ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

       ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జైని మల్లయ్య గుప్త తో యస్‌.మల్లారెడ్డి ఇంటర్వ్యూ

  (వట్టికోట గురించి ఆయన శత జయంతి సందర్భంగా విస్తృతంగా సాహిత్యం వచ్చింది. విస్తారంగా పరిశోధనా వ్యాసాలు వచ్చాయి. కానీ... వట్టికోట వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసి, ఆయనతో ఉద్యమంలో సహచరులుగా ఉన్న వారి జ్ఞాపకాలు, అనుభవాలు మనతో పంచుకున్నవారు అరుదు. ఈ కోణంలో మనకు తెలిసింది తక్కువ అనే చెప్పవచ్చు. ఈ లోటును పూడ్చేందుకే... 1944 ప్రాంతంలో ఆయనతో ఉద్యమ కార్యాచరణలో భాగస్వామిగా ఉండి, జైలు జీవితంలో కూడా సహచరులుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు 90 ఏళ్ల జైని మల్లయ్య గుప్త జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. ఆయన జ్ఞాపకాల్లో వట్టికోట ఆళ్వారు స్వామి... ఆయన వ్యక్తిత్వం...)

   నేను సాహిత్య కారుడ్ని కాదు. సాహితీ ప్రేమికుడిని. సాహితీకారుడిగా వట్టికోట ఎంతటి వాడో.. నేటి వారిలో చాలా మంది రచయితలు, కవులు ఆయన సాహిత్యాన్ని విశ్లేషించి నా కంటే బాగా చెప్పే వాళ్లున్నారు. నిజానికి మాకు వట్టికోట ఒక నిబద్ధమైన కమ్యూనిస్టు విప్లవకారుడుగానే (గౌరవం) తెలుసు. కానీ రచయితగా కాదు. కానీ ఖాళీ (విరామ) సమయాల్లో బయట ఉన్నప్పుడు కానీ.. జైలులో ఉన్నప్పుడు కానీ ఎక్కువ సమయం చదవడంలోనూ, రాయడంలోనూ గడిపేవాడు. తన చుట్టూ ఉన్నవారందరినీ చదివేందుకు, రాసేందుకు ప్రోత్సహించేవాడు. ఇక వట్టికోట వ్యక్తిత్వం, జీవితం గురించి ఆయనతో ఉద్యమ నిర్వహణలో భాగంగా, జైలులోనూ కలిసి ఏళ్ల తరబడి కలిసి జీవించాను. ఆ అర్హతతోనే.. ఆయనతో నా పరిచయ నేపథ్యానికీ, అనుభవాలకు మాత్రమే పరిమితమవుతాను.

