ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                                 ఇదో రభస
                                                                    - కె.కె.రంగనాథాచార్యులు

   ఇది రామప్ప సభను గురించిన రభస. వట్టికోట ఆళ్వారు స్వామి రచనలలో చాలా తక్కువగా చర్చలోకి వచ్చిన గ్రంథం 'రామప్పరభస'. 1956-57 లో మచిలీపట్నం నుంచి వెలువడే 'తెలుగు విద్యార్ధి' పత్రికలో ప్రత్యేక శీర్షిక రూపంలో 'రామప్పరభస' కథనాలు వెలువడ్డాయి. ఇట్లా వచ్చిన పదహారు కథనాలను తెలుగువిద్యార్థి ప్రచురణలు 1984లో సంకలన రూపంలో వెలువరించింది. ఈ కథనాలను సాక్షి వ్యాసాలతో పోల్చడం జరిగింది. ఇది ప్రక్రియాపరమైన పోలిక కావచ్చు కాని విషయంలోను, భాషా శైలులలోను, అభివ్యక్తీకరణలోను 'రామప్పరభస' పూర్తిగా భిన్నమైంది. రెండింటి స్వరూప, స్వభావాలు వేరు. ఈ భేదం స్థూల, కాల, పాత్ర, లక్ష్యాలకు సంబంధించింది. హాస్యం, వ్యంగ్యం, ఎత్తిపొడుపు, పదగుంఫన శైలి పానుగంటి లక్ష్మీనరసింహారావు 'సాక్షి' వ్యాసాలలో కనిపిస్తాయి. సమకాలంలో మధ్యతరగతి సమాజానికి సంబంధించిన సర్వవిషయాలను స్ఫృశించే ప్రయత్నం చేస్తుంది 'సాక్షి'. 'రామప్పరభస' శైలి నిరాడంబరమైంది. వెటకారాలు, ఎత్తి పొడుపులు, పదాడంబరాలు ఉండవు. నిత్యం మాట్లాడుకునే సంభాషణ శైలిలో రచన సాగుతుంది. దేశ స్వాతంత్య్రానంతర సమాజం, పెరుగుతున్న స్వార్థం, పతనమవుతున్న విలువలు విషయవస్తువులు. సూటిగా, నిష్కర్షగా, మొహమాటం లేకుండా యధార్థాలను బయటపెడుతుంది 'రామప్పరభస'. ఆత్మవంచనను, అనైతికతను బయటపెడుతుంది. రామప్ప చేసే రభస తనకేదో కావాలని కాదు, కావలసింది కాలేదనీ కాదు. "అన్యాయం, అవినీతి, సంఘవిద్రోహం, బాధ్యాతారాహిత్యం మొదలైన సంఘ వ్యతిరేక, ప్రజావ్యతిరేక వర్తనలపైనే రామప్పరభస. రామప్పకు జంకు, గొంకులు తెలియవు. న్యాయానికై నిలవడంలో భీతి ఎరుంగనివాడు. బెదిరిస్తున్న పోలీసు అధికారినైనా, ఒప్పుకానిది చేస్తున్న ఆప్తమిత్రునికైనా ఒకే ధోరణిలో కదిలించగలవాడు. న్యాయప్రతిష్ఠాపన కోసమే రామప్ప రభసలు చేస్తాడు" అని ప్రచురణ కర్తలు రామప్పను పరిచయం చేస్తారు. రామప్ప 'అపరిచితుడు' లాంటివాడు కాదు. తప్పులు చేసినవారికి గరుడపురాణంలో చెప్పిన శిక్షలు వేసేవాడు, వేయించేవాడు కాదు. శిక్షలు విధించడం పైన ఆయనకు నమ్మకం కూడా లేదు. రామప్ప కాల్పనికుడూ కాదు. శుద్ధ ఆదర్శవాదీ కాడు. ఆయన వాస్తవవాది. ఆయనది యథార్ద దృష్టి. బాధ్యత గల పౌరుడిగా ఘటనలకు స్పందిస్తాడు. బలహీనతలను విశదపరచి, నిజాలను బట్టబయలు చేసి ఎదుటివాడికి అవగాహన కలిగించడం, ఆత్మశోధనకు అవకాశం కలిగించడం రామప్ప లక్ష్యం. రామప్ప పాత్ర ఆళ్వారుస్వామి వ్యక్తిత్వాన్ని స్ఫురింప జేస్తుందని అంటారు 'రామప్పరభస'కు చక్కని ఆహ్వానం పలికిన ఇరివెంటి కృష్ణమూర్తి.

   తొలితరం తెలంగాణ రచయితల్లో, ఉద్యమ జీవుల్లో వట్టికోట ఆళ్వారు స్వామిది విలక్షణమైన వ్యక్తిత్వం. అఖిలాంధ్రలోనే ప్రజాజీవితం గడిపిన వారిలో, సంస్థలు నిర్వహించిన వారిలో ఆయన విశిష్టవ్యక్తి. భేషజాలు లేని, ప్రచారం ఆశించని నిరాడంబరుడాయన. నియతవిద్య లేకపోయినా, లోకానుభవంతో జ్ఞానం సంపాదించాడు. గురు సమ్ముఖాలలో కాకుండా స్వయం కృషితో విద్యనార్జించాడు. నిరంతర స్వయం పఠనంతో ఆలోచనల్ని రూపొందించుకున్నాడు. సాహిత్యాభిలాషను పెంచుకున్నాడు. స్వయంగా పనిచేస్తూ ఇంగ్లీషు నేర్చుకొని ఇంగ్లీషు రచనలను చదవడం వరకు ఎదిగాడు. జీవితానుభవంతోనే ప్రగతిశీల భావాలను సంతరించుకున్నాడు. ఏ ఉద్యమంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా నాయకత్వాల కోసం పోటీపడి కాటులాడలేదు. పదవుల కోసం వెంపర్లాడలేదు. పేరు ప్రఖ్యాతుల కోసం తపించలేదు. పక్కవాడు ఏంచేస్తున్నాడు, ఏమంటున్నాడు అన్న దానితో సంబంధం లేకుండా తానుగా చేయగలిగిన పనులు చేస్తూపోయాడు. అందించిన వారి అండదండలను స్వీకరించాడు. అందించని వారిని ద్వేషించలేదు. ఏ పనిని స్వీయ ప్రయోజనాన్ని ఆశించి చేయలేదు. కార్యాచరణలో తనకు తానే కొన్ని పరిమితులు విధించుకున్నట్టు కనిపించినా గిరి గీసుకొని ఉండిపోలేదు. తాను స్పష్టంగా కొన్ని సిద్ధాంతాలు నమ్మినా రాద్ధాంతాలు చేయలేదు. అన్ని రకాల భావాలు కలవారితోను మానవ సంబందాలు కలిగి ఉండేవాడు. కాంగ్రేసులో ఉన్నా కమ్యూనిస్టు పార్టీలో ఉన్నా చిత్తశుద్ధి గల కార్యాచరణే ఆయనకు ముఖ్యం. సిద్దాంతాల కంటే ఆచరణలోని నిజాయితీకి, నైతికతకి ప్రాధాన్యం ఇచ్చాడు. 'రామప్పరభస'లో చాలా కథనాలు ఈ విషయాన్నే తెలియజేస్తాయి. ఖచ్చితమైన అభిప్రాయాల్ని మెత్తగా ప్రకటించడం, నిష్కల్మషమైన విమర్శ చేయడం తప్ప నోరు పారేసుకోవడం గాని, ఇతరులను నొప్పించడం గాని చేయలేదు.

