ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                                'ప్రజల మనిషి' నవలా శిల్పం
                                                                              - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి


   ఏ రచనలోనైనా రెండు అంశాలుంటాయి. ఒకటి రచయిత చెప్పే విషయం, రెండూ ఆ విషయాన్ని రచయిత చెప్పే విధానం. మొదటిది వస్తువు, రెండవది శిల్పం. రచనలో ఈ రెండూ సమన్వయం పొందినపుడే రచన గొప్పదవుతుంది. వస్తువు రచనలో ప్రధానాంశం. శిల్పం వస్తువును బలంగా పాఠకుని దగ్గరికి చేర్చే సాధనం. వస్తువు శిల్పాన్ని నిరాకరించకూడదు, శిల్పం వస్తువును మింగేయకూడదు. ఇనుము వస్తువైతే, కత్తి, సుత్తి, కొడవలి శిల్పం, వెదురు వస్తువులైతే బట్ట, బుట్ట శిల్పాలు. మట్టి వస్తువైతే కుండ, కంచం శిల్పాలు. కొయ్య వస్తువైతే నొగ, కాడి, మేడి శిల్పాలు, ముడి సరుకును నిర్ధిష్టమైన రూపంలోకి మలుచుకోవటం శిల్పం నైపుణ్యం. దీనిని రచయిత శోధించి సాధించాలి. రూపరంజితమైన వస్తువు లేకపోయినా, సాహిత్యంలో రచయిత పరిణత రూపం కోసం ప్రయత్నించాలి. భావం బొమ్మగా మారాలంటే అది రచయిత మస్తిష్క మనే కొలిమిలో కాగి సాగి బయటికి రావాలి. అప్పుడే రచనకు కళ అబ్బుతుంది. 'ప్రజల మనిషి' కళాత్మక రచన.

   తెలుగు వాళ్ళకు నవలాశిల్పం కన్నా కథానికాశిల్పమే బాగా పట్టుబడింది. పాశ్చాత్యులకు నవలా రచన కన్నా కథానికా రచనా కష్టమనిపించింది. ఆ ప్రక్రియల్ని పాశ్చాత్యుల నుంచి స్వీకరించిన తెలుగువాళ్ళ విషయంలో మాత్రం ఇది తిరగబడింది. తెలుగులో నవలా నిర్వచానానికి నిలబడేవి కొన్నే. చాలా నవలలు పెద్ద కథలే. సమగ్ర మానవ జీవిత చిత్రణ, ఇతిహాసం అనే మాటలకు ఉదాహరణ ప్రాయాలుగా నిలిచే నవలలు కొన్నే. మనం మెచ్చుకొనే చాలా నవలలు నవల కన్నా చిన్నవి కథానిక కన్నా పెద్దవి, నవలిక కన్నా కొంచెం పెద్దవి. కథానికలో లాగే ఒకే విషయాన్ని ముక్కుసూటిగా లాక్కుపోయే నవలలే ఎక్కువ తెలుగులో, కథానిక సందులు గొందులుగా తిరక్కూడదు. నవల సందులు గొందులుగా తిరగాలి. సందులు గొందులు తిరిగితే కథానిక కథానిక కాదు. సందులు గొందులుగా తిరక్కపోతే నవల నవల కాదు. నవల సందులు గొందులు తిరిగి మళ్ళీ ప్రధానదారిని చేరుకోవాలి. చాలా తెలుగు నవలలుసందులు గొందులు తిరగవు. అందుకే అతి పెద్ద కథలుగానే మిగిలిపోతాయి. నవలా కథానికల స్వరూపాలను గురించి బాగా అధ్యయనం చేసిన కొడవటిగంటి కుటుంబరావు నవలలే పెద్ద కథలనిపిస్తాయి. వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి' కూడా పెద్ద కథే. ఇది నవల కన్నా చిన్నది, కథ కన్నా పెద్దది. కంఠీరవం, కొమురయ్య కుటుంబాల కథ ప్రధానాంశాలుగా 1938లో హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఏర్పడడానికి ముందటి తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాట చిత్రణ 'ప్రజలమనిషి' నవల. ప్రజా నాయకుడు ప్రజలలోంచే రూపొందే క్రమాన్ని కంఠీరవం పాత్ర ఆధారంగా ఈ నవల నిరూపించింది. సామాజిక పరిణామాలలోంచి ఒక వ్యక్తి ఎలా వికాసం పొందుతాడో ఈ నవల రుజువు చేసింది.

