ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
               అభ్యుదయ రచయితల సంఘ శాఖ స్థాపన

   ఆంధ్ర రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘ కార్యదర్శి శ్రీ చదలవాడ పిచ్చయ్యగారు సెప్టెంబరు తుది వారంలో హైద్రాబాదు నగరానికి వచ్చారు. గుంటూరు పట్టణ అభ్యుదయ రచయితల సంఘాధ్యక్షులు, ప్రస్తుత "మీజాన్‌" తెలుగు దిన పత్రికకు సంయుక్త సంపాదకులును అయినట్టి శ్రీ అడివి బాపిరాజు గారితోను, నిజాము రాష్ట్రాంధ్ర ఉద్యమ స్థాపకులే గాక తెలంగాణాంధ్రుల సాంఘీక, వైజ్ఞానిక, రాజకీయాభివృద్ధికి పునాదులు వేసిన ఆంధ్ర పితామహ శ్రీ మాడపాటి హనుమంతరావుగారితోను, వివిధ దృక్పథాలు గల యితర యువక-వృద్ధ-పూర్వరచయితలను, కవులను, పండితులను కలిసి సమాలోచనలు జరిపారు.
   20-9-44 నాడు హైద్రాబాదులో శ్రీ నండూరి కృష్ణమాచార్యులుగారి గృహమందు కొందరు రచయితలు సమావేశమై, ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘ శాఖాస్థాపనకై తాత్కాలిక కమిటీని ఎన్నుకొని సభ్యులను చేర్పించి, 6-10-44 నాడు హైదరాబాదు థియిసాఫికల్‌ సొసైటీ హాలులో శ్రీ అడివి బాపిరాజు గారి అధ్యక్షతను హైద్రాబాదు, సికింద్రాబాదు రచయితలు సమావేశమైరి. రచయితల పరస్పర పరిచయంతర్వాత శ్రీ పిచ్చయ్యగారు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు పాతిక సంవత్సరాలనుండి భాషావిషయంలో చేయబడుచున్న కృషిని విపులంగా వివరించారు. భారతీయుల్లో పాశ్చాత్య సంపర్కఫలితంగా యేర్పడిన భావపరివర్తనము మొదలగు విషయములను వివరించుతూ, ప్రజాసామాన్యం యొక్క సమస్యలను దృష్టియందుంచుకొని వచ్చిన సాహిత్యాన్ని సప్రమాణంగా చూపించారు.
   శ్రీ వీరేశలింగం పంతులుగారు తమ రచనల ద్వారా ఎదుర్కొనిన సమస్యలు చాలా అభ్యుదయకరమైనవని చెప్పారు. కీ|| శే|| గిడుగు వెంకటరామమూర్తి పంతులుగారి వాడుక భాషా ఉద్యమమునాడు పంతులుగారు ఎదుర్కొనవలసి వచ్చిన సమస్య విషయాలను పేర్కొంటూ, ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు వాడుక భాష విషయమై యెంత వ్యతిరేకత ప్రకటించినా, పంతులుగారి కృషి వల్ల, నవ్య సాహిత్య పరిషత్తువారి ఉద్యమము వలన నేడు మన సాహిత్యం పొందుతున్న లాభాలను శఠగోపాచార్యులు, శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు మొదలగువారు సంఘసభ్యులుగా చేరుటయు, వీరేశలింగవర్ధంతి, లక్ష్మణరాయవర్ధంతుల ద్వారా ప్రజలకు అందచేయబడిన సందేశము వల్ల ప్రజలలో గలిగిన చేతన్యమును వివరించారు. ఇకముందు గురజాడ అప్పారావు, కాశీనాధుని నాగేశ్యరరావు, దామెర్ల రామారావు, గిడుగు రామమూర్తిపంతులు గార్ల వర్థంతులు జరుపనున్నామనియు, త్వరలో గుంటూరులో శ్రీ చిలకమూర్తి లక్ష్మీనరసింహం గారికి సన్మానము జరుపబోవుచున్నామనియు తెలియజేశారు.