   వట్టికోట సామాన్య కుటుంబంలో పెరిగాడు. సామాన్యుడిగా జీవించాడు. సాధారణ కార్యకర్తగానే ఉద్యమాలలో, రాజకీయాలలో పనిచేశాడు. అధిక్యతాభావాన్ని ప్రదర్శించి ఇతరులను కించపరచలేదు. న్యూనతభావంతో కుంగిపోలేదు. ఇళ్ళల్లో పనిచేశాడు, వంటలు చేశాడు. హోటల్లో వడ్డనలు చేశాడు, గ్రంథాలయాలలో పనిచేశాడు. గ్రంథాలయ ఉద్యమాలలో పనిచేశాడు. స్వయంగా గ్రంథాలయ నిర్మాణం చేపట్టాడు. పత్రికలకు ప్రూఫులు చూశాడు. దాని ద్వారా ఎంతో నేర్చుకున్నాడు. ప్రచురణాలయాలలో పనిచేశాడు. స్వయంగా ప్రచురణలు చేపట్టాడు. ఆర్థిక వనరులను అందించగలిగిన సంస్థల, వాణిజ్యాల వెన్నుదన్నులు లేకుండానే గ్రంథమాలను నడిపాడు. రాజకీయోద్యమాలలో పాల్గొన్నాడు. జైలుశిక్షలు అనుభవించాడు. జైలు జీవితం ఆయనలో లోకజ్ఞానాన్ని పెంచింది. మానవ సంబంధాల విషయంలో గుణాత్మకమైన మార్పుకి కారణమైంది. తాను చూచిన జీవితం, ఎదుర్కొన్న ఘటనలు, చుట్టూ ఉన్న మనుష్యులు వట్టికోట రచనలకు వస్తువులు. ఆయన నవలలు స్వాతంత్య్రానికి పూర్వ తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక వాతావరణాన్ని చిత్రించే వాస్తవిక రచనలు. 'జైలులోపల' కథలు జైలు జీవితంలో ఎదిగిన ఆళ్వారుస్వామి వ్యక్తిత్వానికి, ఆలోచనలకు, హృదయానికి ప్రాతినిథ్యం వహిస్తాయి. 'రామప్పరభస' లోని కథనాలు స్వాతంత్య్రానంతర రాజకీయ, సామాజిక, పరిపాలన సంబంధమైన వాతావరణాన్ని గురించి చెప్తాయి. స్వాతంత్య్రానికి పూర్వ ఉద్యమాలలో పాల్గొని జైలుకి వెళ్ళి త్యాగాలు చేశామంటున్న వాళ్ళు, జైలులోని తన సహచర ఖైదీలు స్వాతంత్య్రానంతరం పూర్తిగా మారిపోవడం, స్వార్థం, అవినీతి మొదలైన విషయాలలో బాధ, వేదన ఆక్రోశం కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరువాత స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయబాధితుడిగా గౌరవభృతులను, గౌరవాలను ఆళ్వారుస్వామి ఆశించలేదు. కమ్యూనిష్టు పార్టీ సభ్యుడిగా జైలు శిక్ష అనుభవించిన ఆయనకు ఆ అవకాశం కూడా లేదు. కాంగ్రెసువాళ్ళు మాత్రమే స్వాతంత్య్రాన్ని సాధించినట్టు చెప్పుకొని పరిహారాలను, ప్రతిఫలాలను ఆశించడాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తాడు. ఈ అభిప్రాయాలనే ఒక కథనంలో రామప్ప ద్వారా చెప్పిస్తాడు. సభల్లో, సమావేశాల్లో గౌరవం ఇస్తూనే ఆయన మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వకపోవడం, వాటిని అమాయకమైన భావాలుగా, వాస్తవాలకు దూరమైన భావాలుగా స్పందించడం రామప్పకి తెలుస్తూనే ఉంటుంది. చర్మం ఎంతో మందం అయిపోయిందని భావించడం తప్ప ఏమీ చేయలేదు. కాని తాను చెప్పదలచిన దానిని చెప్పికాని వదలడు. రామప్ప ద్వారా తన ఆలోచనా ధోరణి లోనే ప్రకటించాడు ఆళ్వారుస్వామి.

   ఆళ్వారుస్వామికి లౌకికవాదం ఒక సిద్ధాంతం కాదు. నినాదం కాదు. అది జీవన విధానం, జీర్ణించుకొనిపోయిన వర్తన. మరీ ముఖ్యంగా జైలు జీవితం తరువాత లౌకిక జీవన సరళి ఆయనలో కలగలసిపోయింది. నేరాలు, తదితర కారణాల వల్ల ముస్లింలుకూడా ఆళ్వారుస్వామి సహచర ఖైదీలుగా ఉండేవారు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి జైలు జీవితం ఆయనకి ఉపయోగపడింది. 'జైలులోపల' కథలలో ముస్లిం ఖైదీలతో ఆయనకు గల అనుభవాలు చిత్రతమయ్యాయి. సహచర రాజకీయ ఖైదీలతో పోల్చినప్పుడు నేరస్థులైన ముస్లిం ఖైదీలు విడుదలై వచ్చిన తరువాత చిన్న చిన్న వృత్తులు అవలంబించి జీవనాన్ని సాగిస్తున్న వైనాన్ని 'రామప్పరభస'లోని ఒకటి, రెండు కథనాలు తెలియజేస్తాయి. వాళ్ళకి ఆయన యెడల ఏర్పడిన గౌరవాన్ని, ఆప్యాయతను తెలియజేస్తాయి. స్వాతంత్రోద్యమ క్రమంలో దూరం అవుతున్న కాంగ్రెస్‌, ముస్లింల ఐక్యతను ఆళ్వారుస్వామి ఆశించాడు. ఈ ఆకాంక్షే ఆయన కమ్యూనిష్టు పార్టీలో చేరడానికి కారణమైనట్లు తెలుస్తుంది. భారతదేశంలోని మొత్తం జాతులకు స్వయం నిర్ణయాధికారాన్ని సూచిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తనపై వేసుకున్న భారం దేశభక్తియుతంగా కనిపించడం వల్ల కమ్యూనిస్టు పార్టీపై విశ్వాసంతో అందులో చేరదలచానని ఆయన స్వయంగా ప్రకటించాడు.

   ఆళ్వారుస్వామి అసలు సిసలైన ప్రజాస్వామ్యవాది. ఇంకొకరి ఒత్తిళ్లతోనో, ప్రభావాలతోనో కాకుండా స్వయంగా తెలసుకొని, అవగాహన చేసుకొని అవలంబించవలసిన పంథాను నిర్ణయించుకోవాలన్నది ఆయన ప్రజాస్వామిక సూత్రం. తాను మొదలుపెట్టిన దేశోద్ధారక గ్రంథమాల ఉద్ధేశాలను వివరిస్తూ "మనిషి ఏ పంథా అవలంబించవలయునో అని ఆలోచించుటకు ముందు వివిధ పంథాలను తెలుసుకొనుట ముఖ్యము. కాబట్టి మేము ప్రచురించు ప్రతి గ్రంథము దేశీయుల ఆకాంక్షలను, హక్కులను బాధ్యతలను దృష్టియందుంచుకొని కర్తవ్యమును సూచించునదిగానుండును" అని ప్రకటించాడు. ఆంధ్రము తప్ప వేరే భాషలు తెలియని ఆంధ్ర సోదరులలో ప్రపంచ జ్ఞానాన్ని కలిగించడం, ఆంధ్ర సోదరులకు అవసర గ్రంథాలను అందుబాటులో ఉంచి మాతృభాషాభిమానాన్ని కలిగించడం గ్రంథమాల ఆశయాలుగా కూడా చెప్పాడు. ప్రాచీన, ఆధునిక వాఙ్మయ, రాజకీయ, వైజ్ఞానిక, సాంఘిక విషయాలకు సంబంధించిన గ్రంథాలను ప్రచురించడం గ్రంథమాల కార్యక్రమం. 1944 నాటికి ఆంధ్ర మహాసభలో ఏర్పడిన చీలికల్ని ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించే ప్రయత్నం చేశాడు. ఆళ్వారుస్వామి స్వయంగా అభివృద్ధి పక్షమే వహించినా రెండు పక్షాల వారు సామరస్యంగా పని చేయాలని రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. అభిప్రాయ భేదాల్ని పరిష్కరించుకోవాలని సూచించాడు.

