ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                                 గ్రంథమాల గురించి
                                                                                       - నీలా జంగయ్య

   క్రీ.శ. 1938 అనగా బహుధాన్య సంవత్సరంలో శ్రీ వట్టికోట ఆళ్వార్‌ స్వామి కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి స్మారక చిహ్నంగా దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు.

   స్వామిగారిని నేనెంత బాగా ఎరుగుదునో వారు కూడా నన్నంతగానే ఎరిగినవారు. వారి ఇల్లు సికింద్రాబాదు కింగ్స్వేకు దగ్గరలో ఉండేది. అది ఇల్లుకాదు భక్తులకు దేవాలయం, జ్ఞానార్జనులకు గ్రంథాలయం, సంఘసేవానురక్తులకు ఆదర్శ నిలయంలా ఉండి ఎందరి సదాశయాలకో పుట్టినిల్లుగా ఉండేది. 1955-56లో ఆయన దగ్గరకు ఎన్నోసార్లు వెళ్లినాను. ఆయన రూపం సర్వజనాకర్షకమయింది. వాక్కు మల్లెల ఘుమాయింపును వెదజల్లేది. అఖండమైన ధైర్యం ఆయన డెందంలో గూడు కట్టింది. కేతవరపు రామకోటి శాస్త్రిగారు, మహబూబ్‌గారు ఆయన సేకరించిన గ్రంథాలయ మధువును జీర్ణించుకొని త్రేన్చినారు. కాళోజీ, వానమామలై వరదాచార్యుల వంటి మహాకవులెందరో వారింటిని పావనం చేయడం చూసినాను. ఆయన ఎక్కడకు వెళ్ళినా, ఏ మీటింగులో ప్రవేశించినా, నోటుబుక్కు, పెన్ను హేండ్‌ బ్యాగు నుంచి తీసి అక్కడి విశేషాలను అక్షరాత్మకం చేసుకొనేవారు. ఆ సంచీలో ముద్రిత గ్రంథాలు, బిల్లు పుస్తకం, కరపత్రాలుండేవి. ఆయన వంటరిగా ఉండలేడు. తన చుట్టూ పదిమంది. పది మందిలో తాను ఉన్నాడు. ఆయన ఎన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు.

   ఈ గ్రంథమాల ద్వారా ప్రసిద్థ రచయితల గ్రంధాల నెన్నో ముద్రించినారు. పది రూపాయలు గ్రంథమాలకు చందా పుచ్చుకొని పదకొండు రూపాయల నాలుగు అణాల విలువగల గ్రంథాలు క్రమంగా అందించేవారు.

   కథలు, నాటికలు, కావ్యాలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు వంటివెన్నో గ్రంథాలు ముద్రించినారు ప్రతి ప్రచురణ పాఠకుల మన్ననలను పొందింది. పాఠకుల ఆసక్తిని ఇనుమడింపజేసింది. 1938 నుంచి 1941 వరకు 12 గ్రంథాలు వెలువరించినారు. ఈ కాలంలోనే అణా గ్రంథమాల అవతరించింది. అణా గ్రంథమాల స్థాపకులైన శ్రీ కె.సి.గుప్తగారు ఆళ్వారుస్వామిగారు ఒకే లక్ష్యంతో కమ్యూనిస్టు భావాలతో స్నేహం పెంచుకొన్నారు. గ్రంథ ప్రచురణ, ప్రచారాలు వీరికి కొట్టిన పిండి.....

   .....అప్పటికే ఈ (గ్రంథమాల) గ్రంథాలను గూర్చి ఎన్నో పత్రికలు, సాహితీ మూర్తులు, రాజకీయ సాంఘీక నాయకులు చక్కని అభిప్రాయాలను అందించినారు. అందులో మాడపాటి హనుమంతరావుగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు, కొండా వెంకటరంగారెడ్డిగారు, మందుముల రామచంద్రరావుగారు, అయ్యదేవర కాళేశ్వరరావులున్నారు. 1940లో కాగడా, 56లో ఆంధ్రపత్రిక, విశాలాంధ్ర దినపత్రికలు, భారతి మాస పత్రిక, 1957లో గోలకొండ దినపత్రిక, స్రవంతి మాసపత్రిక ఈ గ్రంథమాల ప్రచురణలను మెచ్చుకున్నాయి.

   తెలంగాణం పేరుతో ఆదిరాజు వీరభద్రరావుగారు రచించిన గ్రంథాన్ని మూడవ భాగంగా వెలువరించినారు. దీనిలో ప్రాచీనాంధ్ర నగరాల సంగతి తేజస్వంతంగా చెప్పడం ఉన్నది. ఆదిరాజు వీరభద్రరావుగారిని ఎరుగని చారిత్రకుడు, సాహితీమూర్తి లేడనే చెప్పవచ్చును. సాహిత్య-చరిత్ర పరిశోధనలో తలమున్కలై కావించిన కృషి నిరుపమానమైనది. ఆయన వెలువరించిన గ్రంథాలలో మన తెలంగాణం, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, నవ్వుల పువ్వుల మిఠాయి చెట్టు, షితాబ్‌ఖాన్‌ వంటివి సుప్రసిద్ధమై ప్రచార మందున్నవి. ఈయన గ్రీకు పురాణ కథలెన్నో వ్రాసినారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు, వీరభద్రరావు కలం గుర్రానికి చక్కని దాణా పెట్టినారు. వారింట్లో జరిపిన సాహిత్య కృషి శ్లాఘనీయమయింది. నిరాడంబరమైన మూర్తిమత్వంతో అపరిమితమైన సాహిత్య కృషి సల్పిన వీరి రచనల నెన్నిటినో ముద్రించుటకు నిశ్చయించుకొన్న అళ్వార్‌స్వామిగారు పోతన చరిత్రను కూడా ప్రచురించవలెననే సంకల్పంలో సగానికి పైగా ముద్రించిరి....