   ప్రజలమనిషి నవల కేవలం ఒక నిర్ధిష్టమైన స్థలంలో ఒక గ్రామంలో జరిగిన సంఘటల్ని పోగేసిన రచనగా మిగిలిపోలేదు. వాటిమధ్య కార్యకారణ సంబంధం అడుగడుగునా కనిపిస్తుంది.

   నవల సమస్యతో మొదలై, ఆ సమస్యకు పరిష్కారం సూచింపబడడంతో ముగుస్తుంది. కోటయ్య ఆవును రామభూపాలరావు అన్యాయంగా సొంతం చేసుకోవడం, ఆండాళమ్మ రామభూపాలరావుకు ఉచితంగా విస్తరాకులు కుట్టివ్వడం-వీటితో తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా, ప్రజల చైతన్యం మూలంగా అందరూ ద్వేషించే ఈ నిరంకుశ ప్రభుత్వానికి తుది ఘడియలు దగ్గరికి వచ్చాయి. అనే అవగాహనతో నవల ముగుస్తుంది

.

   కొమరయ్య, కంఠీరవం ప్రశ్నలతో మొదలయిన నవల, ఆ ప్రశ్నలకు సమాధానాలతో ముగుస్తుంది. నవల ప్రారంభంలో కొమరయ్య తన తండ్రి కోటయ్యను దొరకు ఆవును ఎందుకిస్తావు? అని ప్రశ్నించాడు. ఇవ్వనంటే దొర ఊరుకోడా? అని ప్రశ్నించాడు. అలాగే మీరు కూరగాయలు, ఆవును ఇస్తున్నారు. ఇస్తళ్ళ మా అమ్మ కుట్టిస్తున్నది. వాండ్లింటికి చుట్టాలొస్తే అంతా మనకే వచ్చిందే అని కంఠీరవం అంటాడు నవల మొదట్లో. ఇద్దరు పిల్లవాళ్ళు చిన్న ప్రశ్నలు వేసుకోవడంతో నవల మొదలవుతుంది. "మంచి ప్రభుత్వం వచ్చే దాకా కష్టాలు తప్పవు. మంచి ప్రభుత్వంలో అన్యాయంగా ఇతరుల ఆస్తులను ఆక్రమించరు.... ముఖ్యంగా అంతా ఆప్తులుగా బతుకుతారు'' అనే కంఠీరవం ప్రకటనతో నవల ముగుస్తుంది. ఈ మధ్య అనేక సంఘటనలు ప్రారంభానికి ముగింపుకు మధ్య సంబంధాన్ని కుదిర్చాయి. నవలాంగాలలో మొదటిదైన నవలా కథను గురించి చెబుతూ వల్లంపాటి 'నవలాశిల్పం'లో ఇలా అన్నారు. "మంచి కథకు రెండు లక్షణాలుంటాయి. మొదటిది- సరైనచోట ప్రారంభమై సరైనచోట ముగియడం. రెండవది- అన్ని విషయాలలోను అనివార్యతను కలిగి ఉండటం," 'ప్రజలమనిషి'లో ఈ రెండు లక్షణాలు బాగా అమరాయి. తెలంగాణ గ్రామీణ సమాజంలో దొరల దోపిడి, ప్రజల వెట్టిచాకిరి కొనసాగుతుండగా దానికి చరమగీతం పాడటానికి ప్రజలు ఉద్యుక్తులవ్వడం, పోరాటమే సమస్యలకు పరిష్కారమని ఉద్యమించడమే కథాక్రమం, ఈ క్రమంలో ప్రతి సంఘటనా నవలలో అనివార్యంగా సంభవించినదే కావడం వల్ల నవలాశిల్పం పటిష్ఠంగా రూపొందింది.