   అది 1944 ప్రాంతం. తెలంగాణ అంతా ఆంధ్ర మహాసభ కార్యక్రమాలతో వేడెక్కుతున్న కాలం. ఊరూరా నిజాం వ్యతిరేక ఉద్యమాలు కదంతొక్కుతున్నాయి. నిజాం వ్యతిరేక పోరాటంతో పాటు, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రజలు రకరకాల రూపాల్లో ఉద్యమిస్తున్న కాలం. ఉద్యమ అవసరాల నేపథ్యంలోనే అనుకుంటా.. ఆరుట్ల లక్ష్మీనర్సింహారెడ్డి భువనగిరిలోనే ఉంటూ.. పరిసర గ్రామాల్లో సంఘ విస్తరణకు పూనుకున్నారు. ఆయన నాయకత్వంలో సంఘ సభ్యత్వం చేర్పించేందుకు ఊరూరా తిరుగుతూ సభలు, సమావేశాలు పెట్టేవారు. ఈ నేపథ్యంలోనే భువనగిరిలో "మిత్రమండలి" కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఊరూరా ప్రజలను సంఘ సభ్యులుగా చేర్చే కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతున్నది. సరిగ్గా ఆ సమయంలోనే.. భువనగిరిలో 11వ ఆంధ్ర మహాసభ జరిపేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ మహాసభ ఏర్పాట్లు కార్యక్రమాలు చేపడుతున్న సమయంలోనే... దేవులపల్లి వెంకటేశ్వరరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, సర్వభట్ల రామనాథం భువనగిరికి వచ్చారు. సభా ఏర్పాట్లు చూస్తున్నారు. ఆ క్రమంలోనే నాకు వారు పరిచయమయ్యారు. సభా నిర్వాహణ, ఏర్పాట్లు చూస్తూ వారు మా ఇంట్లోనే ఉండేవారు. వీరు ఎక్కువగా బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనకుండా.. మా లాంటి వారితో సభా నిర్వహణ (లీగల్‌) కార్యక్రమాలన్నీ చేయించేవారు. ఆరుట్ల సోదరులు (లక్ష్మినర్సింహరెడ్డి, రామచంద్రారెడ్డి), రావి నారాయణరెడ్డి తదితరులు అంతా సభా నిర్వహణలో ముందుభాగాన ఉండి పనులు చక్కపెడ్తుండేవారు. మా అందరికీ రావినారాయణరెడ్డి, ఆరుట్ల సోదరులు తదితర కామ్రేడ్స్‌ అగ్రభాగాన ఉన్న నేతలుగా వారిపై ఎనలేని అభిమానం ఉన్నా.. పార్టీ ప్రతినిధులుగా దేవులపల్లి, వట్టికోట ఆళ్వారుస్వామి పట్లనే మాకు ఎక్కువ గౌరవం ఉండేది. అప్పుడు మాలాంటి వాళ్లం అనాడున్న ఉద్యమ నేతలను జన నాయకులు, పార్టీనాయకులు అనే రెండు (అంచెల)రకాల నాయకత్వంగా చెప్పుకునేవాళ్లం. బహిరంగ కార్యకలాపాలను చూసే వారిని జన నేతలని, రహస్యంగా పార్టీ నిర్మాణాన్ని, ఉద్యమాన్ని గైడ్‌ చేసే వారిని పార్టీ నేతలుగా చూసే (చెప్పుకునే) వాళ్లం. ప్రజల దగ్గరికి పోయేందుకు ఏదో కార్యక్రమం కావాలి కదా.. గాంధీ జయంతిని జరుపుకోవడమే ఆనాడు పెద్ద ఉద్యమ కార్యక్రమం అయ్యింది. ఊరూరా గాంధీ జయంతులను జరిపేందుకు ప్రయత్నిస్తే.. నిజాం పోలీసులు డేగ కళ్లతో.. నిఘా వేసి ఏర్పాట్లు చేస్తున్న వారిని అరెస్టు చేసి నిర్బంధించే వారు. ఆంధ్రమహాసభ నిర్వహణా ఏర్పాట్లు, గాంధీ జయంతి కార్యక్రమాలలో భాగంగానే నన్ను రాజ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ 1946లో నిజాం పోలీసులు నన్ను అరెస్టు చేసి చంచల్‌గూడా జైలుకు పంపారు. జైలులోనూ వట్టికోటకు నేను సహచరుడిగా మారాను. బయట ఉద్యమ కార్యాచరణలోనూ, జైలు నిర్భంధంలోనూ వట్టికోటతో చాలా రోజులు గడిపే గొప్ప సదవకాశం దొరికింది. వట్టికోటతో పాటు అప్పటికే జైలులో రాజబహదూర్‌గౌర్‌, జవ్వాద్‌ రజ్వీ, సిద్ధుల బాలరాజు, గుండా కేశవులు, ముత్యం ప్రకాష్‌, ధర్మయ్య, ప్రేమ్‌ రాజయ్య, చారి అనే కామ్రేడ్‌ తదితరులు మరికొంత మంది ఉన్నారు. అలా ఒకటిన్నర, రెండేళ్లు జైల్లో ఉన్నాం అనుకుంట. అయితే.. బయట ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో జైలులో ఉన్న కామ్రేడ్సందరినీ వీలును చూసుకుని తప్పించుకు రావాలని పార్టీ కబురు పంపింది. ముందు వరుసలో అగ్రశ్రేణి నాయకులు తప్పించుకొని పోవడానికి అవకాశం కల్పించాలని, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకత్వం తప్పించుకు రావాలని జైలులోనికి కబురు పంపారు. దానికి అనుగుణంగానే.. నన్ను కోర్టుకు తరలిస్తుండగా.. నాంపల్లి రైల్వే స్టేషన్‌నుంచి ఎస్కార్ట్‌ పోలీసులు కళ్లు గప్పి తప్పించుకున్నాను. అక్కడినుంచి సిద్ధిపేట మీదుగా పార్టీ సానుభూతి పరుల సాయంతో.. భువనగిరి ఏరియాకు వచ్చి ఉద్యమంలో కలిశాను. ఆ తర్వాత.. వట్టికోట నిజామాబాద్‌ జైలుకు వెళ్లినట్లున్నారు. అక్కడి జైలుకు ఎపుడు ఎలా తరలించబడ్డాడో విషయం గుర్తులేదు.

