ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                                 ఆళ్వార్‌ స్వామి "ప్రజల మనిషి"
                                                                     దాశరథి రంగాచార్య

                                                                    వట్టికోట ఆళ్వార్‌ స్వామి
                                                        జననం : నల్లగొండ జిల్లా మాధవరం , 1915
                                                      మరణం: మారేడుపల్లి సికింద్రాబాదు 5-2-1961
                                              తల్లిదండ్రులు: రామచంద్రాచార్యులు, సింహాద్రమ్మ (కీర్తిశేషులు)
                                                       భార్య: శ్రీమతి యశోదమ్మ, కుమారుడు: శ్రీనివాస్‌

   ఆళ్వార్‌ స్వామి స్వయంకృషితో రాణించిన రత్నరాజం. ఆళ్వార్‌ స్వామి అతి పేద వైష్ణవ కుటుంబరలో జన్మించారు. వారిది కుగ్రామం. నిజాం పరిపాలనలోని ఆనాటి గ్రామాల్లో విద్యకు అవకాశాలు బహుతక్కువగా పైగా వైష్ణవ కుటుంబాల చాదస్తం ఆధునిక విద్యవైపు సాగనివ్వదు. అలాంటి పరిస్థితులల్లో వారి బాల్యం గడచింది. "ప్రజల మనిషి"లోని కంఠీరవం బాల్యం ఆళ్వార్‌ స్వామి బాల్యంలా కనిపిస్తుంది. తండ్రి బాల్యంలో గతించారు. తల్లి నిస్సహాయ. పేద వైష్ణవ విధవ.

   అలాంటి పరిసరాలలో పెరిగిన ఆళ్వార్‌ స్వామి మనసుమనిషిగా, సంస్కర్తగా, రాజకీయ నాయకునిగా, మనీషిగా, అన్నింటిని మించి రచయితగా అందునా సామాజిక నవలాకారునిగా సిద్ధంకావటానికి వారి స్వయం కృషి తప్ప అన్యంకాదు. ఇది గొప్ప విషయం.

   ఆళ్వార్‌ స్వామి విజయవాడలో హోటల్‌ సర్వర్‌గా పనిచేశారు. హోటల్‌ సర్వర్‌గానే ఉండి మంచి నవలలు రాసిన మరొక మహా నవలాకారుడు శారద.

   ఆళ్వార్‌ స్వామి వంటమనిషిగా, గోలకొండ పత్రికలో ఫ్రూప్‌ రీడర్‌గా పనిచేశారు. వారు ఏపని చేసినా వారిలో ఉండిన విజ్ఞాన తృష్ణ వారిని వదలలేదు.

   "ఆళ్వార్‌ స్వామిలో ప్రజా సేవాభిలాష పెల్లుబికింది. సికింద్రాబాదులో అనేకమంది యువకులను ఆకర్షించి, ప్రజాసేవారంగంలో వారిని దింపసాగారు. ఈ కాలంలోనే గ్రంధాలయ ఉద్యమంతోను, ఆంధ్రోద్యమంతోనూ, సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆంధ్ర దేశ గ్రంధాలయ సంఘంలో కొంతకాలం కార్యవర్గ సభ్యుడుగా ఉన్నట్లు జ్ఞాపకం. "తెలుగుతల్లి" అనే ఒక మాసపత్రిక నిర్వహణలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. "దేశోద్ధారక గ్రంధమాలను" నెలకొల్పారు. ఆంధ్ర మహాసభలో సికింద్రాబాదుకు ఏకైక ప్రతినిధి అయినాడు. 1942లో కాంగ్రేస్‌ వాదిగా సత్యాగ్రహం చేసి ఒక సంవత్సరం కారాగార శిక్ష అనుభవించారు. 1946లో కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ అరెస్టు అయి మూడు సంవత్సరాలు కారాగారం అనుభవించాడు. విడుదల అయి వచ్చిన తరువాత దేశోద్ధారక గ్రంధమాల ద్వారా అనేక మంచి పుస్తకాలు ప్రచురించారు. "దేశోద్ధారక సూచీ గ్రంధాలయం", అనే ఒక రెఫరెన్సు గ్రంధాలయం నెలకొల్పారు. అది చాలామందికి పరిశోధనలకు ఉపకరించింది. ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతులు డా|| కేతవరపు రామకోటి శాస్త్రిగారు ఆ గ్రంధాలయంలోనే తమ పరిశోధన సాగించారు. ఈ వ్యాస రచయిత ఆ గ్రంధాలయ కార్యవర్గ సభ్యుడిగా ఉండే వాడని చెప్పుకోవడానికి గర్విస్తున్నాడు.

   ఆళ్వార్‌ స్వామి స్ఫురద్రూపి. అతని వలె నిర్మలంగా నవ్వగలవారు అరుదు. మిత్రులతో పాలలో పంచదారవలె కరిగిపోవడం వారి ప్రత్యేకత. అతనిది సుతిమెత్తని మనస్సు. పరుల బాధలు చూచి కన్నీరురాల్చుట వారి విశిష్టత.

   దాశరధి తన "అగ్నిధార"ను ఆళ్వార్‌ స్వామికి అంకితం ఇస్తూ రాసిన "పదమూడో ఆళ్వార్‌" ఉత్తమ కవిత. "అబద్దాసురుని పాలిటి తళ్వార్‌ ఆళ్వార్‌" అన్నారు. కాళోజీ నారాయణరావు "ఆళ్వార్‌" అని గేయం రాశారు. "వాడజాత శత్రువు" అన్నారు. కేతవరపు రామకోటి శాస్త్రిగారు వారి పరిశోధనా వ్యాసాన్ని ఆళ్వార్‌ స్వామికి అంకితం ఇచ్చారు. ఈ వ్యాసరచయిత తన "జనపదం" నవలను ఆళ్వార్‌ స్వామికి అంకితం సమర్పించుకున్నాడు.

