ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

               ఆంధ్ర మహాసభ కార్యకారిణి సభ్యుల విచారణ రిపోర్టు.
   26 మెహరు 1350 ఫసిలి
   గద్వాల సంస్థానపు రైతులు కొన్ని ఇబ్బందులను అక్రమపు పన్నులగురించి దరఖాస్తు ఇచ్చి మా సహాయము కోరియుండిరి. వాటి నిజానిజములను స్థానికముగా విచారించుటకై ఆంధ్ర మహా సభాధ్యక్షుల ఆజ్ఞానుసారము కార్యనిర్వాహక వర్గపు సభ్యులిద్దరు పంపించబడిరి. స్థానిక విచారణాంతరము ఆ సభ్యులు ఒక వివరమైన రిపోర్టు చేసిరి. అందుపైన కార్య నిర్వాహక సభయందు ఆలోచించిన పిమ్మట సంస్థానాధీశురాలగు రాణీగారికిని సంస్థానపు అధికారులకును రిపోర్టు నకలు పంపి , ఈ ఇబ్బందులను దొలగించుటకై శ్రద్ధ కలిగింపవలయునని నిర్ణయింపబడియుండెను. కాని సంస్థానపు అధికారుల పక్షమున ఏవిధమైన పరిష్కారముగాని చేయబడినట్లు ఈ కార్యాలయమునకు తెలియనందున 25 మెగరు 1350 ఫసలీనాటి కార్యనిర్వాహక సభయందు తిరిగి ఆలోచింపబడెను. ఎట్టకేలకు మ|| రా|| రాణీగారి సన్నిధికి ఈ సంగతి తెలిపి, కా.ని. సం. సభ్యులవిచారణ రిపోర్టును ప్రచురింపవలెనని నిర్ణయింపబడెను. ఆ నిర్ణయానుసారము రిపోర్టు ప్రచురింపబడుచున్నది.కాని అయిజా గ్రామపుస్థితిగతులు పౌజ్దారీ మొకద్దమాలు, గిరఫ్తారీలు మొదలగువాటిని గురించిన భాగము ఈ నివేదికనుండి ప్రస్తుతము తీసివేయబడుచున్నది. ఏమనగా ఇంతవరకు ఆ ఫౌజ్దారీ మొకద్దమాల తుదిపరిష్కారము కాలేదు. అవి ఫౌజ్దారీ న్యాయస్థానములలో విచారణయందున్నది. ఈ సందర్భమున ఆ సంగతుల ప్రచురించుట భద్రకరముగా భావింపబడలేదు.         - చిక్కేపల్లి రామచంద్రరావు.
   మ.రా.రా. ఆంధ్రమహాసభాధ్యక్షులవారి సన్నిధికి
   గద్వాల సంస్థానమువారు విరాళమనుపేర అక్రమమైన పన్ను వసూలు చేయుచున్నారనియు రైతులు ఇట్టి పన్ను నిచ్చుటకు నిరాకరించినందున వారిపైన ఫౌజ్దారి మొకద్దమాలు ఆరోపించి వివిధములగు ఒత్తిళ్లు వేసి దౌర్జన్యము చేయబడుచున్నదనియు ఆ సంస్థానమునకు చెందిన "అయిజా" గ్రామపు రైతులు తమ కష్టములను ఆంధ్ర మహాసభ స్థాయిసంఘ కార్యాలయమునకు తంతిమూలమున తెల్పుకొనియుండిరి. అందుపైన గద్వాల "అయిజా" గ్రామముల రైతుల ఇబ్బందుల నిజానిజములను విచారించుటకై తమరు 6 ఆర్ది బెహస్థు 1350 ఫసిలి తేదిన మమ్ముల నియోగించియుంటిరి; తమ యాజ్ఞానుసారము మేము 7 ఆర్ది బెహస్థు 1350 హైద్రాబాదునుండి గద్వాలకు చేరి 9 ఆర్ది బెహస్థు 1350 గద్వాల "అయిజా" గ్రామములందు విడిదిచేసి విచారణజర్పితిమి. మా విచారణయందు వెల్లడియైన విషయములు ఈ క్రింది వివరింపబడుచున్నవి.