   వట్టికోట ఎల్లప్పుడూ నిశ్చలంగా, ప్రశాంత వదనంతో కనిపించే వాడు. ఏది మాట్లాడినా.. ఎంతో పొదుపుగా, సూటిగా మాట్లాడే వాడు. పొల్లు మాటలు, ఉబుసుపోని కబుర్లు ఉండేవి కావు. ఎదుటి వారిని ఎంత చిన్న వాడైనా.. గౌరవ వచనంతో పిలిచేవాడు. నాకన్నా వట్టికోట దాదాపు పదేళ్లు పెద్ద. అయినా నన్ను ఏ సందర్భంలోనూ గౌరవ వాచకంతోనే పిలిచేవాడు.

   బయట నిజాం వ్యతిరేకత ఊపందుకున్నది. భువనగిరి ప్రాంతంలో ప్రారంభించిన కౌలు వ్యతిరేక పోరాటం.. కామ్రేడ్‌ ఆరుట్ల చొరవతో జనగాం తాలుకా చేరి విసునూరు దేశ్‌ముఖ్‌ ఏరియాకు విస్తరించింది. ఈ విసునూరు దౌర్జన్యాల వ్యతిరేక పోరే సాయుధ పోరుకు నాంది అయ్యింది. దొడ్డి కొమురయ్య అమరత్వం సాయుధ పోరుకు సైరనూదింది. ఆ పోరాటానికి ఆరుట్ల నారు పోసీ నీరు పోస్తే.. దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీంరెడ్డి నర్సింహారెడ్డి(బీఎన్‌) తదితర అగ్రనాయకత్వం ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి ప్రజా విముక్తి దిశగా సాయుధ పోరాటం సాగిపోయింది. అదంతా చరిత్ర. రక్తతర్పణలతో త్యాగాలు చాలుపోసిన చరిత్ర. మాకు సహచరులుగా ఉన్న కోదండరామిరెడ్డి, పులిగిల్లకు చెందిన పైళ్ల రాంచంద్రా రెడ్డి, కుర్రారం రాంరెడ్డి లాంటి ఎందరో ఉద్యమ నేతలు ఉద్యమకాలంలోనే అమరులయ్యారు.

   పోలీస్‌ యాక్షన్‌.., నిజాం స్టేట్‌ ఇండియన్‌ యూనియన్‌లో విలీనం.., సాయుధ పోరాట విరమణ.. ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి.