   "ఆళ్వార్‌ స్వామి వంటి రచయితలు అరుదు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి తన అనుభవాలను, ప్రజా జీవితాన్ని నవలలుగా రచించి తెలంగాణ ప్రజాజీవితానికి వాడిని సమకూర్చిన చతుర్ముఖుడు ఆళ్వార్‌ స్వామి.

   ఆళ్వార్‌ స్వామి తన నలభై ఆరేళ్ల జీవితంలో తన కొరకు ఏమి సంపాదించుకోలేదు. ఒక్క ఇల్లు సైతం కట్టుకోలేదు. వారు పరమ పదించింది అద్దె ఇంట్లో.

   రచనలు: ప్రజలమనిషి - గంగు (నవలలు) జైలు లోపల (కథలు), రామప్ప రభస (వ్యాసాలు)

   సామాజిక స్వరూప చిత్రణ కోసమే సాహిత్యంలో నవలా ప్రక్రియ ఆవిర్భవించింది. అయితే ఆ లక్ష్యాన్ని నవల కొంత కాలం మాత్రమే సాధించిగలిగింది. అటు తరువాత నవల సమాజాన్ని వదిలి, వ్యక్తిని, ఆ తరువాత కాల్పనికతకు దిగజారింది.

   సామాజిక నవలను రచించడం ఎంత కష్టమో అధ్యయనం చేయడమూ అంత కష్టమే. ఎంచేతంటే ఆ నవల ఉబుసుపోకకు చదువుతే సరిపోదు. అందులో సమాజాన్ని గురించిన అనేక విషయాలుంటాయి. చారిత్రక సత్యాలు ఉంటాయి. కాబట్టి వాటిని అధ్యయనం చేయాలి.

   ఆళ్వార్‌ స్వామిగారి నవలలు సమాజ స్వరూప, స్వభావాలను అతి నైపుణ్యంతో చిత్రించిన నవలలు. అయితే సమాజం స్తబ్ధం కాదు. అది ఎప్పుడూ ఒక తీరుగా ఉండదు. మారడం దాని స్వభావం. ఈ మార్పుకు అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానం అయింది రాజకీయం.

   రాజకీయానికి-సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. సమాజ స్వరూప, స్వభావాల మార్పు ప్రధానంగా రాజకీయ పరిస్థితి పరిణామం వచ్చింది. వేయి సంవత్సరాలకు పైగా పరిపాలనలో మగ్గిన భారతజాతి పరిపాలన నుండి విముక్తం అయి స్వతంత్రం పొందింది. ఆ తరువాత జరిగిన అనేక సత్పరిణామాలతో భారతదేశ స్వరూపంలోనూ, అనేక మహత్తర పరిణామాలు వచ్చాయి. జాగృత భారతం ప్రపంచంలో ప్రముఖ దేశాల్లో ఒకటి అయింది.

   ఆళ్వార్‌ స్వామి నవలలు 1947కు పూర్వపు తెలంగాణ ప్రజా జీవితాన్ని చిత్రిస్తాయి. కాబట్టి ఆ నవలలను చదవడానికి ఆనాటి చారిత్రక అంశాలు రేఖామాత్రంగా తెలుసుకోవడం అవసరం.

   1947కు పూర్వం భారతదేశాన్ని ఆంగ్లేయులు మొత్తం దేశాన్ని పాలించలేదు. ఈ దేశంలో 500కు పైగా విదేశీ సంస్థానాలు ఉండినవి. వీటిని వంశక్రమానుగతంగా వచ్చిన ప్రభువులు ఉండినారు. ఆంగ్లేయులు తమ పరిపాలనను పదిలపరచుకోవడం వరకే ఈ సంస్థానాల మీద అదుపు ఉంచాయి. సంస్థానాలు పరిపాలన విషయంలో అంతగా జోక్యం కలిగించుకోలేదు. అందువల్ల ఈ సంస్థానాధీశులు నిరంకుశలయి మధ్యయుగాలనాటి ప్రభుత్వాలను దమననీతిని కొనసాగించారు. సంస్థానాల ప్రజలకు హక్కులు లేవు. బాధ్యతలు మాత్రం బోలెడు. అయితే, ఆళ్వార్‌, తిరువాన్కూరు, మైసూరు వంటి బహుకొద్ది సంస్థానాధీశులు ప్రజల క్షేమం కొరకు పాటుబడిన మాట వాస్తవమే.

   హైద్రాబాదు సంస్థానం భారతదేశంలోని అన్ని సంస్థానాల కన్న పెద్దది. ప్రముఖం అయింది. ఇందులో తెలుగు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు ఉండేవి. మొత్తం పదహారు జిల్లాల్లో తెలుగుమాట్లాడే జనం ఉన్న 8 జిల్లాలకు తెలంగాణం అని పేరు. హైద్రాబాదు సంస్థానాన్ని ఆసఫ్జాహి వంశీకులు ఏడుతరాల వాళ్ళు పాలించారు. చివరి వాడయిన మీర్‌ ఉస్మానలీఖాన్‌ నిరంకుశ ప్రభువు. అతడు ప్రపంచమందలి ధనవంతులలో ఒకడు. తనరాజ్యం దక్కించుకోవడానికి హైద్రాబాదును దక్షిణ పాకిస్తానుగా మార్చాలని పన్నాగాలు పన్ని విఫలుడయిన మతోన్మాది.