   నవలలోని మొదటిపేరాలోని ఆళ్వారుస్వామి నవలాసారాంశాన్ని పాఠకునికి పరిచయం చేసి, ఆ తర్వాత దానిని విస్తరించారు. ఇది ఎంతో వాస్తవికంగా నవలలో ఒదిగిపోయింది. మనిషి కథను చెప్పడానికి పశువుల్ని ఉపయోగించుకోవడం ప్రపంచ సాహిత్యంలో మొదటి నుంచీ ఉంది. శ్రమ దోపిడి జరుగుతున్న వ్యవస్థను, దాని పరిణామాలను ఆళ్వారుస్వామి ఇలా చిత్రించారు. "తెల్లవారుజామున మొదలై అప్పుడే వర్షం వెలిసింది. ప్రజలు ఇండ్లలో నుండి బయటికి వచ్చి తమదైనందిన కార్యకలాపాల్లో లీనమయ్యారు. రైతులు తమ పశువులను దొడ్లో నుండి బయటికి వదిలి వీధిలో ఎత్తైన ప్రదేశంలో నీరు నిలువని చోట ఎండు గడ్డి వేశారు. బాటన బోయే ఒక ఆవు గడ్డిలో మూతిపెట్టబోయింది. తన హక్కును హరించబోతున్నదనే కోపంతో గడ్డి తింటున్న ఎద్దు ఆవును కుమ్మపోయింది. చేతి కర్రతో ఎండుగడ్డిని కిందమీద చేస్తున్న కోటయ్య పరీక్షగా తన ఎద్దును చూచాడు. అందరికి సంబంధించినదిగా తలచబడే వస్తువును ఇతరులు హరించబోతే అడ్డుపడి రక్షించుకునే ఆలోచన తన ఎద్దుకు కలిగినందుకు మానవుని ప్రవృత్తి తన ఎద్దుకు అలవడినందుకు ఆనందిస్తూ కోటయ్య కొట్టములోకి వెళ్ళాడు," ఇది నవలకు పునాది. ఈ పునాది "పాలకుల శ్రమదోపిడి - శ్రామికుల తిరుగుబాటు," ఈ పునాది మీద ఆళ్వారుస్వామి నవలను నిర్మించారు. ఈ ప్రారంభమే నవలలోని సారాన్ని మొదటే పాఠకునికి పట్టిస్తుంది. ఎద్దుమీద రచయిత చేసిన వ్యాఖ్యానం మనిషి జీవితంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఉత్సాహం పాఠకునిలో కలిగించి నవలను చదివిస్తుంది. మాలపల్లి నవలలో రామదాసు మాటలు, కన్యాశుల్కం నాటకంలో గిరీశం మాటలు- ఇలాంటి ప్రారంభాలే. ప్రజలమనిషి నవల శ్రమదోపిడి జరుగుతున్న వ్యవస్థను సూచించింది. దానిని అడ్డుపడి రక్షించుకోవడం పరిష్కారమని కూడా సూచించింది. కోటయ్య పొలాన్ని దొర దోచుకోవడం పరిష్కారమని కూడా సూచించింది. కోటయ్య పొలాన్ని దొర దోచుకుంటే అన్నమ్మ అడ్డంపడింది. కంఠీరవం, విజయరావు, బషీర్‌వంటి వాళ్ళు దొర ఆగడాలను అడ్డుకున్నారు. తిరుగుబాటు చేశారు. అరెస్టయ్యారు. అయితే కంఠీరవం మంచి ప్రభుత్వం రావాలంటే కష్టాలు తప్పవు అన్నారు చివర్లో. రచనలో ఆద్యంతాల మధ్య సమన్వయమంటే ఇదే.

