోలు ఎందువల్లనేమో వట్టికోట వారు కమ్యూనిస్టుపార్టీకీ రాజీనామా చేసి కాంగ్రేస్‌పార్టీలో చేరిపోయారనే వార్తలు చదివాము. ఆనాటి రాజకీయ పరిణామక్రమంలోనే ఆయన మళ్ళీ 1960లో కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చేసారని మాకు గుర్తు. ఆ రోజుల్లో నేను వ్యక్తిగతంగా కె.యాదవరెడ్డి పేరుతోనే, "గోలకొండపత్రిక" "ఆంధ్రరత్న", సంచారి, సంజయ లాంటి పత్రికలతో నా రచనలను ప్రచురించాను. నా కాలేజీ చదువు ఇతరత్రా వున్న అభిరుచి మూలానా హిందీ, ఇంగ్లీషు సాహిత్యం వైపు అధ్యయనం సాగిపోయింది.

   ఆ కాలంలోనే 1961 ఫిబ్రవరి ఏడవ తేది వార్తాపత్రికలో ఆళ్వారుస్వామి మరణవార్త చదివాను. (ఆయన కాలధర్మం చెందిన రోజు 5 ఫిబ్రవరి 1961)...

   మిత్రులు జ్వాలాముఖికి ఆళ్వారుస్వామి కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండేవి. ఒక సందర్భంలో నేను జ్వాలతో పాటు వెళ్ళి ఆళ్వారుస్వామి సతీమణిని, కుమారుణ్ణి చూసివచ్చాను. వారు నివసించేచోటే దేవాలయ నిర్వహణ కూడా ఆళ్వారుస్వామి ఆధీనంలోనే ఉండేది.

   చాలాకాలం తర్వాత నేను తిరిగి "ప్రజలమనిషి" నవలను చదివే అవసరం కలిగింది. వరవరరావు పరిశోధన (పి.హెచ్‌డి కోసం) అంశం "ప్రజలమనిషి" - ఒక పరిచయం శీర్షికన ప్రచురించిన ఆ పరిశోధనాంశాన్ని "భారతీ" సంపాదకులు, సమీక్షించమని నాకు పంపించారు. విపులంగానే నేను చేసిన సమీక్షను అక్టోబర్‌ 1979 భారతి ప్రచురించింది. మాటలో - రాతలో - చేతలో నిజాయితిగా జీవించి, తెలుగు- సాహిత్యంలో నిలిచిపోయిన అసమాన రచయిత వట్టికోట ఆళ్వారుస్వామితో ఉన్న ఆనాటి పరిచయం, నా జ్ఞాపకాల్లో శాశ్వతమైపోయింది.