   నైజాం రాజ్యపు విస్తీర్ణం 8200 చదరపు మైళ్ళు. ఈ రాజ్యంలో ప్రభువు వారి స్వంత వ్యయానికి ఉండిన సర్పెఖాస్‌ వైశాల్యం 8,100 మైళ్ళు. నిజాం బంధువులకు చెందిన 1167 జాగీర్ల విస్తీర్ణం 11,000 చదరపు మైళ్ళు. ఈ విధంగా నైజాం ప్రభుత్వపు ఏలుబడి కింద ఉండిన ఖాల్సా ప్రాంతంలో ఉండిన నామమాత్రపు ప్రభుత్వం కూడా జాగీర్లలో ఉండేదికాదు. జాగీరు ప్రజలను మధ్యయుగపు బానిసలుగా పాలించాడు. నీరోలను మించిన జాగీర్దార్లు. జాగీరు ప్రజల పోరాటాన్ని చిత్రించిన ఏకైక నవల దాశరధి రంగాచార్య "మోదుగుపూలు".

   భారతజాతీయ కాంగ్రెస్‌ స్వాతంత్య్ర సమరం జరిపింది ముఖ్యంగా బ్రిటిషిండియాలోనే. కాంగ్రెస్‌ స్వదేశ సంస్థానాలను గురించి అంతగా పట్టించుకోలేదు. హైద్రాబాదు సంస్థానంలో జరిగిన హింసాకాండను, దౌర్జన్యకాండను దమననీతిని అంతగా పట్టించుకోలేదు. భారత దేశం స్వతంత్రం అవుతే దేశీయ సంస్థానాలను కూడా విముక్తం చేయవచ్చునని కాంగ్రెస్‌ భావించి ఉండవచ్చు.

   "కాంగ్రెస్‌ అనే పదాన్ని చూచి బెదిరిన నైజాం ప్రభుత్వం దాన్ని నిషేధించింది. కాని ప్రజాచైతన్యాన్ని అణచలేకపోయింది. అందువల్ల ఈ సంస్థానంలో ఆర్యసమాజం ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీలు ఆయా దశల్లో పోరాటాలు జరిపాయి. ప్రపంచ ప్రఖ్యాతం అయిన తెలంగాణా రైతాంగ పోరాటం ఈ గడ్డమీదనే జరిగింది.

   1947 లో భారతదేశం స్వతంత్రం అయింది. ఇంగ్లీషువారు భారతదేశం వదిలిపెట్టి పోతూ స్వదేశ సంస్థానాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి స్వతంత్ర భారతదేశానికి ప్రక్క బల్లేలుగా తయారుచేశారు. 1947లో బ్రిటిషు ఇండియా స్వతంత్రం అయింది. హైద్రాబాదు సంస్థాన ప్రజలు మరింత బానిసత్వంలో మగ్గారు. నైజాం నవాబు రజాకార్లను సృష్టించి మతోన్మాదపిశాచిని దేశంమీద విచ్చలవిడిగా వదిలి హైద్రాబాద్‌ సంస్థానాన్ని దక్షిణ పాకిస్తాన్‌గా తయారు చేయాలనుకున్నాడు.

   నైజాం మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రేస్‌, కమ్యూనిస్టుపార్టీ సాయుధ పోరాటం జరిపి నైజాం నవాబును ఉక్కిరిబిక్కిరి చేశాయి. భారతప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ ఆంతరంగిక వ్యవహారాలమంత్రి సర్దార్‌ వల్లభాయిపటేల్‌ సాహసచర్యతో 1948 సెప్టెంబర్‌లో హైద్రాబాద్‌ సంస్థానం మీద పోలీసు చర్య జరిపి ఆసఫ్జాహీ పరిపాలనను అంతం చేయడం జరిగింది.

   ఆళ్వార్‌ స్వామి నవలలు తెలంగాణాలో జరిగిన ప్రత్యేక పోరాటాన్ని చిత్రిస్తాయి.

ప్రజల మనిషి

   ఒక విచిత్రం అయిన విషయం ఏమంటే 1872వ సంవత్సరంలో తెలుగులో తొలినవల ప్రచురించబడగా తెలంగాణలో నవలా రచన 1955 వరకూ జరుగలేదు. ఇది తెలుగు సాహిత్య స్రవంతికి తెలంగాణా ఎంతదూరంలో ఉందో తెలుసుకోవడానికి నిదర్శనం మాత్రమే. అంతకుముందు తెలంగాణాలో కవిత్వం, వ్యాసం, కథలు వచ్చాయి. కాని నవల రాలేదు. నవలా రచనకు కొంత చైతన్యవంతం అయిన వాతావరణం అవసరం అని నా ఉద్దేశం. భూస్వామ్యపు కరకు పాలనలో నవలకు స్థానం ఉన్నట్లు కనిపించదు. నాకు తెలిసినంత వరకు ఆనాటి రాజభాష అయిన ఉర్దూలో కూడా నవల వచ్చినట్లు గుర్తులేదు.

