ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

               ప్రముఖ సాహితీపరుడు
           శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి అకాల మృతి

విశాలాంధ్ర(8-2-1961)
   విజయవాడ ఫిబ్రవరి 6: ప్రముఖ సాంఘీక సేవకుడు, పేరొందిన రచయిత, హైదరాబాద్‌ నగర కమ్యూనిస్టు సమితి సభ్యుడు అయిన శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి సికింద్రాబాద్‌లో నేటి ప్రాత:కాలం హఠాత్తుగా అకాల మరణం చెందారని తెలుపుటకు విచారిస్తున్నాం.
   నిన్న సాయంత్రం తమ ఎనిమిదేండ్ల కుమారునితో పాటు వీరు హైద్రాబాద్‌లోని పారిశ్రామిక ప్రదర్శన శాలకు వెళ్లి, తిరిగి ఉల్లాసంగానే ఇంటికి వచ్చాడు. కాని రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా తన గుండెలో నొప్పి పుడుతున్నదన్నాడు. తర్వాత కొద్ది సేపటికే సృహ తప్పి పడిపోయాడు. వారిని వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి చేర్చారు. కాని వారికి తిరిగి స్పృహ రాలేదు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మరణించాడు.
   ఈ విషాద వార్త త్వరలోనే జంటనగరాలలో వ్యాపించింది. సాంఘిక, సారస్వత రంగాలలోని ప్రముఖ నాయకులు అనేక మంది వారి కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేయడానికి వెళ్లారు.
   వీరిలో విశాల హైద్రాబాద్‌ మేయర్‌ శ్రీ వేద్‌ప్రకాశ్‌ దుస్సజ్‌, సికింద్రాబాద్‌ మాజీ మేయర్లు శ్రీ కె.ఎస్‌. నారాయణ, శ్రీ వెంకటేశం, శ్రీ ఎస్‌.సత్యనారాయణ గుప్త, శాసన సభ్యులు శ్రీ బద్దం ఎల్లారెడ్డి, రైతు నాయకులు శ్రీ వై.వి.కృష్ణారావు, కార్మిక నాయకులు శ్రీ ఎన్‌.సత్యనారాయణ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకులు శ్రీ జి.ఎల్లమందారెడ్డి, గ్రంథాలయోద్యమ నాయకులు శ్రీ కోదాటి నారాయణరావు, శాసనసభ్యురాలు శ్రీమతి ఆరుట్ల కమలాదేవి, తెలంగాణ ప్రముఖ సాహితీపరులు డా||రామరాజు, దాశరథి, సి.నారాయణరెడ్డి, విశాలాంధ్ర ఉపసంపాదకులు శ్రీ తాపీ మోహనరావు మున్నగు వారున్నారు.
   జీవిత సంగ్రహం
   శ్రీ ఆళ్వారుస్వామి వయస్సు 47 సంవత్సరాలు. వీరికి తల్లి, భార్య, ఒక కుమారుడు ఉన్నారు. గత 20 ఏండ్లలోనే సికింద్రాబాద్‌ నగరంలో నికరమైన సాంఘిక రాజకీయ సేవకుడిగా, శ్రీ ఆళ్వారుస్వామి గణుతికెక్కినాడు. సారస్వత రాజకీయ సంఘాలకు సంబంధించిన సకల అభ్యుదయ ఉద్యమాలలోనూ పాల్గొన్నాడు. అతి సామాన్య స్థితిగల కుటుంబంలోనే పుట్టినా యీ రంగాలన్నింటా అత్యంత ప్రముఖ స్థానాన్ని అలంకరించాడు. ఏ విధంగా చూచినా ఈయన స్వయం కృషితోనే ప్రతిభావంతుడైన వ్యక్తి.
   ఆదిలో పిన్న వయస్కుడిగా ఉన్పప్పుడు విజయవాడలో హోటల్‌ కార్మికుడిగా పనిచేశాడు. తాను సంపాదించిన కొద్దిపాటి డబ్బులలోనే ఏదో కొంచెం మిగుల్చుకొని కొంచెం చదువను, వ్రాయను నేర్చుకొన్నాడు. ఆ తర్వాత పట్టుదలతో కృషి సాగించి తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యాన్ని సంపాదించాడు. రాజకీయశాస్త్రం, తదితర విషయాలలో కూడ తగినంత పరిజ్ఞానాన్ని సంపాదించాడు.
   1940 తర్వాత సికింద్రాబాద్‌లో స్థిరపడ్డాడు. అప్పటి నుండి ఆంధ్ర మహాసభలోను, క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ తీవ్రంగా కృషి చేశాడు. 1944లో వీరు కమ్యూనిష్టు పార్టీ సభ్యత్వాన్ని పొందాడు. కమ్యూనిస్టు పార్టీ మీద నైజాం ప్రభుత్వం తీవ్ర నిర్భంధాల్ని సాగించినప్పుడు 1945లో అరెస్టయ్యాడు. గుల్బర్గా జైలులో ఉండగా అధికారులు వీరిపై అమానుషంగా లాఠీచార్జీ చేశారు. అందవల్ల తాత్కాలికంగా వీరి కనుచూపు పోయినది. నేటి వరకు వీరు శాంతి ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే వీరిని ఆఫ్రికా -ఆసియా సంఘీభావ సంఘం భారత కార్యవర్గంలోకి ఎన్నుకొన్నారు.
   రచయితగాను, ప్రచురణ కర్తగాను చాలా ప్రఖ్యాతిగాంచాడు. 1941 (1938) లోనే దేశోద్ధారక గ్రంథమండలిని స్థాపించాడు. తద్వారా రాజకీయ, ఆర్ధిక, సారస్వత పనులపై అనేక గ్రంథాలను వెలువరించాడు. శ్రీ ఆళ్వారుస్వామి ప్రజల మనిషి అనే నవల వ్రాశాడు. దీనితో తెలంగాణ సారస్వత రంగంలో వారికి సుస్థిర స్థానం ఏర్పడింది. మరణ కాలానికి ఈ నవల కథా వస్తువులోని పరిశిష్ఠ భాగాన్ని వ్రాయడంలోనే నిమగ్నమైయున్నాడు.
   పోతన వ్రాసిన భాగవతంపై పరిశోధన జరిపి ప్రథమ సంపుటాన్ని పూర్తి చేశారు. శ్రీ ఆళ్వారుస్వామి సరస హృదయుడు. అత్యంత ప్రేమ పాత్రుడు. వారి అకాల మరణానికి జంటనగరాలలో అసంఖ్యాకమైన మిత్రవర్గం తీవ్ర సంతాపం చెందుతున్నది.