ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

               సుప్రసిద్ధ ప్రజాసేవకుడు కీ.శే. వట్టికోట ఆళ్వారుస్వామి
                                      - కేతవరపు రామకోటి శాస్త్రి

   ఆంధ్రప్రభ (ఫిబ్రవరి 14, 1961)
   పరమ దేశ భక్తుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు, తెలంగాణ విముక్తికి అనేక ముఖముల రాజకీయముగా కష్టనష్టములకు గురియై అహరహములు పాటుపడిన మహానీయుడు అయిన శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి అకాల మరణము చాలా విచారకరమైన విషయము.
   బడియెగగొట్టి ఇంటినుండి పారిపోయి వచ్చి హోటలులో సర్వరుగా నెలకు నాలుగు రూపాయల జీతముతో జీవితమును ప్రారంభించిన ఆళ్వారుస్వామి దేశభక్తుడై, ప్రజాసేవకుడై, అభ్యుదయవాదియై కారాగార శిక్షలననుభవించి చివరకు ''దేశోద్దారక గ్రంథమాల" స్థాపకుడును ప్రకాశకుడునై "దేశోద్ధారక నూచీ గ్రంథాలయము"ను నెలకొల్పిన మహావ్యక్తిగా తేలుట ఆశ్చర్యము కలిగించునది గాని మరొకటి కాదు.
   క్రీ.శ.1914 సంవత్సరమున జన్మించిన ఆళ్వారుస్వామి నలుబది యేడవ ఏట 1961 సంవత్వరము ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 2 గంటలకు గొద్దలిపెట్టుగా ఒక్కపారిగా గుండెయాగి సికింద్రాబాదు మారేడుపల్లిలో మరణించిరి.
   శ్రీ ఆళ్వారుప్వామి క్రీ.శ. 1938 సంవత్సరమున "దేశోద్ధారక గ్రంథమాల" స్థాపించినాడు. కీ.శే. దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారి స్మారక చిహ్నముగా దానిని నెలకొల్పినాడు. ఆ గ్రంథమాల ద్వారా "రాజకీయ విజ్ఞానమును కలిగించి, స్వాభిమానమును పురిగొల్పి- సత్వరకర్తవ్యమునుపదేశించు గ్రంథములను మనిషి" యే పంథా నవలంబించవలయునే అని ఆలోచించుటకు ముందు వివిథాలను తెలిసికొనుట ముఖ్యము"అను ఆశయముతో ఆళ్వారుస్వామి ప్రచురించినాడు. ఇప్పటికి 33 గ్రంథముల నాయన ప్రచురించెను.పూరక గ్రంథములను ప్రచురించుటయే గాక తెలంగాణమున మూల మూల తిరిగి ఆయా గ్రంథములను ప్రజలకు సరసమైన ధరలకందజేసిరి. తెలంగాణమున తెలుగు పఠనమింతగా వ్యాప్తియగుటకు ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణములు ముఖ్యకారణమని చెప్పవచ్చును. తెలంగాణమున మారుమూలల నున్న రచయితలకు చాలామందికి ప్రోత్సాహమిచ్చి వారి వారి రచనలను సేకరించి శ్రీ ఆళ్వారుస్వామి ప్రచురించినాడు. ఆయన మంచిదనుకొన్న గ్రంథమును తెనుగులో గాక మరియే ఇతర భాషలో నున్నను వెంటనే దానిని అనువాదం చేయించి ముద్రించుటయందాయన కాసక్తి మిక్కుటము. అన్నిటిని మించి ఆయనచే దేశోద్ధారక సూచీ గ్రంధాలయం నెలకొల్పబడినది. ఈ గ్రంథాలయములో ప్రాచీనములై ఇప్పుడు లభింపని పుస్తకాలు, పత్రికలు చాలా గలవు. పత్రికలలో ముఖ్యముగా పేర్కొనదగినది తెలంగాణ నుంచి మొట్టమొదట ప్రచురింపబడిన తెలుగు పత్రిక 'నీలగిరి' సంచికలను సంపాదించుటకు శ్రీ ఆళ్వారు స్వామిగారు పడిన శ్రమ ఇంతంత యనరానిది. ఆయన తన దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణములను తీసికొని దేశమున తిరుగుటలో ఎక్కడ ఏ పాత్ర కనిపించిన (పాత పత్రికలు?) దానిని సంపాదించి బైండు చేయించువరకు ఆయనకు నిద్ర పట్టెడిది కాదు. ఆ విధముగా నీలగిరి-సుజాత-తెలుగుతల్లి-అభ్యుదయ-భారతి-కృష్ణాపత్రిక- మీజాన్‌- తెలంగాణ మొదలైన ఈ పత్రికలు చాల వెనుకటివి. ఇవి గాక ఉర్దూ భాషలో వచ్చినవి సంపుటములుగా మార్చి శ్రీ ఆళ్వారుస్వామిగారు తమ గ్రంథాలయమున నుంచిరి. ఇప్పటికి నెలకు నలుబది రూపాయల విలువకు తక్కువగాని పత్రికలు బహువిధములైనవి ఆ గ్రంథాలయమునకు వచ్చును. దిన పత్రికలు కూడా సంపుటములుగా బైండు చేయించి శ్రీ ఆళ్వారుస్వామి తమ గ్రంథాలయమున నుంచినాడు. ఆ విధముగా ఆ గ్రంథాలయము గొప్ప రెఫరెన్సు గ్రంథాలయము కావలయునని ఆయన సంకల్పము. అంతయు ఆయన స్వయం కృషి. ఇప్పుడా గ్రంథాలయమున కొన్ని వందల పుస్తకములు. కొన్ని వందల పత్రికా సంపుటములు కలవు.
   ఇప్పుడా గ్రంథాలయమేమి కావలయును. దీని కొరకై శ్రీ ఆళ్వారుస్వామిగారు సుమారొక సంవత్సరమునుండి మారేడుపల్లిలోని మునిసిపల్‌ క్వార్టర్సులో నివసించుచున్నాడు. మునిసిపాలిటీ వారి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందు గ్రంథాలయము నుంచినాడు. బహు విషయములకు సంబంధించిన పరిశోధనలు చేయుటకా గ్రంథాలయము ఎంతగానో ఉపయోగపడగలదు గనుక హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ వారు ఆ గ్రంథాలయము నేదోనొక విధముగా స్వాధీనము చేసికొని ఆయన నివసించు ఇల్లుగాని, లేక గ్రంథాలయము ప్రస్తుతమున్న ఇల్లుగాని ఆ గ్రంథాలయ భవనముగా చేయవచ్చు. మరియు నా గ్రంథాలయమునట్లే ముందు ముందు అభివృద్ధి చేయవలయును. అందుకు కావలసినచో ప్రజల నుండి ధన సహాయము నభ్యర్థించి పొందవచ్చును. శ్రీ ఆళ్వారుస్వామి గారి జీవితాశయము గ్రంథాలయమట్లు స్థిరమై అభివృద్ధిని పొందుటయే. ఆ విషయమునే ఆయన చేసిన ప్రజాసేవకు - ఆయన త్యాగనిరతికి ఆయన తరువాత నిలిచినదా గ్రంథాలయమే. ఒక్క వ్యక్తి తన స్వయం కృషిమీద అట్టి గ్రంథాలయమును దేశము యొక్క ఉపయోగము కొరకు నెలకొల్పి ఆయన బ్రతికి యున్నంతకాలము దాని అభివృద్ధి చేసినాడు. ఆయన తరువాత మునిసిపల్‌ కార్పోరేషన్‌ వంటి ప్రజాసంస్థ దానిని చేపట్టి నిర్వహించుటయే యుచితము. ఒక వ్యక్తికి సాధ్యమైనపని ప్రజాస్వామ్య యుగములో నొక సంస్థకు సాధ్యం కాకపోదు. అది "దేశోద్ధారక సూచీ గ్రంథాలయము" గనే ఉండవలయును. అపుడది శ్రీ ఆళ్వారుస్వామిగారి స్మారక చిహ్నముగా గూడ నుండగలదు. ఈ విషయమున హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషను తప్పక శ్రద్ధ వహించవలసినదిగా ప్రార్థించుచున్నాను. ఆ కార్పోరేషన్‌ అట్లు శ్రద్ధ తీసుకొనిననట్లే కొనసాగించునట్లు సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ పౌరులు శక్తి వంచన లేకుండా ఆర్థికముగా సహాయము చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాను.