   తెలంగాణా పోరాటాన్ని గురించి అంతకుముందు నవలలు వచ్చాయి. అవి తెలంగాణలో వారు రాసినవి కావు. బొల్లిముంత, "మృత్యుంజయులు", మహీధర, "ఓనమాలు", "మృత్యువునీడల్లో", లక్ష్మీకాంతమోహన్‌, "సింహగర్జనలు" తెలంగాణా పోరాటాన్ని చిత్రించే నవలలు. వాటిలో రచయితలకు పోరాటం మీద ఉన్న ఆరాటం, ఆసక్తి శ్రద్ధ కనిపిస్తాయి తప్ప తెలంగాణా వాతావరణం అక్కడి పరిస్థితులు అక్కడి పాత్రలు కనిపించవు. ఉర్దూలో కిషన్‌ చందర్‌ రాసిన "జబ్‌ఖేత్‌జాగే" అనే నవలలో తెలంగాణ ప్రజా పోరాటాన్ని చిత్రించడానికి ప్రయత్నించినా అందులో బొంబాయి శ్రామికవాతావరణం చోటుచేసుకుంది. కాశ్మీర్‌ గురించి కిషన్‌ చందర్‌ రాసిన "మేరే యాదోడేబీనార్‌", కాశ్మీర్‌ వాతావరణాన్ని బహుచక్కగా చిత్రించింది. ఇంతకూ చెప్పవచ్చిందేమంటే ఆ గడ్డ మీద పుట్టంది అక్కడి వాతావరణం చిత్రించడం అంత సులభం కాదు.

   ఆ విధంగా చూస్తే వట్టికోట ఆళ్వార్‌ స్వామి తెలంగాణకు తొలి నవలాకారుడు. ప్రజల మనిషి తొలినవల అవుతుంది. అంతకు ముందు కొన్ని నవలలు వచ్చి ఉండవచ్చు. కాని తెలంగాణపు ఆత్మను దర్శింపచేసిన తొలి నవల ప్రజలమనిషి అని నా నమ్మకం.

   ఆళ్వార్‌స్వామికి మాకు బంధుత్వం ఉంది. అంతేకాదు అతడు నాకు సాహిత్య బంధువు. వారితో నాకు సాన్నిహిత్యం ఉంది. వారి సాహిత్య కృషితో ప్రభావితుడునయి నేను తెలంగాణా ప్రజాజీవితాన్ని చిత్రించే "చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం" నవలలు రచించాను. వారు రచించిన "ప్రజలమనిషి" "గంగు" నాకు మార్గదర్శకములు అయినాయి.

   ఆళ్వార్‌ స్వామిగారు తెలంగాణా ప్రజాజీవితాన్ని చిత్రించే నవలలు వరుసగా రాయాలని సంకల్పించారు. వాటిలో తొలి నవల "ప్రజలమనిషి".

   ప్రజలమనిషి అని పేరు పెట్టడానికి ఆళ్వార్‌స్వామిగారు ఒక చిన్న ఉదంతం చెప్పారు. వారు "త్యాగరాజు" సినిమా చూచారట. త్యాగరాజు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతడు దేవుని మనిషి, దేవుని నమ్ముకున్నవాడు విజయం సాధించినప్పుడు ప్రజలను నమ్ముకున్నవాడు సాధించలేడా అనే అయిడియా వచ్చిందట. ఆ విధంగా ఈ నవలకు ప్రజలమనిషి అని పేరు పెట్టాడు.

   అసలు ఆళ్వార్‌ స్వామి ప్రజల మనిషి. అతడు ప్రజలనే నమ్ముకున్న నాస్తికుడు. వారి జీవితగాధయే "ప్రజల మనిషి"గా కనిపిస్తుంది.

   "చాలా భయంతో ఈ నవలకు బయటకి తెస్తున్నాను" అన్నారు. ఆళ్వార్‌ స్వామిగారు అంతకుముందు నవలలు రాయక పోవడం అందుకు కారణం కావచ్చునన్న వారు సాహితీపరులు కాకపోవడం మరొక కారణం కావచ్చును. అయితే ఇంగ్లీషులో తొలినవల రాసిన కెఫోకు సాహిత్యపరిజ్ఞానం లేదు. అతడు వర్తకుడు. తెలుగులో తొలినవల శ్రీ రంగరాజు చరిత్ర రచించిన గోపాల కృష్ణమ శెట్టిగారికి తెలుగుసాహిత్యంతో బొత్తిగా పరిచయం లేదు. నవలా రచనకు కావలసింది పాండిత్యం కాదు. జీవితానుభవం, లోకజ్ఞానం. ఆ రెండు ఆళ్వార్‌ స్వామికి అనంతంగా ఉన్నందున వారు రాసిన తొలినవల అయినా తెలుగు నవలా జగత్తులో ఆణిముత్యంగా నిలిచిపోయింది.

   "ప్రజలమనిషి" 1938లో హైద్రాబాదు స్టేట్‌ కాంగ్రెసు పుట్టుకకు పూర్వపు తెలంగాణ వాతావరణాన్ని వివరిస్తుంది. ఇక్కడ ఒక విషయం పేర్కొనాలి. స్టేటు కాంగ్రెస్‌ పుట్టంగానే దాన్ని నిషేధించాడు నైజాం నవాబు. అతనికి తెలుగు అంటే భయం. జనాన్ని అంధకారంలో ఉంచి పాలించాలని అతని ఆశయం.

   ఈ నవల మొదలయ్యేనాటికి హైద్రాబాదు సంస్థానంలో రాజకీయ పార్టీ అంటూ లేదు. ఉన్నవి ఆర్యసమాజం. ఆంధ్ర మహాసభ, గ్రంధాలయ ఉద్యమం మాత్రమే. ఇవి ఏవీ రాజకీయ సంస్థలు కావు. వాటి పరిధి బహుకొద్ది. వాటినీ పనిచేయనీయలేదు నైజాం నవాబు. ఇత్తేహాదుల్‌ ముసల్మీన్‌, అనే మత దురహంకార సంస్థను ప్రోత్సహించి హరిజనులను ముస్లిములుగా మార్చుటకు దీక్షబూని ప్రజాసంస్థల మీదికి ఉసికొల్పాడు. ఇది ఆనాటి పరిస్థితి. ఈ పరిస్థితులను ఆళ్వార్‌ స్వామిగారు నిష్ఫక్షపాతంగా "ప్రజలమనిషి"లో విశదీకరించారు.

