ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

              ఏడూడి
                  - బిరుదురాజు రామరాజు


నీవు కనుమరుగై పోయి
నిండుకొన్నదొక ఏడు
నీవు కీర్తి శేషుడవై
బావురుమన్నదొక ఏడు
   ఒంటి స్తంభం విరిగిందనీ
   ఇంటి మొగురం కూలిందనీ
   కంటికి మంటికి ఏకధారగా - నీ
   ఇంటిది వలపోస్తున్నా
సగం వ్రాసి నీవు విడిచిన
సాంఘీక నవల తెలంగాణది
సగానికి విరిగిన శాసనం వలె
సాహిత్య చరిత్రకొక తీరని లోటు
   భార్యా పుత్రుల కన్నా - నీ
   ప్రాణం కన్నా మానం కన్నా
   గ్రంథాలయం ముఖ్యమని
   కడుగొప్పగా చెప్పేవాడివే
కొత్త కొత్త పుస్తకాలు
కొత్తకొత్త పత్రికలు
కొట్టుల్లో చూస్తుంటే
కొనవేం మరి ఒక్కటేనా
   సభలు సమావేశాలు
   వర్ధంతులు జయంతులు - నీ
   అంటుబాసిన ఈ జంటనగరాల్లో
   ఎన్నెన్నో జరిగినవి కానీ
పచ్చని బంగారు విగ్రహం
పక్కనొక తోలుసంచీ
కళకళలాడే ఆ ముఖం
కనిపించలేదెంత వెతికిన
నీ పేరును శాశ్వతంగా
నిలపాలనీ తలచాలనీ
నిక్కిచెప్పిన మేమంతా
నీరుగారి పోయినాము
   జ్ఞాపకం వచ్చినపుడల్లా
   కలుక్కుమంటుంది మనసు
   మరపు అనే మిత్రుడొకడు
   మరీ సన్నిహితుడవుతున్నాడు

దేశోద్ధారక గ్రంథమాల
దేశోద్ధారక గ్రంథాలయము
యశోదమ్మతో పాటు
అనాథలైన ఏడూడిది

ఎప్పటి వలెనే వచ్చి పోయింది
ఎగ్జిబిషన్‌ కూడా ఈ ఏడు
అక్కడే నీకూ నాకూ ఆఖరి చూపు నిరుడు
ఒక్కడనవుతానని పోలేదు నేనీఏడు

(24-02-1962) - గోలకొండ పత్రికలో ప్రచురణ)
ఆళ్వారుస్వామికి బిరుదురాజు రామరాజు నివాళి (సంవత్సరీకం రోజున)