   ఆళ్వారుస్వామి జీవితం, కార్యక్రమాలు ఎంత గంభీరమైనవో అంత నిరాడంబరంగా సాగాయి. ఆయన జీవితంలో రచనా వ్యాసంగం ఒక కోణం మాత్రమే. రాజకీయోద్యమాలు, కార్మికోద్యమాలు, పత్రికల నిర్వహణ, గ్రంథ ప్రచురణలు మొదలుగా ఆయన కార్యక్రమాలు బహుముఖీనమైనవి. 1937లో నిజామాబాద్‌ ఆంధ్రమహాసభలో పాల్గొన్నది ఆదిగా ఆయన కార్యక్షేత్రాలు వివిధ రూపాలలో సాగాయి. ఆయనలా అనేక రంగాలలో పనిచేసిన వాళ్ళు తెలుగు వారిలో అరుదనే చెప్పాలి. 1937లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు. తెలంగాణ ప్రాంతంలో అధికాధిక గ్రంథాలను ప్రచురించిన సంస్థ ఆనాటికి దేశోద్ధారక గ్రంథమాల ఒకటే. కథానిక, నాటిక, నవల మొదలైన సృజనాత్మక సాహిత్యంతో పాటు చరిత్ర మొదలైన విషయాలకు సంబంధించిన వివిధ గ్రంథాలను గ్రంథమాల ప్రచురించింది. తెలంగాణ ప్రాంత రచయితలకు ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చరిత్రలో శిల్పం, చిత్రలేఖనం, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, పురావస్తువులు, జానపద సాహిత్యంతో పాటు ఇతర సాహిత్యాలకు సంబంధించిన పరిశోధక గ్రంథాలను కూడా గ్రంథమాల ప్రచురించింది. 1939లో 'తెలుగుతల్లి' పత్రిక స్థాపనలో ఆళ్వారుస్వామి ముఖ్యపాత్ర వహించాడు. ప్రధాన సంపాదకులు ఎవరైనా నిర్వహణ అంతా ఆయనదే. అనంతర కాలంలో అభ్యుదయ రచయితల సంఘం పత్రిక నిర్వహణలో పాలుపంచుకుంది. అభ్యుదయ రచయితల సంఘం ప్రారంభకాలం నుంచి ఆళ్వారుస్వామికి సంబంధాలున్నాయి. 1944లో అరసం హైదరాబాదు శాఖ ఏర్పడింది. దానికి బాధ్యుడు ఆళ్వారుస్వామి. 1944లో అరసం విజయవాడ సభలో పాల్గొని కార్యవర్గ సభ్యుడయ్యాడు. దీన్నిబట్టి శ్రీశ్రీ కంటే ముందు నుంచే వట్టికోటకు ఆరసంతో సబంధం ఉన్నట్టు చెప్పవచ్చు. ఆళ్వారుస్వామి కార్యరంగంలో కార్మిక సంఘాలు, వృత్తికారుల సంఘాలు ముఖ్యమైనవి. గుమాస్తాల సంఘం, రైల్వే కార్మికుల సంఘం, రిక్షా కార్మిక సంఘం కార్యకలాపాలలో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. 1946 ప్రాంతంలో హైదరాబాద్‌లో మనుష్యులు లాగే రిక్షాలుండేవి. వాటిని నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ రిక్షా కార్మిక సంఘం ఉద్యమించింది. రిక్షా యజమానికి కూలీ ఇవ్వవలసిన కిరాయి, పనిగంటలు, రిక్షాలో ఒకరే కూర్చోవాలి అనే నియమం, రిక్షా నడిపే సమయంలో జరిగిన నష్టాన్ని యజమానే భరించడం మొదలైన విషయాలను పరిష్కరించే దిశగా రిక్షా కార్మిక సంగం పనిచేసింది. ఢిల్లీలాంటి పెద్దనగరాల్లో కొన్ని భాగాలలో లాగుడు రిక్షాలున్నాయి. ప్రత్యామ్నాయాలను డిమాండు చేస్తున్న కారణంగా ప్రభుత్వం వాటిని నిషేధించలేకపోతున్నది. ఆళ్వారుస్వామి నిర్వహించిన కార్యక్రమాలలో మరో ముఖ్యమైన అంశం పౌరహక్కులు. 1942లో కాంగ్రెస్‌వాదిగా జైలులో ఉన్నాడు. కమ్యూనిస్టుగా 1946 నుంచి 1951 వరకు జైలు శిక్ష అనుభవించాడు. 1951 తరువాత క్రియాశీల రాజకీయాలకు కొంచెం ఎడమై దేశోద్ధారక గ్రంథమాలను పునరుద్ధరించి గ్రంథ ప్రచురణలోను, స్వీయ రచనా వ్యాసంగంలోను మునిగిపోయాడు. ఆయన ముఖ్యమైన రచనలను చేసింది ఈ కాలంలోనే. 1959లో మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు.

   ఆళ్వారుస్వామి జీవితంలాగే ఆయన సాహిత్యం, రచనలు సూటిగా నిరాడంబరంగా ఉంటాయి. 1940లలో ఆయన రాసే భాష గ్రాంధికానికి దగ్గరగా ఉండేది. తరువాత కాలంలో ఆయన సాహిత్య రచనాభాష సమకాలంలో తెలుగులో వస్తున్న వచన రచనలలోని సాధారణ శైలికి దగ్గరగా ఉంటుంది. నిత్య సంభాషణలలో తెలంగాణ భాషావాసనల్ని కూడా వీస్తూ ఉంటుంది. ప్రత్యేక ప్రయత్నంతో కాకుండా తనకు సహజంగా అలవడిన శైలిలోనే ఆళ్వారుస్వామి రచనలు చేశాడు. భాషాడంబరం సామాన్యులకి అనవసరం అనేవాడని ఇరివెంటి కృష్ణమూర్తిగారు అంటారు. ఆళ్వారుస్వామి సాహిత్య వ్యక్తిత్వాన్ని ఇలా వివరిస్తారు. 'ఆయన నిష్కల్మష మనస్కుడు, యథార్దవాది, కల్పనలు చేతగాని అమాయకుడు. రచనలో నగిషీలు, శ్లేషలు, శబ్ధార్థాల పగడ్బందీలు, సాహిత్య ప్రక్రియలు కట్టుబాట్లు ఎరుగని వాడు. వీటిలో ఆయనకు నమ్మకం కూడా లేదు' ఆళ్వారుస్వామి అవసరం కొద్దీ రచయితగా రూపొందింనాడే తప్ప రచనను కళగా, జీవనోపాధిగా, యశస్సంపాదన విధానంగా ఎన్నడూ చేపట్టలేదని కృష్ణమూర్తిగారంటారు. అవసరం కొద్దీ రచయితగా రూపొందినా తెలుగు సాహిత్యంలో చారిత్రకంగా ఆళ్వారుస్వామి రచనలకు ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. తెలంగాణ రాజకీయ, సామాజిక వాతావరణాన్ని అన్ని కోణాల నుంచి చిత్రించిన నవలలుగా 'ప్రజలమనిషిగా', 'గంగు' నవలలు నిలబడతాయి.