   ఈ నవలలోని కథ జరిగిన ప్రాంతం కామారెడ్డి తాలూకాలోని దిమ్మగూడెం, సందర్భాన్ని బట్టి కథకు నిజామాబాదు హైద్రాబాదుతో కూడా సంబంధాలు ఏర్పడ్డాయి. సంక్షిప్తంగా ఈ నవలలోని కథ ఇలా ఉంటుంది.

   దిమ్మగూడేనికి మకుటంలేని మహారాజు రామభూపాలరావు. ఆ ఊరు సాంతం అతనికి ఊడిగం చేయడానికే ఉన్నట్లు భావిస్తాడు. ఆ ఊళ్లో ఉండిన రఘునాధాచార్యులకు ఉన్న భూమిని రామభూపాలరావు లాక్కున్నాడు. దాంతో ఆ వైష్ణవుడు నిరాశ్రయుడు అయినాడు. పరమపదించాడు. వారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు వెంకటాచార్యులు రామభూపాలరావుకు తొత్తు. చిన్నవాడు కంఠీరవాన్ని అన్న ఇంట్లోంచి వెళ్లగొడ్డాడు. కంఠీరవం ఊరువిడిచి నిజామాబాదు చేరుకుంటాడు. అక్కడ గ్రంధాలయోద్యమంతో సంబంధం ఏర్పడి చైతన్యవంతుడు అవుతాడు.

   దిమ్మగూడెంతో కొమరయ్య అనే రైతు ఊరు విడిచిపోయి ఒక బ్రాహ్మణుల పొలం కౌలుకు చేస్తున్నాడు. అక్కడ బావి తవ్వి తోటవేసి దాన్ని అభివృద్ధిపరిచారు. దానిమీద రామభూపాలరావు కన్నుపడింది. వెంకటాచార్యులను వెంకటేశ్వరరావుగా మార్పించి ఆ పొలం తన పేరున మార్పించుకొని కొమరయ్యకు ఆ పొలం నుంచి బేదఖల్‌ చేయించాడు.

   దిమ్మగూడేనికి ఇత్తెహాద్‌ వాళ్ళు వచ్చి హరిజనులను ముస్లిములుగా మార్చారు. ఆ సందర్భంగా కంఠీరవం నిజామాబాదు నుంచి వచ్చి వాస్తవాలు మాట్లాడినందుకు అతని మీద రాజద్రోహ నేరం మోపి జైలుకు పంపింది నైజాం ప్రభుత్వం.

   హరిజనులు ముస్లిములు కావడంతో రామభూపాలరావు మాట వినకుండా అయినారు. అందుకు విరుగుడుగా అతడు ఆర్యసమాజాన్ని ఆశ్రయించాడు. ఆర్యసమాజం కార్యకర్త. విజయదేవుడు దిమ్మగూడెం చేరుకుని హరిజనులను శుద్ధిచేసి హిందువులుగా మారుస్తాడు. విజయదేవుడు క్రమంగా రామభూపాలరావు నిజస్వరూపం తెలుసుకుంటాడు. కొమరయ్య భూమి విషయంలో రామ భూపాలరావుతో తగాదాకి ప్రజలపక్షం వహించి గ్రంధాలయం స్థాపిస్తాడు. గ్రామపు చెరువు విషయంలో ప్రజలను సమీకరించి రామభూపాల రెడ్డిని ఓడిస్తాడు.

   కంఠీరవం విడుదల అయింతరువాత హైద్రాబాదులో వెంకటేశ్వరరావుతో పరిచయం అవుతుంది. వారు దిమ్మగూడెం చేరుకుంటారు. కొమరయ్యనుంచి రామభూపాలరావు లాక్కున్న భూమి వాస్తవంగా వెంకటేశ్వరరావుదని తేలుతుంది. మోసం చేసి పొలం మార్పించుకున్నాడనే కేసులో రామభూపాలరావుకు వెంకటాచార్యులకు శిక్షపడుతుంది.

   స్టేటు కాంగ్రెస్‌ ప్రారంభించిన తొలి సత్యాగ్రహంలో "వెంకటేశ్వరరావు డిక్టేటరుగా, బషీర్‌, కంఠీరవం, పరంధామయ్య, విజయదేవు అనుచరులుగా ఒక దళం సత్యాగ్రహం చేసి నిర్భందించబడ్డారు.

   "ఇంతలో రామభూపాలరావు శిక్షముగిసి దిమ్మగూడెం చేరుకున్నాడు. వచ్చీరావడంతోనే అధికార వర్గానికి అండగా నిలిచి గ్రామ ప్రజలపై అధికారం చేయడం సాగించాడు. గ్రంధాలయం మూలపడ్డది. వెంకటేశ్వరరావు యింటిలో పోలీసు నాకా పెట్టించాడు.

   ఇవి నవలలోని చివరి రెండు పేరాలు.

   కథాకథనంలో కమామిషులు, మలుపులు, సస్పెన్సులు నాటకీయతలు లాంటివి ఏమీ కనిపించవు. తాను చూచిన ఒకానొక వ్యవస్థకు సాక్ష్యంగా ఆళ్వార్‌ స్వామి చెప్పిన కథ ఇది.

   "ప్రజల మనిషి కథా ప్రధానం అయిన నవల కాదు. ఇది ఒక నఱర్‌శీతీఱషaశ్రీ ణశీషబఎవఅ్‌. ఆనాటి పరిస్థితులు విచిత్ర వాతావరణం యావత్తు మనముందు ప్రత్యక్షం అవుతుంది. అసలు డాక్యుమెంటరీ లక్షణం నవలకు ప్రాణం లాంటిది. ప్రజలమనిషి ప్రాణం వున్న నవల.