   1. విరాళము
   గద్వాల సంస్థానము 120 గ్రామాదులు 97 శివారు పల్లెలు ఈ విధముగా మొత్తము 217 గ్రామాలపైన వ్యాపించియున్నది. సంస్థాన ప్రభ్విణి శ్రీ ఆది లక్ష్మమ్మగారు. ఈ సంస్థానమందు విరాళపుపన్నును ఖల్సా ఇలాఖాలో లేనట్టి మరికొన్ని పన్నులను అక్రమముగా వసూలు చేయబడుచున్నవి. విరాళపుపన్ను కార్తీక మాసమందలి పూజపేరును, మాఘమాసమందలి దానముల పేరను వ్యవసాయదారులవద్ద మాల్గుజారి పైకముపైనను ఆబ్కారిముస్తాజరుల వద్ద ఆబ్కారి మహసూలు పైనను రూ.1 కి 0-1-3 లెక్క చొప్పున వసూలు చేయబడుచున్నది. ఈ విరాళము మొట్టమొదట రు.1 కి రు. 0-0-6 చొప్పున మరికొంతకాలమునకు రు.0-0-9 తదుపరి రు. 0-1-0 ప్రస్తుతము రు.0-1-3 వరకు క్రమముగా పెంచి వసూలు చేయబడుచున్నది.
   2. ఏనుగు చొప్ప
   ఈ పన్ను ఏనుగుచొప్ప అను పేర బిలువబడుటకు కారణమిట్లు చెప్పుదురు. పూర్వము సంస్థానాధిపతివద్ద ఏనుగులుంటువుండెవట. ఆ కాలమున వాటి మేతపేర అన్ని గ్రామములందు వ్యవసాయదారుల వద్ద చొప్ప వసూలు చేయుట మొదలయ్యెను. తర్వాత ఏనుగులు లేకుండా పోయినను చొప్ప మాత్రము వసూలు చేయబడుచున్నది. అదిసంస్థానాధిపతి యెడ్ల, ఆవుల మేత కక్కర వచ్చుచున్నది. బందోబస్తు సురువయి అనంతరము కొన్ని గ్రామములందు ఇది ఆగిపోయినట్లు తెలిసినది. కాని ఇంకను పెక్కు గ్రామములందు వసూలు చేయబడుచున్నది.
   ఇట్టి అక్రమపు పన్నులు మిక్కిలి కఠినముగా వసూలు చేయబడుచున్నవి. ఈ అక్రమపు పన్నుల విషయమున బహుకాలము నుండి ప్రజలకు సంస్థానము మధ్య ఘర్షణ సాగుచున్నట్లు ఒకటిరెండుసార్లు ఇట్టి అక్రమపు పన్నును గురించి రైతులు సర్కారెఅలీ ప్రభుత్వమునకు మొరపెట్టుకొనుచుండిరి. ఇట్లు మొరపెట్టు కొనుటయందు ఎక్కువగా వారిపైన ఫౌజ్దారి వ్యాజ్యెములు వేసి వారికి బేడీలు పెట్టి వీధులవెంట తిప్పించబడెను. శిక్షలివ్వబడెను. ఇంకను ఇతర మార్గముల ఒత్తిడివేసి వారిని పరిపరివిధములగు కష్టముల పాలు చేయబడెను. ఇంతటితో పోలేదు. ఎవడైన సంస్థానపు వారి కోరికలను (సంస్థానపు భృత్యులకోరికలుగాని) పూర్తి చేయనియెడల వాడు ఆపదలకు గురియగుచున్నాడు. ఎట్లన గౌరవనీయులును ముఖ్యులునైన కొందరుజనులను తిట్లతో గౌరవించుటయే కాక దెబ్బలుకూడా కొట్టబడెను. ఇక సామాన్య ప్రజల విషయము చెప్పనేల.
   ఈ సంస్థానమందు సుమారు నూరుగురు వ్యక్తులతో కూడిన ఒక సైన్యముకూడా కలదు. వాస్తవములో వీరందరుసంస్థానపు సేవకుల (శావకపువాండ్లు) స్వేచ్చతో సంచరించు రైతులను గౌరవస్తులను అణచుటకొరకే ఈ సైన్యము యేర్పడియున్నది. ఎప్పుడైనను రైతులు అక్రమపుపన్నుల నిచ్చుటకు నిరాకరించిన యెడల సంస్థానపు అధికారులు ఈదండును పోలీసును వెంటబెట్టుకొని గ్రామములందు వివిధములగు దౌర్జన్యములు చేయుచు పన్నులు వసూలు చేసుకొందురు. శ్రీ సర్వారెడ్డిగారు ఈ సైన్యమునకు నాయకుడని పేరు గావించియున్నారు. ఈ మధ్యనే వీరికి మాల్‌ మదదుగారు అధికారము గూడా ఇవ్వబడినది. వీరు విరాళము మొదలగు అక్రమపుపన్నులను 28 సంవత్సరములనుండి వచ్చుచున్న సుమారు రూ. 20,00,000 బకాయయున్న మిక్కిలి కఠినముగను నిర్ధాక్షిణ్యముగను వసూలు చేయు సామర్ధ్యము కలిగియున్నారనియు అందువలన వారికి మాల్‌ అధికారములు ఇవ్వబడినవియు తలంపబడుచున్నది. అదిగాక వీరు సంస్థానపు రాణి గారికి మరది. వీరి నిరంకుశత్వమునకు మేరయేలేదు. వీరిదే ప్రభుత్వము వీరిపైన నెట్టి ప్రతిబంధకములేదు. సంస్థానాధిపతి చుట్టములనేకు లిచటగలరు. వారు రాజబాంధవులనబడుదురు. ప్రజలపైన వీరందరి, నిరంకుశత్వము నిరభ్యంతరముగా సాగుచుండును. ఇట్టి పరిస్థితులందు అంచగొండితనము మేర మీరిపోవుట ఆశ్చర్యముగాదు.