   'రామప్పరభస' ద్వారా వ్యక్తమయ్యే ఆళ్వారుస్వామి వ్యక్తిత్వానికి, ఆలోచనలకి మూలాలను పరిశీలించడానికే ఆయనను గురించిన సుదీర్ఘ పరిచయం. ఆళ్వారుస్వామిని గురించి ఇంతగా చెప్పడం ఆయనని కేవలం ఒక ఆదర్శమూర్తిగా నిరూపించడానికి కాదు. ఆయనకు నమూనాలు లేవు. కొందరి ప్రోత్సాహాలున్నా ఆయనకు అలాంటి భావనలు ఉన్నట్లుగా కూడా కనిపించదు. సాధారణంగా ఒక రచయితనుగాని, ఉద్యమకారుణ్ణి గాని పరిచయం చేసేటప్పుడు అంతకు ముందటి ప్రసిద్ధ వ్యక్తులతోగాని, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తులతోగాని పోలికలు తేవడం జరుగుతుంటుంది. సర్వత్ర ఈ పోలికలు ఇమడవు. ఒక రచయిత్రి, ఉద్యమకారుడు ప్రత్యేక వాతావరణంలో ఎదుగుతాడు. విభిన్నమైన అనుభవాలు ఉంటాయి. తాను వచ్చిన జీవన నేపథ్యం జీవితాన్ని గురించి ఒక అవగాహనను కలిగిస్తుంది. తాను ఎదిగిన సమాజం ఒక తాత్విక దృష్టి కోణాన్ని అందిస్తుంది. లోక, శాస్త్ర కావ్యాద్యవేక్షణం దానికో స్పష్టమైన రూపాన్నిస్తుంది. జీవితాన్ని గురించి స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. బ్రిటీషాంధ్రతో పోల్చినప్పుడు భిన్నమైన రాజకీయ పరిపాలనలో ఉన్న తెలంగాణలో రాజకీయ, సాంస్కృతికోద్యమాలు కొన్ని పరిమితులలో, భిన్నమైన పద్ధతులలో సాగాయి. గంభీరమూ, నిర్ధిష్టమూ అవుతూ కూడా సామాన్యస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తున్న రాజకీయ కార్యకలాపాలు నిలకడగా సాగాయి. ప్రచారార్భాటాలకు, పత్రికలలో ఇతరత్ర ప్రచారానికి అవకాశం తక్కువ. ఆవేశోద్వేగాలకు తావులేదు. ఆ కారణం వల్ల రాజకీయోద్యమాలుకాని, సాంస్కృతికోద్యమాలుకాని, వ్యక్తుల కృషి కాని ముద్ర వేసినట్లు కనిపించవు. 1946లో మొదలైన సాయుధ పోరాటమే తెలంగాణలో తీవ్రమైనదిగా ముద్రవేసిన రాజకీయోద్యమం. ఆర్యసమాజం భిన్నమైన రీతిలో కొంత తన ముద్రను వేసింది. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఆ వ్యక్తి ఎదిగిన నేపథ్యం నుంచే అంచనా వేయవలసి ఉంటుంది. రాజకీయ ప్రాంతం, కుటుంబం, సమాజం, పరిసరాలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో, కార్యకలాపాల విధానాన్ని ఎన్నుకోవడంలో ప్రాధాన్యం వహిస్తాయి. ఆదర్శాలను, విలువలను, లక్ష్యాలను నిర్ణయిస్తాయి. రామప్పను, రామప్ప రభసను, తద్వారా ఆళ్వారుస్వామిని ఈ పరిధులలో నుంచే అర్థం చేసుకోవలసి ఉంటుంది.

   తన ఆశయాలను, ఆలోచనలను తెలియజేయడానికి మాధ్యమంగా ఆళ్వారు సృష్టించిన వ్యక్తి రామప్ప. రచయితగా ఆళ్వారుస్వామి రామప్పని పరిచయం చేసిన విధానాన్ని ఆయన మాటల్లోనే చూద్దాం. ఈ పరిచయం తనను గురించే రాసుకున్నట్టు ఉంటుంది.

   "రామప్ప 40 ఏండ్ల రాజకీయ జీవితం నుంచి విరమించుకోవడంపై ఎన్నో వ్యాఖ్యానాలు బయలుదేరాయి. పిరికివాడని కొందరు, అవకాశవాది అని కొందరు అసమర్ధుడని కొందరు, ఆధునిక వాతావరణాన్ని అలవరచుకోలేని దేబె అని కొందరు అన్నారు.

   సంస్థ ఎన్నికల్లో పోరాడటానికి చేతకాదు కాబట్టి పిరికివాడు. అందరితో మర్యాదగా మాట్లాడి ఎవరితోనూ ద్వేషాలు పెంచుకోడు కాబట్టి అసమర్ధుడు. అవకాశం చేయిజారిపోతున్నప్పటికి ఆసక్తి కనబరచడు కాబట్టి దేబె.

   ఎవరు ఏమన్నా రామప్ప నొచ్చుకోడు కాబట్టి వ్యాఖ్యానాలూ, విమర్శనలూ అందరూ బాహాటంగా అతని ఎదుటనే చేస్తుంటారు. అన్నీ విని రామప్ప అదో విధంగా నవ్వుతాడు. ఆ నవ్వుని అర్థం చేసుకోక 'కొంటెనవ్వు' అని వర్ణిస్తారు. కాని అన్ని విధాలైన విమర్శనలను నవ్వు ద్వారా స్వీకరిస్తాడని కొందరి వాదన. 'మీరంతా మీసాలు సరిగా రాని పిల్లలు, అనుభవంలేని అమాయకులు, అంతు తెలుసుకోలేని అసమర్థులు, ఆశయాలు లెక్కపెట్టక ఆచరణలో జరుగుతున్న అవకతవకలను ఒళ్ళు మరచి సహిస్తున్న నేరస్థులు. తాత్కాలిక ప్రయోజనాలకు లొంగి పరిణామాలను లెక్కించని సంకుచిత పరులు, మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతున్న మిడుతలు. సమాజ శ్రేయస్సును లెక్కపట్టని వ్యక్తి భోగలాలసత్వానికి ప్రాధాన్యమిచ్చు స్వార్థులు' - మొదలగు ఎన్నో సమాధానాలు ఆ నవ్వులో ఉంటాయి."

   తన మీద వచ్చే వ్యాఖ్యానాలకు, విమర్శలకు నవ్వునే ఆయుధంగా ప్రయోగించే రామప్ప క్రమంగా కార్యాచరణలోకి దూకుతాడు. తన దారిలో కనిపించిన అన్యాయాలను, అవినీతిని, తప్పులను, తప్పుగా తోచిన ప్రతి అంశానికి, ఘటనకు రామప్ప స్పందిస్తాడు. ఆ స్పందనలే రామప్ప రభసలు. మిత్రులనీ, పెద్దవాళ్ళనీ, అధికారులనీ భేదభావం లేకుండా చెప్పదలచిన దానిని ఖచ్చితంగా చెప్పటం రామప్ప అలవాటు. నిర్మొహమాటంగా మాట్లాడడం తన దురభ్యాసమని కూడా చాలా సందర్భాలలో అంటాడు. ఆనాడు ఏమోగాని ప్రస్తుతం అటువంటి వ్యక్తిత్వాలను ఆశించను కూడా లేము. నీతి, నిజాయితీ, నిస్వార్థం, నిరాడంబరత, నిష్పాక్షిక్షత, నియమపాలన, బాధ్యతల నిర్వహణ, సమాజసేవ మొదలైన మాటలు చెల్లుబాటు కాని ఆదర్శాలుగా తాజాగా స్వాతంత్య్రం వచ్చిన ఆకాలంలోనే భావించిన వాళ్ళున్నప్పుడు, ప్రస్తుతం మరీ పనికిమాలిన విషయాలుగా, పిచ్చివాళ్ళ ప్రేలాపనలుగా అనిపించడంలో వింత లేదు. మామూలుగా అనిపించే విషయాలు మొదలుకొని, గంభీరమైన సమస్యల వరకూ వివిధ అంశాలను ఆళ్వారుస్వామి రామప్పరభసలో స్పృశించాడు. రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందనుకున్న తొలిదశలోనే జరుగుతున్న విలువల పతనాన్ని చూచి చెందిన వేదనకు భాషారూపమే 'రామప్పరభస'. అదను చూచి అధిక ధరలను వసూలు చేయడం, విద్యారంగంలో ఆదర్శాలు కొరవడడం, యువకులు, విద్యార్ధులలో క్రమశిక్షణ రాహిత్యానికి కారణాలు, పిల్లల పెంపకం, ఆడమగ పిల్లల మధ్య వివక్ష, అధికారుల బాధ్యతారాహిత్యం, అవినీతి, ఉద్యమాలలో త్యాగాలు చేశాం అనుకుంటున్నవారు స్వాతంత్య్రం తరువాత మారిన తీరు, ప్రజలను పీడించిన భూస్వాములే స్వాతంత్య్రం తరువాత అధికారంలో ఉన్నవారికి దగ్గరై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న వాళ్ళు, ఆచరణ కంటే సన్మానాలకు, గౌరవాలకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు, పూర్వ ప్రతిష్ఠను ఉపయోగించుకుని బతుకుతున్న వాళ్ళు, తమ సైద్ధాంతిక మూలాలను మరచి ఎన్నికలకు మాత్రమే పరిమితమైన రాజకీయ పక్షాలు, ఇళ్ళలో బాల కార్మికుల చాకిరీ, రాజకీయ బాధితులన్న పేరుతో పరిహారాలను, భృతులను కోరడం, ఇతర పార్టీల వారిని వదలి కేవలం కాంగ్రెస్‌ వారినే రాజకీయ బాధితులుగా గుర్తించడం మొదలైన అంశాలకు సంబంధించి తన అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా రామప్పను రూపకల్పన చేశాడు ఆళ్వారుస్వామి.