   మళ్లీ 50 ప్రాంతంలో ఆళ్వారుస్వామి మళ్లీ కాంటాక్ట్‌లోకి వచ్చాడు. వట్టికోట సికింద్రాబాద్‌లో సర్వోదయ ప్రెస్‌ అనేదాన్ని నడిపిస్తూ, దాని కేంద్రంగా ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నాడు. సికింద్రాబాద్‌ మార్కెట్‌లో గుమస్తాల సంఘం స్థాపించి దాని నేతగా వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాడు. శ్రామిక వర్గ సిద్ధాంతం వెలుగులో నిజమైన శ్రామికవర్గ పుత్రుడిగా, నేతగా అట్టడుగు వర్గాల ప్రజలకోసం నిరంతరం శ్రమించాడు. ప్రజల మనిషిగా ఎదిగాడు. ఇక్కడనే ఆయన సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాడో కూడా ఉదాహరణగా చెప్పాలి. ఆనాడు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌లో ఆంధ్రసారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో పెద్ద సాహిత్య సభ ఏర్పాటు చేశారు. దానికి తెలుగు నేల నలుమూలాలనుంచీ సాహిత్యాభిమానులను, ఉద్యమకారులను తరలించే పనికి ఆళ్వారు స్వామి పూనుకున్నాడు. భువనగిరి నుంచి నేను, మరికొంత మంది మిత్రులతో కలిసి ఆలంపూర్‌ సెషన్‌కు వెళ్లాం. ఆనాడు ఆ సభకు ఎంతటి ప్రాముఖ్యత అంటే.. సికింద్రాబాద్‌నుంచి ఆలంపూర్‌కు ప్రత్యేకంగా ఓ రైలు వేశారు. దానిలోనే మేమంతా ఆలంపూర్‌ బయలుదేరాం. ఆ రైలులోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కూడా ఆలంపూర్‌ సెషన్‌కు వచ్చారు. దేశోద్దారక గ్రంథమాలను స్థాపించి పుస్తకాలను అచ్చు వేయడం, వాటిని ప్రజల్లో ప్రచారం చేయడం వట్టికోట కార్యక్రమంగా పెట్టుకున్నాడు. వంద రూపాయలకు దేశోద్ధారక గ్రంథమాల తరపున అచ్చులోకి వచ్చిన పుస్తకాలన్నింటినీ అందించేవాడు. సామాజిక శాస్త్రాలను, శాస్త్రీయ భావనలతో కూడిన పుస్తకాలను చిన్న చిన్న పుస్తకాలుగా అచ్చు వేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెచ్చేవాడు. భువనగిరికి వచ్చి పుస్తకాలకు చందాదారులుగా చేర్పించేందుకు నన్ను వెంటేసుకు తిరిగాడు. నేను, ఆయన ఊరంతా తిరిగితే ముగ్గుర్నో, నలుగురినో చందాదారులుగా చేర్పించగలిగాం. ఆనాడు వంద రూపాయలంటే పెద్ద మొత్తమే కదా, కాబట్టి తక్కువ మందినే చందాదారులుగా చేర్పించగలిగాం. అయితే.. తాను అచ్చేసిన పుస్తకాలను ఓ సంచిలో వేసుకొని ఊరూరా తిరిగి అమ్మేవాడు. ఈ కార్యాచరణే చివరికి ఆళ్వారు స్వామి అంటే "జబ్బకు సంచి, సంచిలో పుస్తకాలు" అన్నంతా రూపు కట్టింది. అలా ఊరూరా తిరుగుతూ.. పుస్తకాలను ప్రజలతో చదివిస్తూ.., గ్రంథాలయాలను స్థాపిస్తూ పుస్తక పఠనం ప్రాముఖ్యతను చాటి చెప్పాడు. గ్రంథాలయాలే సమాజ మార్పుకు చైతన్య బీజాలని భావించాడు. అందుకే తన తుది శ్వాస దాకా గ్రంథాలయ స్థాపనకు ప్రాముఖ్యతనిచ్చి దేశమంతా కలియదిరిగాడు.