   ఈ సంస్థానమందు పోలీసు మోహతమీమగూడ గలడు. సంస్థానమునకు జిల్లా నిజామతువరకు ఆదాలతు అధికారములున్నవి. గద్వాలలో వొక మున్సిపు ఒక అదాలతుకు జిల్లా నాజిం ఉన్నారు. ఈ పదవులపైన సంస్థానము వారు తామే ఎవరినైన నియమించి హైకోర్టు అంగీకారము పొందుదురు. ఈ యేర్పాటు మొట్టమొదట ఒకటి రెండు సంవత్సరముల కొరకు చేయుదురు. అందువలన న్యాయాధికారములు స్వేచ్ఛగా పనిచేయుట కవకాశముండదు. సంస్థానము వారి అభిప్రాయానుసారము జరిగించనియెడల నిర్ణీతకాలము పూర్తి అయిన వెంటనే వారు తొలగింపబడి వారి స్థానమున కొత్తవారు నియమింపబడుదురు. ఇందువలన సంస్థానము వారి అభిప్రాయానుసారము పనిజర్పుటకు వారు నిర్భందితులు కావలసివచ్చుచున్నది. అట్టి రూపమునందే వారి ఉద్యోగకాలము పొడిగింపబడును.
   3. దవాఖానా
   రెండు వందల గ్రామాదులు గల గొప్ప సంస్థానములో ఒక ఔషధాలయము మాత్రమే గద్వాల కేంద్రమునందున్నది.
   ఈ ఔషధాలయమునందు సామాన్యమైన టించరు, తలనొప్పి, కడుపునొప్పి మందులు తప్ప ఇతరౌషధములు లేవియు యుండవని రైతుల యుపక్రాశము, సంస్థానగ్రామములందు బొగ్గరోగములు (ప్లేగు) విస్తారముగా వ్యాపించినప్పటికి యెవరో కొందరికి టీకాలు వేయుటతప్పఇంకే ఏర్పాట్లు గాని చికిత్సానుకూల్యములుగాని లభింపవు. కొన్ని గ్రామాలందు అట్టి టీకాల యేర్పాటుకూడా లేకుండెనని తెలిసినది. ఔషధములు సమకూర్పబడకుండుటయే దీనికి కారణము కావచ్చును. అట్టి స్థితియందు డాక్టరుమాత్రమేమి చేయును.
  4. రోడ్లు
   గద్వాల స్టేషన్‌నుండి గద్వాల గ్రామంనకు ఒక మైలు పొడవునను గ్రామంనుండి సంస్థానపు బంగ్లా (క్రిష్ణా నదీతీరము) వరకు మూడుమైళ్ళు పొడవును రోడ్డుగలదు. ఈ రెండు రోడ్లు తప్ప ఇంతపెద్ద విశాలమగు సంస్థానములో వేరే రోడ్డు ఏదియులేదు. గద్వాలనుండి రాయచూరువరకు పక్కానడకకు వేయుటకు సర్కారిఅలీ ప్రభుత్వము ఆలోచించుచున్నదనియు అందు సంస్థానపు ఇలాకాయెంత గలదో దాని ఖర్చును భరించుటకై సంస్థానము నడుగబడుచున్నదనియు సంస్థానము దానికిష్టపడలేదనియు తెల్సినది.