   'రామప్పరభస'లో మొదటి ఘట్టం పరీక్షా ఫలితాల రోజు అణన్నర పత్రికను మూడణాలకు అమ్ముతున్న దుకాణదారుతో పేచీ పడడం, చివరకి దుకాణంలో మిగిలిన పది పత్రికలను తీసుకొని వాటి మొత్తం ధర రూపాయిన్నర ఇచ్చి బయట అణన్నరకే పత్రికలను అమ్ముతాడు. చివరి పత్రికను ఒక అట్టమీద అతికించి దుకాణానికి తగిలిస్తాడు. పత్రికలు కొనలేని విద్యార్ధులు పరీక్షా ఫలితాలు చూసుకోగలుగుతారు. ఒకరోజు రామప్ప బస్సులో ప్రయాణం చేస్తూ గమ్యం రాకుండానే మార్గమధ్యంలో దిగిపోయి దగ్గరే ఉన్న బేసిక్‌ విద్యా శిక్షణ కళాశాల ఆవరణలో ప్రవేశిస్తాడు. బేసిక్‌ విద్యాశిక్షణకు సంబంధించిన లక్షణాలేవీ అక్కడ కనిపించవు. సాయంత్రం అధ్యాపకులు చీట్లాటలాడి డబ్బులు లెక్క బెట్టుకుంటూ ఉంటారు. శిక్షణకు వచ్చినవాళ్ళు అక్కడ తమ కంచాలు తాము కడుక్కోవలసి రావడం, తమ బట్టలు తాము ఉతుక్కోవడం మొదలైన విషయాలకు బాధపడుతుంటారు. రామప్ప విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాడు. విద్యార్ధులతో సమిష్టి భోజనంలో అధ్యాపకులు ఎవ్వరూలేరు. భోజనం తరువాత రామప్ప ఉపన్యాసం బేసిక్‌ విద్యా విధానం గురించీ గాంధీ ఆలోచనల్ని వివరిస్తూ కళాశాలలో ఆ విధానాలను పాటించకపోవడాన్ని విమర్శిస్తాడు. గాడ్సే గాంధీని ఒకేసారి చంపాడని ఇక్కడ గాంధీ రోజూ హత్యకు గురి అవుతున్నాడని అంటాడు. రామప్ప చెప్పిన మాటలను శిక్షణలో ఉన్నవారు అందుకున్నారో లేదో కాని ఉపన్యాసం పూర్తి కాగానే చప్పట్లు కొడతారు. అంతవరకు నిద్రలో ఉన్న అధ్యక్షత వహిస్తున్న ప్రధానాధ్యాపకుడు నిద్రలేస్తాడు. మరికొన్ని కథనాలలో విద్య గురించి, పిల్లల పెంపకం గురించి, క్రమశిక్షణ గురించి ఉపన్యాస రూపంలో రామప్ప అభిప్రాయాలు తెలియజేస్తాడు. విద్య యాంత్రికం కాకూడదని, విజ్ఞాన చైతన్యాలను ఇచ్చేదిగా ఉండాలని, విద్యార్థికి అభిరుచి గల రంగాన్ని ఎన్నుకొనే అవకాశం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. ట్యూషన్‌ వల్ల వచ్చే అవ్యవస్థను వివరిస్తాడు. అందరినీ పరీక్షలకు పంపకుండా పరీక్షా ఫలితాలు చూపించడానికి కొందరిని మాత్రమే సెలక్ట్‌ చేసి పంపడాన్ని, డిటెన్షన్‌ విధానాన్ని విమర్శిస్తాడు. చదువు విషయంలో తల్లిదండ్రులే ఆడ, మగ విషయంలో చూపే వివక్షను ఎత్తి చూపుతాడు. ఇంటా బయటా తల్లిదండ్రులు మెలగే పద్ధతి, విద్యాలయాలలో ఉపాధ్యాయుల ప్రవృత్తి-వీటి ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో, వారి తీరు, భావాలు మన ముందుంచుతూనే తన అభిప్రాయాలపైన 'ఫోకస్‌' చేసే విధానం, కథనం ఆసక్తిదాయకంగా ఉంటుంది.

   అధికారుల బాధ్యతారాహిత్యం, అవినీతి కొన్ని కథనాలలో ప్రధాన విషయాలు. ఒక అధికారి రైల్లో సెకండ్‌ క్లాస్‌ టిక్కెట్‌ తీసుకొని ఫస్ట్‌క్లాస్‌లో ఉన్న ఉన్నతాధికారితో ముచ్చటిస్తూ సుమారు ప్రయాణం అంతా సాగిస్తాడు. దీన్ని గురించి చెప్పినా టికెట్‌ కలెక్టర్‌ పట్టించుకోడు. నేను చూసుకుంటానులే అన్నట్లు మాట్లాడతాడు. ఒకరోజు బస్సు ప్రయాణంలో సీటు విషయంలో పోలీసు అధికారితో రభస చేస్తాడు. పోలీసు అధికారి తాను బస్సును ఎక్కిన చోటకాక గమ్యానికి కొద్ది దూరంలో ఉన్న స్టేజీ నుంచి టిక్కెట్టు తీసుకుంటాడు. రామప్ప ఇదేమిటని గట్టిగా ప్రశ్నిస్తాడు. కండక్టరు, తోటి ప్రయాణికులు నీకెందుకన్నట్టు చూస్తారు. రామప్ప మరింత గట్టిగా నిలదీస్తాడు. పై అధికారికి చెప్తానంటాడు. గుడ్లెర్ర చేస్తూ పోలీసు అధికారి మధ్యలోనే దిగిపోతాడు. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పక్షానికి చెందిన కార్యకర్తలు కండక్టరుతో ఉన్న చెలిమితో టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తారు. చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కారణంగా టికెట్‌ తీసుకోవలసి వస్తుంది. ఆ కార్యకర్తలంతా పంచవర్ష ప్రణాళికను జయప్రదం చేయడానికి, ప్రభుత్వ ఆర్థిక స్థోమతను పెంచడానికి జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నవారు వినోబా భూదానోద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నామని చెప్పుకుంటున్నవాళ్ళు, దున్నేవాడిదే భూమి అని నినదించే విప్లవధీరులు, వీర వసంతరాయుళ్ళు తమ విషయం వచ్చినప్పుడు పరిస్థితులను, చట్టాలను తమకు అనుకూలంగా మలచుకోవడం రామప్పను వేధిస్తూ ఉంటుంది. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి అభిప్రాయాలను, వర్తనను మార్చుకొనే అవకాశవాదులను గురించి కూడా రామప్ప ప్రస్తావిస్తాడు.