   ఇవ్వాళ్టి సమాజం నాటి త్యాగమూర్తుల జీవితాలనుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది. వారెప్పుడూ ప్రచారాన్ని కోరుకోలేదు. త్యాగాలకు ముందుండి పోరాడారు. సామాజిక సమస్యలు, పరిష్కారాలు పరమావధిగా జీవించారు. కులాన్ని, వర్గాన్ని తన చైతన్యంతో కాలదన్ని పోరాటంలోకి వచ్చిన వారిని ఓ నూతన మానవుడిగా పరిగణించే వారు. అలాంటి ఉద్యమకారులకు ఏ కులం, మతం, వర్గం అంటగట్టడం అసమంజసం, అన్యాయం అంటాను. కానీ నేడు స్థితి మారిపోయింది. పరిస్థితి తలకిందులైంది. అన్ని రకాల వెనకబాటు తనాలను, మౌఢ్యాలను కాలదన్ని వచ్చిన వారికి కూడా కులాన్ని అంటగడుతున్నారు. పోరాటమే జీవితంగా ఎంచుకున్న విప్లవకారుడికి కులమతాలను అంటగట్టడం కన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. ఇక్కడే ఇప్పటి విపరీతాలను కూడా చెప్పుకోవాలి. ఇది.. నాడూ..నేడూ.. పరిస్థితులను కళ్లారా చూసిన వాడిగా.. నా ఆవేదన.. అంతకన్నా నా ఆగ్రహం కూడా. రైతుకూలీ సంఘం కార్యకర్తగా, పార్టీ ఇచ్చిన పిలుపు, చైతన్యంతో ఐలమ్మ విసునూరు దేశ్‌ముఖ్‌కు దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించి పోరాడింది. ఆ అర్థంలో ఆమె నాటి సంఘం కార్యకర్తగా గొప్ప విప్లవకారిణి. ధీరవనిత. ఇప్పుడామెకు కులం అంట గట్టారు. కామ్రేడ్‌ ఐలమ్మను చాకలి ఐలమ్మ చేశారు. జీవితాంతం ధర్మం తప్పని, మడమ తిప్పని ధర్మభిక్షంకు కూడా కులం తోక తగిలించి ధర్మభిక్షంగౌడ్‌ చేసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే..ఎన్నో వెగటు పుట్టిస్తున్నాయి. కమ్యూనిస్టులకు కులాన్ని అంటగట్టి చూడటం.. నిజానికి వారు నమ్మిన సిద్దాంతాలకు వెన్నుపోటు పొడవటమే కాదు, వారికి ద్రోహం తలపెట్టడమే. దీన్ని ఎవరు ఎందుకు చేసినా వారిని చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే బాపతుగానే చూడాలి. చెప్పాలి. ఇలాంటి చర్యలను ఏరూపంలో ఉన్నా ఖండించాలి. ధర్మభిక్షం, భీంరెడ్డి, నల్లా నర్సింహులు లాంటి వాళ్లు జీవితాంతం కులమతాలను విడనాడి, తమ శాస్త్రీయ వర్గ చైతన్యంతో కుల, మత రహిత సమసమాజంకోసం పోరాడారు. ఇలాంటి వారు ఎంతో మంది జీవితాంతం వేటికి వ్యతిరేకంగా పోరాడారో.., వాటి ఛాయలోనే వారిని నిలబెట్టాలని చూడటం మహా నేరం. ఇది ఎవరు చేసినా క్షమించరానిది. కానీ ఇవ్వాళ.. అలాంటివి ఏ జంకు లేకుండా, సిగ్గు, ఎగ్గు లేకుండా సాగిపోతున్నాయి. మరో వైపు ఇవ్వాళ.. పోరాటం అంటే.. పేపర్లో ఫోటో, అచ్చులో పేరు కనిపించడంగా మారిపోయింది. ఉద్యమాలంటే.. సంతకాల సేకరణలు, వంటావార్పులై పోయిన కాలం మనది. కడుపులో చల్ల కదలకుండా చేసేవే ఉద్యమాలుగా చెలామణి అవుతున్నాయి. నిజాయితీగా, త్యాగపూరితంగా ఉద్యమించడానికి కదులుదాం అంటే.. ఈ నాడు ఉద్యమకారులుగా ఊరేగుతున్న వారు ఎంతమంది మిగులుతారో.. అనుమానమే.

   ఈ సందర్భంగా.. నేను చెప్పదల్చుకున్నది ఒకటే. కుల, మత ఛాందసాలు మళ్లీ రోజు రోజుకూ పుంజుకుంటున్న ప్రత్యేక సందర్భంలో మనం ఉన్నాం. కుల సంఘటిత, చైతన్యఉద్యమాల పేర సాగుతున్న పెడధోరణులు, ఘర్‌ వాపసీ పేర సాగుతున్న మత ఛాందస ఆధిపత్య దురహంకారాలకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక విలువల కోసం పోరాడుదాం. త్యాగధనుల జీవితాచరణను ఆదర్శంగా తీసుకోవడమంటే.. వారి అడుగుజాడల్లో భవిష్యత్తరాలను నడిపించడమే. వారి ఆదర్శాలను, భావాలను సమాజంలో ప్రచారం చేయడమే. ఈ క్రమంలో త్యాగ ధనులను నేటి సమాజానికి చూపడంలో విగ్రహాలు, పేర్లు పెట్టడాలు ఒక భాగమే కావచ్చు, కానీ అది మాత్రమే కాదు. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం ముఖ్యం. ఏ ఆశయాల కోసం వారు పోరాడారు, తమ జీవితాలను అర్పించారు.. ఏ విలువలతో.. మాననీయులుగా మిగిలారు అన్న దాన్ని భావితరాలకు తెలియజెప్పాలి. వారి ఆశయాలను, భావాలను భవిష్యత్తరాలకు అందించాలి. దానికోసం తగిన కార్యాచరణను ఎంచుకొని ప్రజాక్షేత్రంలో ఆచరణలో పెట్టటమే చేయాల్సిన పని. ఈ నేపథ్యంలో.. వట్టికోట ఆళ్వారుస్వామి ఆశయాల సాధన కోసం మనదైన కార్యాచరణతో సమాజ మార్పుకు కృషిచేద్దాం. దీనిలో భాగంగా ఊరూరా గ్రంథాలయాలను స్థాపించి పల్లెలను చైతన్య దివిటీలుగా మారుద్దాం. వట్టికోట జీవితం, ఆచరణ మనకు నేర్పేందిదే.