   5. టోల్‌ టెక్సు
   గద్వాలలో టోల్‌టెక్సుగూడా నున్నది. అది బండియొక్కంటికి 0-4-0 చొప్పున వసూలు చేయబడుచున్నది. దాని వలన వ్యవసాయదారులకు చాలా ఇబ్బందిగానున్నది. ఖాళీబండ్లపైన పన్ను తీసుకొనగూడనప్పటికి ఇచ్చట ఖాళీ బండికి, ఝట్కాకును నం. 1కి రు. 2-4-0 రెండెండ్లబండిపై సంవత్సరం 4-8-0 వసూలు చేయబడుచున్నది. టోల్‌గేట్‌దాటి తిర్గి లోపటికి వచ్చినను పన్ను చెల్లింపవలసివచ్చుచున్నది. అట్లే అమ్మకముకొరకు వచ్చు పశ్వులపైన శాల్తి 1కి రు.0-2-0 మేకలు గొర్లకు శాల్తీ 1కి రు.0-1-0 తీసుకొందురనియు తట్టతో కూరగాయలు అమ్ముకొనువారివద్దగూడా పన్ను తీసుకోబడుచున్నదనియు తెలిసినది. కేవలము టోలుగేటు హర్రాజు ఆదాయమే సం||కి సుమారు రూ.8,000 గలదు. అట్లయ్యును గ్రామ పరిశుభ్రత బొత్తిగా బాగులేదు. ఒక్క ముఖ్యమైన రోడ్డు తప్ప తక్కిన సందుగొందులలో వెల్తురుయేర్పాట్లు ఏమియులేవు.
   6. విద్య
   గద్వాలయందు ఒక హైస్కూలును మూడు గ్రామాదులు అనగా అయిజాగట్టు, రాజోలులో తహతాన్యా పాఠశాలలును ఈ ప్రకారము మొత్తము నాల్గు పాఠశాలలుగలవు. ఈ సంస్థానమునందు నాల్గు అయిదువేల జనసంఖ్యగల గ్రామములు పెక్కులున్నవి. కాని వాటికి పాఠశాలలు లేవు.
  7. కల్దారు శిక్కా
   ఈ సంస్థానమందలి కొన్ని గ్రామములందు మాల్గుజారి పైకము కల్దారు శిక్కాలో వసూలు చేయబడుచున్నది. పెచ్చు రేటునందుకూడా చాలా అక్రమము జరుగుచుండును. అందువలన రైతులకు నష్టము కల్గుచున్నది. ఈ సంస్థానమందు కొన్ని గ్రామములు సంస్థానాధిపతి చుట్టపక్కముల జాగీర్లు వాని యందుగూడా హాలీ సిక్కాకుమారుగా మాల్గుజారి పైకము క్రింద కల్దారు నాణెములు వసూలు చేయబడుచున్నవి. ఒక రూపాయి హాలీకిబదులు ఒక రూపాయి కల్దారు తీసుకొందురు. దీని ఫలితమేమనగా ఒక్క రూపాయికి మారుగా పన్ను గైకొనబడుచున్నది.
  8. నజరానా
   బందోబస్తులో రైతులపేర పట్టా అయిన భూములనుగూడా శేరి ఇనాం భూములుగా నిర్ణయించి య|| 1కి రు.4-0-0లు చొప్పున నజరానా వసూలు చేయబడుచున్నది.
   9. సంస్థానపు ఆదాయం
   మాల్గుజారిపైకము వలన లక్షల వేలును ఆబ్కారివలన సుమారు లక్షల వేయిలును మొత్త సుమారు లక్షల ఆదాయము కలదు. ఇతర విధముల సుమారు ఆదాయము కల్గుచుండవచ్చును. భృత్యులజీతములకొరకూ నెలకి రూ. చొప్పున సం||కి ఒక లక్ష వేలు ఖర్చు అగుచున్నవి. కాని ప్రజోపయోగకరమైన నిర్మాణకార్యములపై బొత్తిగా ఖర్చు అగుటలేదు. తక్కినపైకము ఏ ఏవిషయములందు ఖర్చు అగుచున్నదో తెల్యదు.
  10. ముగింపు    మేము తెలుసుకొనగలిగిన సంగతులను సంగ్రహముగా విన్నవించితిమి. ఈ రిపోర్టు వ్రాయుటయందు చాలా పని ఈయబడినది. మాకు తెలిసినవిషయములు కొన్ని ఇందు వదిలిపెట్టబడినవి. తీరికవెంట వేరు వేరు గ్రామములందు తిరిగి స్థితి విచారించిన యెడల బహుశా కొన్ని కొత్త విషయములుగ వెల్లడియైయుండును. ఈ సంస్థానపు రైతాంగము ఆపదలపాలై దుస్సహమును అనిర్వాచ్యమగు జీవితం గడుపుచున్నది. ఇచ్చటి రైతులు నిరాశాపూరితమగు మిక్కిలి కష్ట పరిస్థితులందున్నారు. ఈ ఉపధ్రస్థులకు తక్షణము సహాయము చేయవలసి యున్నదని విన్నవించుచు ఈ రిపోర్టును ముగించుచున్నాము.
                                      ఇట్లు
                                      - బద్దం యెల్లారెడ్డి
                                      - వట్టికోట ఆళ్వారుస్వామి.