   ....ఆళ్వార్‌స్వామిగారు స్థాపించిన ఈ గ్రంథాలయం ద్వారా తెలుగు విజ్ఞానము భవిష్యత్‌ తెలుగు వారికి కూడా వెలుగునీయగలదై ఉన్నదనుట అతిశయోక్తి కాదు.

   ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంలో 'తెలంగాణం' పేర రెండు సంపుటాలు తెచ్చారు. ఆళ్వార్‌స్వామి గారు ఈ సంపుటాల గురించి నాలుగు ముందు మాటలు వ్రాస్తూ ఇట్లా అన్నారు:

   "తెలంగాణ ప్రాంతంగా వ్యవహరించబడుతున్న తొమ్మిది జిల్లాలలొ చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంథాలు, తటాకాలు, కోటలు, వీర గాథలుఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు కళావేత్తలెందరో ఉన్నారు. అంతేగాక ఏండ్ల తరబడి దేశాన్ని తీర్చి దిద్దడానికి దేశాన్ని పురొగమింప చేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నాయి. వీటన్నిటిని వ్యాసాల రూపంలో అందించాలన్న కోరిక కారణంగా ఈ గ్రంథం అవతరించింది" అని.

   ఈ గ్రంథ ప్రచురణ సందర్భంలో మా తాలూకా దేవరకొండకు ఆళ్వార్‌స్వామిగారు వచ్చినారు. నేను అక్కడి ప్రముఖులకు వీరిని పరిచయం చేయడంతోబాటు గ్రంథమాలకు సభ్యులను చేర్పించినాను. కొందరిచే ప్రత్యేకంగా విరాళాలిప్పించినాను. ఆళ్వారుస్వామిగారు హైదరాబాద్‌ నుంచి నాకు ధన్యవాదాలు తెలిపే ఉత్తరం వ్రాసినారు. నా సాహిత్య రజతోత్సవ సంచికలో దాన్ని ముద్రించినాను.

   ఆళ్వారుస్వామిగారు ఎంతో శాంతంగా ఉండేవారు. లోననెంతో ఆవేదన ఉండేది. అది మాటల్లో అభివ్యక్తమయ్యేది. ఆయన మీద గాంధీ వంటి మహనీయుల ప్రభావాలున్నాయి. ఆళ్వార్‌స్వామిగారు చేపట్టిన ఈ గ్రంథమాలోద్యమం తెలంగాణా ప్రాంతం ప్రజల్ని ఉత్తేజితుల్ని చేయడమేగాక ఉద్యమోన్ముఖుల్ని చేసింది. దేశభక్తి, విద్యాసక్తి, సాంఘికసేవ, స్వాతంత్య్రేచ్ఛను పెంపొందించడమే గాక తెలుగు పురావైభవ ప్రాభవ వీరగాథల్ని బంగారు బాటలుగా మలచి భావితరాలకు ఈ గ్రంథం చెరగని తరగని ఆస్తిగా మిగిల్చినాడనే చెప్పాలె.

   ఆళ్వార్‌స్వామిగారు 'ప్రజలమనిషి' నవలా నిర్మాణంతో సాహిత్య లోకానికి సుపరిచితులే. నల్లగొండ జిల్లాలోని మాధవరం గ్రామానికి చెందినవారు. స్వయంకృషితో తెలుగూ, ఉర్దూ భాషల్లో పరిజ్ఞానం సంపాదించారు. చాలాకాలం గోల్కొండ పత్రికలో పని చేసినారు. ఆంధ్ర మహాసభోత్సవాలలో పాల్గొన్నారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. జైళ్ళు, లాఠీలు, నిర్భందకాండ రుచి చూసినారు. 'తెలుగు తల్లి' మాసపత్రికకు సంపాదకునిగా ఉన్నారు. 'జైలు లోపల' అనే కథాసంపుటిని ప్రకటించినారు. తెలంగాణ పోరాటం - తెలుగుజనం జీవితం తెలిపే 'గంగు'ను ప్రకటించకుండా స్వర్గధామం చేరినాడు. అభ్యుదయ రచయితల సంఘంలో అగ్రగామిగా సేవలందించిన ప్రజా సేవకుడు.

   సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రిక ద్వారా బహుముఖ సాహిత్య సేవలందించినారు. గోలకొండ కవుల సంచిక నందించినారు. తెలంగాణంలో ప్రతాపరెడ్డిగారు, కె.సి.గుప్తగారు, ఆళ్వార్‌స్వామిగారు గ్రంథకర్తలైన కవులకు, రచయితలకు కళాకారులకు, మార్గదర్శకులయినారనుట అతిశయోక్తికాదు. వారి మూలంగా ఎన్నో గ్రంథాలు అచ్చుకావడమే గాక తెలుగుజాతి జాగృతమయింది. అందుకు నా యీ చిరు వ్యాసం దేశోద్ధారక గ్రంథమాల స్మృతికి నూలుపోగుగా ఉండనీ అన్న ఆశతో - ముగిస్తున్నాను.

   ('కవితా రసోదయం' వ్యాససంపుటం, 1983)