   ఒకరోజు రామప్ప బండిలో వెళ్తుండగా ఒక ఊరి దగ్గర పిల్లలు రంగు రంగుల గుడ్డలు కట్టిన కర్రలు పట్టుకొని వెళ్తుంటారు. ఊళ్లో భూమి కొలతలు జరుగుతున్నాయి. భూమి హద్దులు తెలపడానికి పిల్లలు జెండాలు పట్టుకొని నిలబడాలి. యజమానులు అందుకు అయిదే శేర్ల బియ్యం ఇస్తారు. పిల్లలు బడికి వెళ్లడం మానుకొని వస్తారు. భూకామందులు అన్యాయంగా భూమిని దక్కించుకోవడానికి, ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో వకీళ్లు, అధికారులు, వాళ్ళ వెనుక రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉంటారు. లంచాలిచ్చిన వాళ్ళ భూమి కొలతలు ముందే అయిపోతాయి. లంచం ఇవ్వలేని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఉద్యోగుల భోజనాల ఖర్చు, లంచాల గురించి చర్చ జరుగుతుంటుంది. ముందు కరణం పార్టీ, పటేలు పార్టీలు రెండే ఉండేవి, రాజకీయ పార్టీలు చేరాయని జనం అనుకుంటూ ఉంటారు. రామప్ప మాట్లాడుతూ, "పిల్లలు బడిని మానుకుని, పెద్దలు మొదలుకొని గ్రామాల బాధ్యతలు మానుకొని ప్రజలను నాశనం చేస్తున్నారని" అంటాడు. ఒకరోజు రామప్ప జైలు స్నేహితుడు సోమనాధరావు ఊరికి వెళ్తాడు. ఇప్పుడు ఊళ్ళో పెద్దరికం ఆయనదే. పేరు ప్రతిష్ఠ సంపాదించాడు. రజాకారుల కాలంలో ఆయన ఇల్లూ, వసతిని ధ్వంసం చేయడం జరిగింది. జైల్లో నుంచి వచ్చిన తరువాత ఉళ్ళో వాళ్లు ఆదుకొని, సహాయం చేసి ఇల్లూ, వాకిలి ఏర్పాటు చేస్తారు. ఒకప్పుడు ప్రజాసేవకుడిగా సోమనాధరావుకి గుర్తింపు వచ్చింది.. జైల్లో ఉన్నప్పుడు క్షమాపణ చేప్తే వదిలేస్తామన్నప్పుడు సోమనాధరావు కొంచెం ఊగిసలాడతాడు. రామప్ప ధైర్యం కలిగించి నచ్చజెప్పి ఆ ప్రయత్నం మానిపిస్తాడు. క్షమాపణ చెప్పి మధ్యలోనే జైలు వదిలి వస్తే తనకీ గౌరవం, ఆదరణ లభించేది కాదని సోమనాధరావు రామప్పతో అంటాడు. రామప్ప ఊరికివెళ్లినప్పుడు సోమనాధరావు దగ్గర పెద్ద రైతులకీ, చాకలివారికీ మధ్య తగవు నడుస్తుంది. పెద్ద రైతులకి ఊళ్ళో చాకలివాళ్ళతో పడక పక్క ఊరి నుంచి చాకలి వాళ్ళను పిలుపించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సోమనాధరావు ఇద్దరి మధ్య తగువు తీర్చే ప్రయత్నం చేస్తాడు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. చివరికి పెద్ద రైతు పక్షం వహిస్తాడు. గట్టిగా మందలించబోయిన రామప్పకు ఏదో అంటీ అంటనట్టు నడిపించుకొని పోకపోతే పెద్దవాళ్ళతో, రాజకీయపార్టీలతో బతికేదెలా చెప్పండి అని సమాధానం చెప్తాడు సోమనాధరావు. రఘుపతిరావు దేవుడి పన్ను మొదలైన పేర్లతో ప్రజలను పీడించి వసూళ్ళు చేసిన ఒకప్పటి జాగీర్ధారు. ప్రస్తుతం మంత్రులకి, అధికారులకి దగ్గరై తన భూమిని ఏమాత్రం త్యాగం చేయకుండానే వినోబా భూదానోద్యమం కార్యక్రమం సఫలం చేసే కార్యక్రమంలో ముఖ్య కార్యకర్త అయిపోతాడు. 'రామప్పరభస' లో అనేక కథనాలు స్వాతంత్య్రానంతరం అతి కొద్దికాలంలోనే పెరుగుతున్న అన్యాయాలు, అమానుషత్వం, అనైతికతలను గురించి చెప్తాయి.

   గౌరవాలు, సన్మానాలు, ప్రచారాలు మొదలైన వాటి విషయంలో ఆళ్వారుస్వామికి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. అవి చాలామందికి వింతగొలిపే అభిప్రాయాలు. పట్టణంలో ఒకచోట మే ఒకటిన సభ జరుగుతుంటుంది. అలంకరణలు, రికార్డులు చాలా అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. తాను స్థాపించిన కార్మిక సంఘం పెరిగి పెద్దదైంది. ఒక కార్మికనాయకుడు రామప్ప కృషి గురించి, త్యాగాల గురించి సంఘ నిర్మాణంలో అతని పాత్ర గురించి ప్రశంసా పూర్వకంగా మాట్లాడతాడు. రామప్పకు సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తాడు. రామప్ప సన్మానాన్ని నిరాకరిస్తూ సన్మానాలు, గౌరవాలు కొందరికే కాదని, అందరికి అవకాశాలు అందుబాటులోకి రావాలని, త్యాగఫలాలు అందరికీ దక్కాలనీ, సన్మానాలు, అనవసర వ్యయాలు ఆదర్శాలు కాకూడదని ఉపన్యాసం ఇస్తాడు.

   రామప్ప ఊళ్ళో వాళ్లకి 1957 ఆగష్టు నెలలో 1857 శతాబ్ధి ఉత్సవాలు జరపాలనే ఆలోచన వస్తుంది. 1857 ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళ వారసులకి, 1942 ఉద్యమంలో పాల్గొన్నవారికి, వారి కుటుంబ సభ్యులకి సన్మానం చేయాలని నిర్ణయిస్తారు. ఆ సందర్భంగా రామప్ప మాట్లాడిన మాటలను ఆధునిక కాలంలో సాంస్కృతిక, సాహిత్య, సామాజిక రంగాలలోని పరిస్థితులతో పోల్చి చూడవలసి ఉంది. "నేను యెవరిని పురుషోత్తములుగాను, అందరికంటే గొప్పగాను చూడను. అందరూ పరిసరాలకు ప్రభావితులయ్యేవారే. దాని నుంచి ఎవరిని కూడా తప్పించలేము. ఉత్తముడనేవాడు ఉత్తమత్వానికి తాను ఎలా బాధ్యుడు కాడో, దుర్మార్గంగా బతుకుతున్నవాడు అలాగే బాధ్యుడుకాడు". ఇలాంటి ఆలోచనలు ఎంతమందిలో కనిపిస్తాయి. 1857 ఉద్యమంలో పాల్గొన్నవారి వారసులు, 1942 ఉద్యమంలో పాల్గొన్నవారి పిల్లలు పరిణామక్రమంలో రకరకాల పాత్రలు వహించారు. పరాయి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించిన వారున్నారు. పోలీసుశాఖలో, ఇతర ఉద్యోగాలలో చేరి ప్రజలను అణచివేసిన వాళ్ళున్నారు. వ్యాపారాలు చేసుకొని దోచుకున్న వాళ్లున్నారు. సన్మాన కార్యక్రమాలంటే 85 ఏళ్ల చరిత్రను గ్రంథంగా ప్రకటిస్తే ఆ దశలో ఎవరు ఏ విధంగా దేశానికైనా కృషి చేశారో విశదం అవుతుంది అని రామప్ప సలహా ఇస్తాడు. సలహాను అనుసరించి గ్రంథ ప్రచురణ జరుగుతుంది. గ్రంథ ఆవిష్కరణ రోజు రామప్ప చెప్పిన మాటలు ప్రస్తుత వాతావరణంలో మింగుడుపడడం కష్టమే. ఆ మాటలివి, "మహాశయులారా! ప్రచార పద్దతులు నాకు గిట్టవని మీకు తెలుసు. ఈ గ్రంథం ప్రచార దృష్టితో ప్రకటించబడ్డదని నేను అనుకోను. ఈ గ్రంథంలో 85 ఏండ్ల పోరాట కాలంలో మన ఊరి పాత్రను వివరించడమే ముఖ్యమని భావిస్తున్నాను. విషయాలు పేర్కొనవలసి వచ్చినప్పుడు వ్యక్తుల ప్రసక్తి రావచ్చు. కాని వాళ్ళే ముఖ్యంకాదు". ప్రస్తుతం ఊహలోనైనా ఇలాంటి ఆలోచనలు వచ్చు అవకాశం ఉందా!