   కంఠీరవం నవల ప్రారంభంలో పిల్లిలాంటి వాడే నవల నడుస్తున్న కొలదీ సింహంగా మారాడు. ప్రశ్నించే గుణం, పరిశీలించే తత్వం మొదటి నుంచి ఉన్నా, కంఠీరవం సామాజిక పరిస్థితులలో ఇతర సామాజిక వర్గాల ప్రజలతో సంబంధాలు పెరుగుతున్న కొలదీ వాళ్ళ ద్వారా తాను ఎదుగుతూ తాను వాళ్ళను ఎదిగిస్తూ ప్రజల మనిషి అవుతాడు. చీటికిమాటికి బావురుమని ఏడ్చే కంఠీరవం, నవలాంతానికి జనానికి ధైర్యం చెప్పే దశకు చేరుకుంటాడు. ఆండాళమ్మ పంతులు దగ్గర చదువుకుంటున్న కంఠీరవాన్ని విస్తరాకులు కుట్టడానికి మోదుగాకులు తెంపుకు రమ్మని పంపింది. పంతులు దగ్గర చదువుకొనే దశలో కంఠీరవం పిల్లవాడు. ఏడ్చే పిల్లవాడు అన్న ధోరణి వచ్చిన ఇంట్లోంచి బయటపడినప్పుడు కూడా కంఠీరవంకు ఏడుపు వచ్చింది. ఈ రెండు ఏడ్పుల మధ్య తేడా ఉంది, పరిణామముంది. ఆ తర్వాత కంఠీరవం చదువంతా సమాజమనే పాఠశాలలోనే గడిచింది. ఒక రకంగా ప్రజలమనిషి నవల కంఠీరవం చదువే. ప్రశ్నించే గుణం బాల్యం నుంచే ఉన్నా, కంఠీరవం కులాచారంలోంచి బయటపడటానికి కొంత కాలం పట్టింది. కంఠీరవం ఇల్లు విడిచి రాగానే పరిచయమైన పిల్లల దగ్గర నుంచి అతని ప్రవర్తన వికసించసాగింది. జనంలో కలవడం వేగవంతమైంది. అక్కడ నుంచి డిచ్‌పల్లి, అక్కడ నుంచి నిజామాబాద్‌, అక్కడి గ్రంథాలయం తిరిగాడు కంఠీరవం. ఈ ప్రయాణమంతా అతని చైతన్య వికాసక్రమంగా చిత్రించారు రచయిత. ఒక పిల్లవాడు పల్లెను వదిలి ప్రజలలో బతికి స్వంత భావాలనుండి విముక్తమై జనమంతా తన వాళ్ళుగా భావించే క్రమాన్ని రచయిత అనేక సంఘటనలు, సన్నివేశాలు ఆధారంగా చిత్రించాడు. "నేను గ్రామం విడిచి వెళ్ళిపోయినపుడు నాకు కొమరయ్య ఒకడే ఆప్తుడుగా ఉన్నాడు. నేడు వీరంతా ఆప్తులుగా నాకుతోస్తున్నది. నీతో నాకు ఇల్లు, కుటుంబం ఉన్నప్పటికీ అనాథునిగా ఊరు వదలి వెళ్ళిపోయాను. ఈనాడు నాఒంటిపై బట్టలు తప్ప వేరు ఏమీ లేవు. అయినా మీరంతా నాకు తరగని విధంగా, విడదీయజాలని కుటుంబంగా తలుస్తాను" అని కంఠీరవం ప్రకటించడానికి ఆయన జీవిత పరిణామాలే కారణాలుగా చిత్రించడం సంకేతశిల్పం. మధ్యలో కంఠీరవానికి అనేక పర్యాయాలు కుల, మత సంబంధమైన సాంస్కృతిక వైరుధ్యాలు ఎదురవుతాయి. ప్రతిసారి వాటిని చైతన్యవంతమైన ఆలోచనలతో పరిష్కరించుకుంటూ పురోగమించడం కంఠీరవం పాత్రరచనాశిల్ప రహస్యం.