   నిజాము రాష్ట్రంలోని సాహిత్యసేవను గురించి ముచ్చటించుచు "సుజాత" "నీలగిరి" పత్రికలను, గ్రంథాలయోధ్యమ చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ ఆంధ్రులు బ్రిటిష్‌ దేశ ఆంధ్రులతో యేవిషయంలోనూ వెనుకబడలేదని ఒప్పుకొనక తప్పదన్నారు. నేడు జరుగుతున్న సాహిత్యకృషిని పేర్కొని ప్రశసించారు.
   తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఖండవల్లి లక్ష్మీరంజనంగారు అభ్యుదయ రచయితల సంఘం యొక్క ఆశయాలను బలపరుస్తూ మాట్లాడారు.
   టాగూర్‌ ఇక్బాల్‌ రచనలు ప్రజాసమస్యలకెంత సమీపముగా ఉన్నవో వివరించారు. రచన అనే కళ ద్వారా ప్రజాసేవ చేయడంవల్ల త్వరితంగా, ఫలితం పొందగలుగుతామని చారిత్రకానుభవాలు వివరించారు.
  "నీ ఎండుగుండెల్లో
   నీ మండుటెడదలో
   స్వాతంత్య్రసమరాగ్ని
   ప్రజ్వలించిందంటే
   తొలగదా దాస్యమ్మ
   కలగదా స్వేచ్ఛ
   అన్న తుమ్మల వెంకటరామయ్యగారి గీతాన్ని వినిపించారు. ఈ విధంగా సాహిత్యం అనుక్షణం అభివృద్ధి చెందుతూ ప్రజాప్రభోధానికి వినియోగపడుతుందన్నారు.
   పిమ్మట అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘస్థాపనను గురించి చెప్పి, నేటివరకు ఆ సంఘం చేసిన పనిని క్లుప్తంగా తెలిపారు.
   సమావేశానికి అధ్యక్షులైన, శ్రీ అడివి బాపిరాజుగారు తమ తుదిమాటలలో సాహిత్య మంటే చాలా విశాలమైన కళయని, అట్టి కళకు సంకుచిత దృక్పథం ఉండటానికి వీలు లేదనీ మన, సాహిత్యకళను యితరులలో చొప్పింపజేస్త ఇతరుల సాహిత్యమందలి ప్రాశస్తాన్ని గ్రహించాలన్నారు. రచనలు సాగించాలంటే అందుకుకొన్ని హంగులుకావాలని బాధపడనవసరం లేదన్నారు. నేడు సోనియేట్‌ సాహిత్యపరులు, చిత్రకారులు భయంకరయుద్ధ ప్రదేశాలనుంచే సాహిత్యాన్ని, చిత్రాలను సృష్టిస్తున్నారనీ అదే మనకుగూడా మార్గదర్శకమని చెప్పారు. రచయిత తన పరిసరాలను పరిస్థితులను అర్థం చేసుకుంటే సులభంగా వ్రాయగలడనీ, అంతేగాక సమాజానికి సారథి కాగలడని తెలిపారు. ఆ విధంగా సంచరించటం రచయితల ధర్మము, వ్రతము అయి ఉండాలని నొక్కి చెప్పారు. పిమ్మట ఈ దిగువ కార్యనిర్వాహకవర్గాన్ని ఎన్నుకున్నారు.
   అధ్యక్షులు: శ్రీ అడివి బాపిరాజుగారు
   ఉపాధ్యక్షలు: శ్రీ బిదురు వెంకటశేషయ్యగారు, కార్యదర్శులు: శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి, శ్రీ వెల్దుర్తి మాణిక్యరావుగార్లు.
   సభ్యులు: శ్రీ పి.వి సుబ్బారాయుడు, శ్రీ నండూరి కృష్ణమాచార్యులు, శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి, శ్రీ రుద్రవరం వెంకటరాజయ్య శ్రీ జమ్మలమడక పూర్ణ చంద్రరావు, శ్రీ భాస్కరభట్ల కృష్ణారావు, శ్రీ మవ్వూరి లక్ష్మణ, శ్రీ కే.ఎస్‌. భూషణరావు, శ్రీ మానేపల్లి తాతాచార్యగారలు.
   శ్రీ ఆళ్వారుస్వామిగారి కృతజ్ఞతా వచనాలతో సమావేశం ముగిసింది.