   భిన్నమైన రాజకీయపక్షాలను, భావాలను అనుసరించినా వ్యక్తుల మధ్య స్నేహానికి, మానవ సంబంధాలకి అది అడ్డుకానవసరం లేదని ఆళ్వారుస్వామి భావిస్తాడు. తాము సభ్యులైన రాజకీయ పక్షాలు తమ సిద్ధాంతాలకనుగుణంగా నడుచుకోనప్పుడు ఎత్తి చూపవలసిన అవసరం ఉందని కూడా ఆయన భావన. ఒక కథనం ఈ అంశాలనే చెప్తుంది. రామప్ప, రవీంద్రుడు మిత్రులు. నియమాలలో, గీటురాళ్ళలో, ఆలోచనలో ఇద్దరికీ పోలికలు లేవు. రామప్పది కమ్యూనిస్టు పార్టీ, రవీంద్రుడిది కాంగ్రెస్‌. కలిసి రాజకీయసభలలో పాల్గొంటారు. అక్కడ వారిద్దరూ ప్రత్యర్ధులు. ఒకరు అవునని, ఒకరు కాదని చర్చల్లో వాదం. సమస్యల మీద పోట్లాడుకుంటారు. తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు, కలిసి ఉంటారు. తమ తమ ఆదర్శాల మీద ఇద్దరికీ అంచంచల విశ్వాసం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. చాలా సంవత్సరాలు ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఉత్తరాలలోనే రాజకీయ చర్చ చేసుకొనేవారు. కొందరు పార్టీలవారు ఇద్దరినీ ఉపయోగించుకోవాలని చూచారు. ఒకరినొకరు సంప్రదించుకోకుండానే రామప్ప. రవీంద్రులిద్దరూ ఒకే రకమైన అభిప్రాయాలకు వచ్చారు. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రకటనలిచ్చారు. గాంధీకి ప్రస్తుత కాంగ్రెస్‌కి సంబంధంలేదు. ప్రసుత విధానం, కార్యక్రమం నచ్చితే మాత్రమే కాంగ్రెస్‌ని గెలిపించండి అన్నది రవీంద్రుడి ప్రకటన సారాంశం. మార్క్సిజానికి ప్రస్తుత కమ్యూనిస్టుల కార్యక్రమానికి సంబంధం లేదు. ప్రస్తుత కమ్యూనిస్టు కార్యక్రమం, విధానం నచ్చితేనే వారిని ఎన్నికలలో గెలిపించండి అని రామప్ప ప్రకటన సారాంశం. రాజకీయ పక్షాల విషయంలో ఆళ్వారుస్వామి భ్రమలను కోల్పోయాడని చెప్పడానికి ఆస్కారం ఉండే విధంగా ప్రస్తుత కథనం ఉండి ఇలా ఎందుకు జరిగింది, ఏ పరిస్థితులలో ఏ కారణాల వల్ల ఇటువంటి అభిప్రాయాలకు వచ్చాడు అని తెలుసుకోవడానికి ఇతరత్రా ఆధారాలు ఏమీలేవు. సంఘ వ్యవస్థలో ఆయన ఇమడ లేకపోయాడా? నాయకత్వాలు, వ్యక్తి ప్రాధాన్యాల విషయంలో అయనకున్న అభిప్రాయాల పరిణామమా? రవీంద్రుణ్ణి కలుసుకోవడానికి వెళ్తాడు. అచ్చుశాలలో గ్రాహకుడు పెళ్లిపత్రికల కోసం హడావిడి చేస్తుంటాడు. మెషిన్‌మెన్‌ రాజయ్య అచ్చుపని చేస్తుండగా చెయ్యి మెషిన్‌లో ఇరుక్కొని మూడు వేళ్ళు తెగిపోతాయి. రక్తం కారుతూ ఉంటుంది. బస్సు సమయం అయిపోయిందని గ్రాహకుడు, హామీ ప్రకారం కార్డులు ఎలా అందజేయాలా అని రవీంద్రుడు హడావిడి పడుతుంటారు. రాజయ్యను ఇద్దరూ పట్టించుకోరు. రామప్ప మందలించి గ్రాహకుడు వచ్చిన గుర్రబ్బండిలోనే రవీంద్రుడిని తోడు తీసుకొని రాజయ్యను డాక్టరు దగ్గరికి చేరుస్తాడు. అక్కడ రామప్ప కార్మికోద్యమనేపధ్యాన్ని రచయిత గుర్తింపజేస్తాడు.

   సిద్ధాంతాలతో సంబంధం లేకుండా మనుష్యుల ప్రవర్తనలోని వైరుధ్యాలను, ఆత్మవంచన ప్రవృత్తులను 'రామప్పరభస'లోని ఒక కథనం తెలియజేస్తుంది. ఒక పత్రిక 1947 ఆగస్టు 15నాడు ప్రత్యేక సంచికను విడుదల చేస్తుంది. ప్రకటనలు అధికమై వచ్చిన వ్యాసాలన్నింటిని వేయలేదు. అందులో రామప్ప వ్యాసం ఒకటి. వ్యాసం పేరు 'యాజమాన్య ప్రవృత్తి'. ఆదర్శాలు, సిద్ధాంతాలు ఎంతవల్లె వేసినా మనిషిలోని యాజమాన్య ప్రవృత్తి పూర్తిగా వదలటంలేదు. రైతులకు, కూలీలకు జరిగే అన్యాయాలను ఖండించేవాళ్ళు, ఉద్యమాలు నడిపేవాళ్లు, ఇంట్లో భార్య విషయంలో నియంత్రణ వైఖరినే అవలంబిస్తారు. కాల నియమం లేకుండా చాకిరీ చేయించుకుంటారు. ఫ్రెంచి విప్లవం మొదలుకొని ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా ప్రజాస్వామ్య సంస్కృతి ఇంకా నిలదొక్కుకోలేదు. రాచరికాల కాలంనాటి దౌర్జన్యాలు మరో రూపంలో ఇప్పుడూ జరుగుతున్నాయి. ఇది వ్యాస సారాంశం. ఏ సిద్ధాంతం అయినా, రాజకీయ పక్షమైనా, సంస్థ అయినా ప్రజాస్వామ్య ప్రవృత్తి ముఖ్యం అంటున్నాడు రామప్ప.