   గ్రామవాతావరణం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దొర ఇంటికి అల్లుడు వస్తాడు. అతడు తన కూతురును పంపించాలి. వైష్ణవ కుటుంబానికి విస్తళ్ళు కుట్టే వెట్టి యుక్తంగా గ్రామం సాంతం వెట్టి చేస్తుంది. కోటయ్య ఆవునూ లేగదూడనూ అడిగాడు దొర. అది చండశాసనం. కోటయ్యకు తప్పదు. బిడ్డలా పెంచుకున్న ఆవును సాగనంపడానికి కొమరయ్య ఎంతో బాధపడ్తాడు. విలవిలలాడ్తాడు.

   "విస్తళ్ళు కుట్టడానికి మీ అమ్మను కూడ దొరబిడ్డ వెంట తోల్తరేమో! అంటాడు. పసిపిల్లవాడు కొమరయ్య కంఠీరవంతో.

   కంఠీరవం తల్లిని అడిగినప్పుడు ఆ ఊళ్లో ఇస్తళ్ళు కుట్టే వాళ్ళున్నారు. నేనేం పోను, అనే జవాబు చెప్పించి అన్ని ఊళ్ల పరిస్థితి ఇలాంటిదే అని సూచించాడు రచయిత.

   టిక్కెట్టు లేకుండా వచ్చినందుకు కామారెడ్డి స్టేషను మాస్టరు ఒక ప్రయాణీకుని వద్ద వెండి కడియం గుంజుకున్నాడు. కంఠీరవం ఇచ్చిన రూపాయ ఇచ్చి వెండి కడియం విడిపించుకోదలచుకున్నాడు. ప్రయాణీకుడు. రూపాయి కూడా గుంజుకున్నాడు స్టేషను మాస్టరు. అడిగేవాడు లేని కాలం అది. అధికారుల ఆటలే సాగిన కాలం అది.

   హరిజనులను ముస్లిములుగా మార్చడానికి అంజుమన్‌ వాళ్ళు దిమ్మగూడెం వచ్చారు. అక్కడ కూడిన జనంలో కొమరయ్య కూడా ఉన్నాడు దొరగుమాస్తా హైదరాలీని గురించి హైదరాలీసాబు న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అంటాడు. ఆ మాట అన్నందుకు కొమరయ్యను అరెస్టు చేసి హైద్రాబాదు రాజ్యపు ప్రధాని సర్‌ అక్బర్‌ హైదరాలీని నిందించాడని నేరంమోపారు.

   "మతం మార్చడానికి వచ్చిన వాళ్ల వెంట పోలీసులెందుకు" అని అడిగినందుకు కంఠీరవాన్ని అరెస్టు చేసి రాజద్రోహం నేరం మోపారు.

   కంఠీరవాన్ని కొమరయ్యను పోలీసులు తమ నిర్భందంలో ఎన్నో హింసలకు గురిచేశారు. వారం రోజులవరకు ప్రతిరాత్రి మధ్యజామూ వారిద్దరిని ఒక చీకటి గదిలో వేసి తీవ్రంగా కొట్టడం, రహస్య స్థలాల్లో కారంపెట్టడం, బోర్లపడుకోబెట్టి చేతులపై మంచం కోళ్లు మోపి మంచంపై అయిదారుగురు పోలీసులు గంతులు వేయడం, ఒకరి మూత్రం ఇంకొకరి నోట్లో పోయించడం తలకు తాడు చుట్టి గట్టిగా వడిపెట్టడం, చేతివేళ్ళమధ్య కట్టెలు ఇరికించి గట్టిగా వత్తడం, నడుముకుతాడు కట్టి ఈ గోడకు ఆ గోడకు కొట్టడం ఈ విధంగా తోచినట్టల్లా హింసించారు.

   ఇక న్యాయ విచారణ తంతు పరిశీలించండి.

   తమపై మోపిన నేరానికి ప్రభుత్వం నుంచి అనుమతి అవసరం అని న్యాయాధిపతి అందించిన పుస్తకం చూచి కంఠీరవం చెప్పాడు.

   "పోలీసు వకీలు పుస్తకం అందుకొని చదివాడు. "ప్రభూ! నేను ఇదివరకే మనవి చేసినటుల వీరిని నిర్బంధించినప్పుడు గ్రామవాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉండింది. ఆట్టి స్థితిలో నిర్భంధించకపోవడం ఎంత ప్రమాదమో మీరూ ఊహించవచ్చును. పుస్తకంలో ఈ విధంగా ఉండటం అచ్చు తప్పని భావిస్తున్నాను అన్నాడు.

   అచ్చుతప్పు ఆధారంగా కాకపోయినా కంఠీరవానికి రెండున్నర సంవత్సరాల కాలం శిక్ష విధించారు.

   జైలు జీవితాన్ని గురించి ఈ నవలలో వివరంగా చర్చించారు. జైలు జీవితాన్ని గురించే వారు రాసిన కథలు "జైలులోపల" అని ప్రచురితం అయింది. కాని ప్రస్తుతం లభించడం లేదు.