   శ్రీ ఆళ్వారు స్వామిగారి నిజాయితీ- క్రమబద్ధమైన ప్రజాసేవ సికింద్రాబాద్‌ - హైదరాబాద్‌ పౌరులకు క్రొత్తగా చెప్పవలసిన పనిలేదు. ఆయన బ్రతికినంత కాలము ఆయన విద్యుక్త ధర్మము నాయన చేసెను. అట్లే మనమును మన ధర్మము చేయవలయును.
   ఆ విధముగా మునిసిపల్‌ కార్పొరేషను వారు "దేశోద్ధారక సూచీ గ్రంథాలయము" తమ యధీనమందుంచుకొని శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామిగారి స్మారక చిహ్నముగా కొనసాగించుచు అభివృద్ధిచేయుచో నేను ఉడుతాభక్తిగా ముందు నూరు రూపాయలు గ్రంథాలయమున కీయగలను. మరియు కార్పోరేషను అట్లు చేయుటకు ప్రార్థించుచున్నాను.
   దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ఆంధ్ర దేశమునకు గొప్ప భాషాసేవ చేసిన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారిని చిరస్మరణీయులుగా చేసియున్నారని శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారి చేతను, "ఆంధ్రుల విజ్ఞానాభివృద్ధికి శ్రమించునట్టి" వ్యక్తియని శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి చేతను "తమరు చేయుచున్న ఆంధ్ర భాషాసేవ ప్రశంసనీయమైయున్నదని" శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులుగారి చేతను మిక్కిలిగా ప్రశంసింపబడడిన ఉత్తమ వ్యక్తి శ్రీ ఆళ్వారుస్వామి మనకు లేడు. ఆయన నెలకొల్పిన 'దేశోద్ధారక సూచీ గ్రంథాలయమే' మనకున్నది. దానిని మనము కాపాడుకొనవలయును. ఇది మన కర్తవ్యము.
   మరియు శ్రీ ఆళ్వారుస్వామిగారు తలపెట్టిన కార్యక్రమము చాలా యున్నది. ముఖ్యముగా శ్రీ వానమామలై వరదాచార్యుల వారి మహా ప్రబంధము "పోతన చరిత్ర" ముద్రణము సగములో మిగిలిపోయినది. దానితో పాటు మరికొన్ని ముద్రణమునకాయన సిద్ధము చేసి యుంచిన గ్రంథములు యున్నవి. సగము ముద్రింపబడిన 'పోతన చరిత్రము'ను పూర్తిగావించుటయు, మిగిలి గ్రంథముల విషయమున శ్రద్ధ తీసికొని కృషి చేయుటయు ఆయన మిత్రుల బాధ్యత. శ్రీ దాశరధి, శ్రీ సి.నారాయణరెడ్డి, శ్రీ రామరాజు, శ్రీ కాళోజీ నారాయణరావు, శ్రీ కోదాటి నారాయణరావు, శ్రీ బలరామాచార్యులు మొదలుగా గలిగిన ప్రముఖులందరు ఆయనకు దగ్గరి మిత్రులు. వారందరును కలిసి పై విషయము ఆలోచించి ఒక నిర్ణయమునకు వచ్చి ఆయన తలపెట్టిన కార్యమును గట్టెక్కింప వలయును.
   శ్రీ ఆళ్వారుస్వామి గారి మరణము రాజకీయ, సాంస్కృతిక చైతన్యమునకొక తీరని దెబ్బ.