   రాజకీయ బాధితుల మహాసభకు అధ్యక్షుడిగా ఉండమని నిర్వాహకులు కోరగా రామప్ప నిరాకరిస్తాడు. అదే సందర్భంలో పత్రికా ముఖంగా ఒక ప్రకటన ఇస్తాడు. రాజకీయ బాధితుల సంఘం నిర్వాహకులకు కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు. (1) మీరు రాజకీయాల్లో పాల్గొనడానికి కారణాలేమిటి? (2) మీరు పోరాటంలో పాల్గొనడానికి ఆదేశించిన నాయకులు ఏమైనా వాగ్ధానాలు చేశారా? దేశం కోసం త్యాగం చేయాలని, బలికావాలని, అధోగతిలో ఉన్న దేశీయుల కష్టాలను తీర్చాలని కదా తలచింది? (3) చరిత్రలో ఆశయసాధనకై తమ జీవితాలను అంకితం చేసిన మహానుభావులకు లభించిన ప్రతిఫలం ఏమిటి? వారి కష్టఫలం నిర్ణయించగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికైనా ఉందా? (4) కేవలం 1885వ సంవత్సరంలో అఖిలభారత కాంగ్రెస్‌తో స్వాతంత్రోద్యమం మొదలై, 1949వ సంవత్సరంలో అంతమయ్యాక ఇక చేయవలసింది ఏమీ లేదని, ఇక స్వంత ఆస్తుల సేకరణే మిగిలిందని తలుస్తున్నారా? (5) రాజకీయ స్వాతంత్య్రం లభించినా ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రం సాధించాల్సి ఉందని పెడ్తున్న ఘోష వినిపించడం లేదా? (6) స్వాతంత్య్ర సాధనలో భాగస్వాములైన ఇతర రాజకీయ పక్షాల కంటే కాంగ్రెస్‌ వారు తామే రాజకీయ బాధితులమని తలవడంలో అర్థమేమిటి? దీని వెనుక ఉన్న మనస్తత్వం ఏమిటి? స్వాతంత్య్ర సాధనతో కర్తవ్య నిర్వహణ ముగిసిందని తలవకుండా, ప్రజలకు దూరం అవకుండా అక్షరాలా స్వాతంత్య్రానికి దోహదం చేయండి అని రాజకీయ బాధిత సంఘం నిర్వాహకులను కోరుతూ ప్రకటన ముగుస్తుంది.

   ఆళ్వారుస్వామి జీవనవిధానం, ఆలోచనా పద్దతి, కార్య నిర్వహణరీతులు, రచనలు చేసిన కాలం మొదలైన వాటిని పరిశీలిస్తే సుమారుగా ఆయన వ్యక్తిత్వానికి ప్రతిరూపమని అర్థం అవుతుంది. ఆళ్వారుస్వామి నలభైయారేళ్లు మాత్రమే జీవించాడు. రాజకీయంగా కొన్ని మలుపులు తిరిగినా చివరి దాకా కార్యాచరణలో వ్యగ్రుడై ఉన్నాడు. సంస్థలలో పనిచేసినా, ఒక్కడిగా పనిచేసినా తననొక కార్యకర్తగా మాత్రమే భావించాడు. కార్యాచరణ ఆర్భాటంగా కనిపించదు. అలా అని ఏ విషయంలోను ఉదాసీనత కూడా లేదు. ఏదో ఒక రంగంలో క్రియాశీలంగా ఉన్నాడు. జీవితం మొత్తం చూస్తే ఆయన కార్యకలాపాలలో వైవిధ్యం ఉంది. తనను తన పనులను అతిగా ప్రదర్శించుకొనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. తనకుతాను గొప్ప రచయితగా కూడా చెప్పుకోలేదు. స్వభావంలో సమతౌల్యం వల్ల ఆళ్వారుస్వామి మానవ సంబంధాలలోని ఆర్థ్రతను ఎప్పుడూ కోల్పోలేదు. ప్రస్తుత ప్రత్యేక సందర్భంలో కొందరి నుంచి కొన్ని రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆళ్వారుస్వామికి, ఆ మాటకు వస్తే ఆయనలాంటి మరికొందరికి, రావలసిన గుర్తింపు ఎందుకు రాలేదు? ప్రభుత్వాలు ఆయన స్మారకచిహ్నాలు ఎందుకు ఏర్పాటుచేయలేదు. ఆళ్వారుస్వామి గ్రంథాలయాన్ని కలుపుకున్న నగర కేంద్ర గ్రంథాలయంలో ఆయన విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు? గ్రంథాలయానికి ఆయన పేరు ఎందుకు పెట్టకూడదు? ఒక కోణంలో ఇవి అవసరమైనవిగా కనిపిస్తాయి, మరో కోణంలో అమాయకమైనవిగా తోస్తాయి. వీటిలో చాలా వరకు ప్రభుత్వపరంగా రాజకీయాలపరంగా జరుగవలసినవి. గత మూడు, నాలుగు దశాబ్దాల కాలంలో తమకు కేంద్రీభూతంగా ఉన్న 'సింబల్స్‌' తప్ప తక్కిన చారిత్రక వ్యక్తులను గురించి, చరిత్రను తెలుసుకోవాలనే స్పృహ ఉన్న రాజకీయ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు ఏ ప్రాంతాలోనైనా ఎంతమంది ఉన్నారు? ఈ సందర్భంలో ప్రత్యేకంగా గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆళ్వారుస్వామి స్వయంగా ప్రచారాన్ని, గౌరవాలను, సన్మానాలను, కీర్తి ప్రతిష్టలను కోరుకోని వాడుగా కనిపిస్తాడు. వ్యక్తులకన్న విషయం ముఖ్యం అన్నది ఆయన ఆలోచన అని తెలుస్తూనే ఉంది. ఉత్తమం, దుర్మార్గం అనేవి పరిసరాలకు ప్రభావితమయ్యే అంశాలని కూడా ఆయన భావించాడని స్పష్టం అవుతున్నది. ప్రస్తుతతరం వాళ్ళు ఆళ్వారుస్వామి నుంచి నేర్చుకోవలసిన అంశాలివి. గొప్ప, మహా అనే భావనలు మానవ కల్పితాలు. ప్రత్యేక భావజాలంతోనే సాగే సాంస్కృతిక సాహిత్యోద్యమాలకు సంస్థ ప్రణాళిక, పత్రికలతో పాటు ఒక సింబల్‌ కూడా కావాలి. సింబల్‌ కావడానికి కొంత సంసిద్ధత ఉండాలి. తక్కినదంతా సాధ్యం. పోష్య, పోషక భావం ప్రధానాంశమైన భూస్వామ్య సాంస్కృతిక వర్గాలకు ప్రాంతాతీతంగా ఒక ప్రతినిధి కావాలి. స్వయం ప్రకాశక చైతన్యం కూడా ప్రచారంలోకి రావడానికిగల సాధనాలలో ఒకటి. గొప్పదనం, మహత్త్వం, ఉత్పత్తి అయ్యే విధానాలివి. ప్రస్తుతం అంతా స్వయంసిద్ధి, స్వయంనిర్మాణం, స్వయం ప్రకాశనం. అవసరాన్ని బట్టి, సందర్భాన్ననుసరించి ప్రాంతం, సామాజిక వర్గం భావజాలం అనే అంశాలు సాధనాలవుతాయి. సంస్థలు, మాధ్యమాలు ఏవైనా నిచ్చెన మెట్లెక్కడానికి ఉపకరణాలు. కొందరు పల్లకిని మోసే బోయీలను తయారు చేసుకోవడంలో సిద్ధహస్తులు. ఈ నైపుణ్యం లేనివారిదంతా అయోమయం, ఆగమ్య గోచరం. ఇది ప్రాంతాతీతమైన స్థితి. పోయినవాడితో, వాడి సాహిత్యంతో, కృషితో సంబంధం లేదు, అవసరమూ లేదు. పక్కవాడిని గురించిన స్పృహ అసలే లేదు. ఇప్పుడు ఆళ్వారుస్వామికి ప్రాసంగికత ఎంతైనా ఉంది. కాని ఆచరణ సాధ్యమా?