   నిజాం రాజ్యంలో సభలు జరుపుకునే స్వాతంత్య్రం లేదు. నిజామాబాదు గ్రంథాలయ సభలు జరుపుకోవడానికి 53వ గస్తీని అనుసరించి ప్రభుత్వానుమతి కోరడం జరిగింది. అందుకు జవాబుగా "మస్జిద్‌ పేష్‌ ఇమాం జనాబ్‌ ముర్తుజా ఖాను సాహెబుగారి యొక్కయు, ఇతర ముఖ్యుల యొక్కయు అంగీకారముపైనగాని ఆ విషయము పరిష్కరించలేదు". అని జవాబు వచ్చింది. ఆ తరువాత అనేక ఉత్తర ప్రత్యుత్తరముల తరువాత, "ఊరేగింపు జరుపకూడదు. నమాజు సమయము వించిపోకూడదు. సభాధ్యక్షులు తమ ఉపన్యాసములోని వాక్యాలు చాలా పరిమితిలో పెట్టి ఏ వర్గమునకు వ్యతిరేకముగా ఎట్టి భావ ప్రకటనమును చేయకుండునటుల జాగ్రత్త వహించవలెను" అని అనుమతి ఇచ్చారు.

   ప్రభుత్వం అవమానకరముగా అయిన షరతులు విధించినందుకు నిరసనగా అసమ్మతి తీర్మానం ఆమోదించి సభ ముగించారు నిర్వాహకులు.

   ఇది కల్పనాకథ కాదు. 1943లో ఆంధ్ర మహాసభసమావేశాలు జరుపుకోవడానికి మూడు సంవత్సరాలు ముప్పుతిప్పలు పెట్టి అనుమతించారు.

   ఈ విధంగా ఈ నవల సాంతం నాడు జరిగిన వాటి చారిత్రక ఆధారాలతో నిండి ఉంది.

   ఈ నవలలో ప్రధాన పాత్రలు రెండేరెండు. ఒకడు రామభూపాలరావు గ్రామప్రభువు. అన్యాయాలకు దోపీడిలకు, దురంతాలకు నిలయం. రెండవ పాత్ర కంఠీరవం అన్యాయాలను ఎదిరించిన ప్రజల మనిషి.

   గ్రామం సాంతం తన ఏలుబడిలో ఉందనుకునే వాడు దొర రామభూపాలరావు. మోహనాచార్యులకు సహపంక్తి భోజనం పెట్టినందుకు తన తండ్రి ఇచ్చిన భూమిని రఘునాధాచార్యుల నుంచి గుంజుకొని అతనిని మనోవేదనకు గురిచేసి ప్రాణం తీసిన ఘనుడు. రఘునాధాచార్యులు తనకు ఆచార్యుడనే గౌరవం కూడా లేకుండా తన అధికార దర్పానికి ఒక పండితుని ఆహుతి చేసిన "అధికార బధిరాంధకుడు".

   గొట్టం కొమరయ్య భూమి లాక్కోవడానికి అతడు పన్నిన పన్నాగం అతని తత్వానికి నిదర్శనం. రామభూపాలరావు పాత్ర ద్వారా దొరల వ్యవస్థకున్న మనస్తత్వాన్ని బట్టబయలు చేశారు ఆళ్వార్‌ స్వామి.

   గొట్టం కొమరయ్య తండ్రి ఆ ఊరిలో ఉండిన బ్రాహ్మణుల నుండి కొంత భూమి కౌలుకు తీసుకొని అభివృద్ధి చేసి, తోట, దొడ్డి ఏర్పరుచుకున్నాడు. బ్రాహ్మణులు ఆ ఊరు విడిచి వెళ్లిపోయారు. ఆ భూమి కాజేయాలని దొర పన్నాగం పన్నాడు. వెంకటాచార్యులను కచేరీకి తీసుకెళ్ళి తాను బ్రాహ్మణ వెంకటేశ్వర్లునని సాక్ష్యం చెప్పించి భూమిని తన పేర చేసుకున్నాడు. అరకలు కట్టి కోటయ్య పొలంలోకి హైదరాలీని ఇచ్చి పంపించాడు. కొమరయ్య తల్లి అన్నమ్మ శక్తి స్వరూపిణి అయి ఎదిరించింది. తల్లి ఎదురు తిరిగిన నేరానికి కొమరయ్యను గుంజకు కట్టించి చాలా బాధించాడు. మొత్తం మీద భూమి గుంజుకున్నాడు.

   అంజుమన్‌ వాళ్లు వచ్చి హరిజనులను తురకలుగా మారిస్తే దొరపెత్తనం సాగలేదు. మతం మార్చుకున్న హరిజనులకు వ్యతిరేకంగా గ్రామ ప్రజలను ఏకం చేసి వారిని బహిష్కరింప చేశాడు. హైద్రాబాదు నుంచి ఆర్యసమాజ కార్యకర్త జయదేవుడు తెచ్చి మళ్లీ వాళ్లను హిందువులను చేయించాడు. జయదేవుడు గ్రంధాలయం స్థాపిస్తే తనకు ఉపయోగవడుతుందని ఊరుకున్నాడు. జయదేవుడు కొమరయ్యకు జరిగిన అన్యాయాన్ని గురించి దొరతో ప్రస్తావిస్తే పట్నం నుంచి ఆర్యసమాజపు ప్రధానిని పిలిపించి "నిజంగా ఆ రాముడు భూమిని పాలిస్తున్నాడనిపిస్తున్నది" అని ప్రధానితో మెప్పుపొంది విజయదేవుకు బుద్ది చెప్పించాడు.

   ఆ విధంగా ఆంధ్రమహాసభను, ఆర్యసమాజాన్ని తన అధికారం కోసం వాడుకున్నాడు.

   అయితే హఠాత్తుగా వెంకటేశ్వరరావు స్థానే గొట్టం కొమరయ్య భూమికి వారసుడు అని తెలుస్తుంది. కోర్టులో దావా జరగ్గా రామభూపాలరావు చేసిన నేరం బయటపడుతుంది. దాంతో ప్రభుత్వం అతనికి శిక్ష విధిస్తుంది. అంతటితో రామభూపాలరావు కథ ముగియలేదు.

   "ఇంతలో రామభూపాలరావు శిక్షముగిసి దిమ్మగూడెం చేరుకున్నాడు. వచ్చీరావడంతోనే అధికార వర్గానికి అండగా నిలిచి గ్రామ ప్రజలపై అధికారం జేయడం సాగించాడు."

   ఈ వ్యవస్థ ఎల్లకాలాల్లోనూ ఉంటుందేమో! తరతమ భేదాలు అంతే.

   కంఠీరవం మానవతా మూర్తి. అతనికి కులమత భేదాలు లేవు. తరతమాలు లేవు. అతడు అన్యాయాన్ని సహించడు. అన్యాయాలను అక్రమాలను ఎదిరించడం అతని ప్రవృత్తి. ఎదిరించడంలో అడ్డువచ్చేవాటిని అవి ఎంత కష్టమైనవి అయినా లెక్కచేయడు. ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడతాడు. ఇలాంటి వారు భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు అనేకులు ఉండేవారు. స్వాతంత్య్ర సమర యజ్ఞానికి సమిధలయి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించాడు. నిరంకుశుడయిన నిజాం నవాబును గద్దె దించాడు.

   కంఠీరవం బాల్యంలోనే తండ్రి గతించాడు. తల్లికి దిక్కులేదు. అన్న వెంకటాచార్యులు దుర్మార్గుడయి కంఠీరవాన్ని ఇంట్లోంచి వెళ్ల గొట్టాడు. ఆకలితో అలమటించి, మనసు దహించుకు పోతున్నా కంఠీరవం చేలకు కాపున్న రైతుల పిల్లలతో ఆడుకున్నాడు. వారి స్నేహభావానికి చలించాడు. "మంచి నేర్చుకోనవసరం లేదేమో! నేర్చుకోవలదసినవి చెడ్డ విషయాలేకాబోలు. కంఠీరవం విషయంలో తుఫాను రేగింది. తల్లిని విడిచి వెళ్లుతున్న కంఠీరవం కళ్ళనిండా నీళ్లు తిరిగాయి. పరిసరాలు అస్పష్టంగా, అనేక రూపాలతో తాండవం చేశాయి". ఆత్మీయత వెల్లివిరిసిన మనసు కంఠీరవానిది.

   టిక్కెట్టు లేకుండా వచ్చిన ప్రయాణీకుని చూచి పోలీసు, స్టేషను మాస్టరు కలిసి దండ కడియం గుంజుకుంటే తన దగ్గర ఉన్న ఒకే ఒక రూపాయతో అతనికి సాయంచేయడానికి ప్రయత్నించిన ఉదారుడు కంఠీరవం.

   నిజామాబాద్‌లో వేదాంతాచార్యుల ఇంటికి చేరిన కంఠీరవం పాలలో పంచదారలా కలిసి పోయాడు. "కంఠీరవం చాలా ఉత్తముడు. కష్టించే స్వభావము కలవాడు" అంటాడు వేదాంతాచార్యులు.

   కంఠీరవాన్ని అక్కడి గ్రంధాలయం ఎంతో ఆకర్షించింది. అతణ్ణి ఉత్తేజితుణ్ణి చేసింది. కంఠీరవానికి గాంధీ ఆత్మకథ, ముఖ్యంగా పారాయణ గ్రంధంగా పరిణమించింది. ఆంగ్లేయులు అహంకారము, కుటిలనీతి, ద్వంద్వ పరిపాలన, బహుముఖ చతురత, మహాత్ముని గొప్ప తనము, భారతదేశ యదార్థస్థితి కంఠీరవానికి మచ్చుగా అర్ధమైనవి.

   కొద్దికాలంలోనే కంఠీరవం గ్రంధాలయ ప్రధాన కార్యదర్శి అయినాడు. గ్రంధాలయ మహాసభలు వైభవంగాను ఉత్తేజకరం గానూ నిర్వహించడానికి సకల ప్రయత్నాలు చేసి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తీర్మానం మాత్రం చేసి ఊరుకున్నాడు.

   దిమ్మగూడెంటో హరిజనులను ముస్లిములుగా మార్చడానికి వచ్చిన అంజుమన్‌నాయకులను నిర్భయంగా ఎదిరించి వారి బండారం బయట పెట్టడమేకాకుండా న్యాయస్థానాల పేర జరుగుతున్న నాటకాలను బహిర్గతం చేసిన ధైర్యశాలి.

   "మంచి ప్రభుత్వం వచ్చేదాకా కష్టాలు తప్పవు" కంఠీరవం విపులీకరించాడు.

   "మంచి ప్రభుత్వం అంటే?" బషీరు ఆదుర్దాగా అడిగాడు.

   "మంచి ప్రభుత్వంలో నీ తల్లి దండ్రులవలె పొట్టకెళ్లక కన్న బిడ్డలను అమ్ముకోరు. వదులుకోరు. అన్యాయంగా ఇతరుల ఆస్తులు ఆక్రమించరు. చదువురాని వారు ఉండరు. అందరూ నీతితో ఉంటారు. కట్టుగా ఉంటారు. దయతో మెలుగుతారు. ముఖ్యంగా అంతా ఆప్తులుగా బతుకుతారు."

   ఇలాంటి ఆదర్శ సమాజం కోసం అంకితం అయినాడు కంఠీరవం. అతని పాత్రద్వారా వట్టికోట ఆళ్వార్‌ స్వామి వారి ఆదర్శం, ఆదర్శంగానే ఉండిపోయింది.