   కంఠీరవం ప్రధానపాత్రగా ఉన్నా, నవలలో రచయిత ఏ పాత్రనూ అప్రధానం చేయలేదు. ప్రతి పాత్రా స్వయం ప్రతిపత్తి కలిగుంటై. ఇతివృత్తాన్ని ముందుకు నడపడంలో సామూహికంగా కృషి చేస్తాయి. ఈనవలలోని ప్రతిపాత్రా మరో పాత్రతో సంబంధం కలిగుండటమే గాక, నవలా కార్యంతో కూడా సంబంధం కలిగుంటాయి. ఇ.ఎం.పాస్టర్‌ ప్రకారం ఈ నవలలోని పాత్రలన్నీ పరిణామస్వభావం గల పాత్రలే. సంఘర్షణాత్మక పాత్రలే. రామభూపాలరావుకు నమ్మినబంటుగా ఉండిన హైదరాలీ, మతమార్పిడి కార్యక్రమం వచ్చేసరికి స్వతంత్రించి ప్రవర్తించడం, మత మార్పిడిని ఆర్య సమాజం అరికట్టడంలో తిరిగి రామభూపాలరావుకు విధేయుడుగా మారిపోవడం- ఆ సన్నివేశాలు వాళ్ళ ఆలోచనలు- వీటిని పరిశీలిస్తే, మతం వంటి సాంస్కృతిక వైరుధ్యాలకన్నా, వాళ్ళు వర్గ ప్రయోజనాలకే ఎలా ప్రతినిధులుగా నిలబడ్డారో స్పష్టమౌతుంది. రామభూపాలరావు కొమురయ్య పొలాన్ని దౌర్జన్యంగా దున్నించిన సందర్భంలో సామాజిక సంబంధాలలోని సంక్లిష్టతను రచయిత ఎంతో వాస్తవికంగా ప్రదిర్శించారు. రామభూపాలరావు జీతగాళ్ళలో వెంకయ్య మాదిగ వ్యక్తి. మరో జీతగాడు కనకయ్య శూద్రుడు. అన్నమ్మ వచ్చి దున్నే నాగళ్ళకు అడ్డంగా పడుకుంటుంది. నాగళ్ళను నడవనివ్వడం లేదని వెంకయ్య అన్నమ్మను కొట్టడానికి పోతాడు. కనకయ్యకు వెంకయ్య మీద కోపం వస్తుంది. ''మాదిగోడివి, కాపుమనిషిని ముట్టుకోబోతున్నవురా'' అని సాటి కులానికి జరిగే అవమానాన్ని సహించలేకపోతాడు. దాన్ని గమనించిన హైదరాలీ కనకయ్యను రెండు దెబ్బలు వేస్తాడు. ఈ సమయంలో ''కనకయ్యను కొట్టడం వెంకయ్యతో సహా మొత్తం జీతగాండ్లకు కూడా అన్యాయమనిపించింది'' అంటారు రచయిత. కులవర్గ వైరుధ్యాలను ఇంత సరళంగా చిత్రించి స్పష్టం చెయ్యడం వాస్తవిక శిల్పిగా ఆళ్వారుస్వామి చేయి తిరిగినతనం. కథా ప్రయోజనానికి ఏ పాత్రను ఎంత వరకు ఉపయోగించుకోవాలో, ఏ సందర్భంలో ఏ పాత్ర జాప్యం చేసుకోవాలో - అంతవరకే పాత్రల్ని ఉపయోగించడం రచనా శిల్పంలో కష్టమైన పని. ప్రజలమనిషి నవలలో ఈ పనిని రచయిత అతిసునాయాసంగా నిర్వహించారు. ఈ నవలలో ఏ పాత్రా ఆచరణకు సాధ్యం కాని ప్రవర్తను కలిగినది కాదు. స్థాయికి మించి ఏ పాత్రా మాట్లాడదు. పాత్రలను రచయిత ఎక్కడా పనిగట్టుకుని వర్ణించడు. నవలా కార్య నిర్వహణలో ఆ పాత్రలు తమనుతామే ఆవిష్కరించుకుంటాయి. ఈ శిల్ప విధానం వల్ల ఆ పాత్రల పట్ల పాఠకులే అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది.

  'ప్రజలమనిషి' నవలలో కనిపించే మంచి శిల్ప లక్షణం నేపధ్య చిత్రణలో రచయిత ఎంతో సంయమనం వహించడం. నేపధ్య చిత్రణలో సంయమనం పాటించడమంటే మహా కావ్యం నుండి కథ వేరుపడి, నవలగా రూపొందిన ప్రక్రియను, ఆ కవిత్వంతో నింపకుండా ఉండటం. ప్రజలమనిషిలో నేపధ్యచిత్రణలో కవిత్వాంశ చాలా చాలా పరిమితంగా ఉంది. అవసరానికి మించిన వివరణలు ఈ నవలలో కనిపించవు. అభ్యుదయ సాహిత్యయుగ సాహిత్య లక్షణమైన వాస్తవికత శిల్పంలో కూడా కనిపించడం అవసరం. ప్రజలమనిషి నవలా శిల్పంలో ఇది కనిపిస్తుంది. కంఠీరవాన్ని గురించి నిరంతరం పరితపిస్తూ వెంకటాచారి దుర్మార్గాన్ని అసహ్యంచుకునీ అండాళమ్మ, వెంకటాచారి జైలుశిక్ష పడునప్పుడు, ఆమె కంఠీరవం పట్ల ప్రపర్తించిన తీరును చిత్రిస్తూ, రచయిత తల్లి స్వభావాన్ని, అలాగే వెంకటాచారి భార్య మనస్తత్వాన్ని ఆవిష్కరించడం ఆళ్వారుస్వామి వాస్తవికతాపరిజ్ఞానానికి నిదర్శనం.

   పల్చని పొరలాంటి తెలంగాణా స్థానిక భాషా పదప్రయోగం ఈ నవలకు ప్రాణభూతంగా పనిచేసింది. సాదుకుంటాం, వండించిపెడ్తరు, అమ్మను అడుగితే, నాతోటే చదివిందే, పోరడుగింతవున్నడో లేడో, ఆస్తులకు పోయిందమ్మ, మొ||

  'ప్రజలమనిషి' వ్యాపార, కాలక్షేప నవల కాదు. ఉద్యమ నవల, ఉద్యమకారుడు రాసిన ఉద్యమం నవల. అందువల్లనే నవలలో చౌకబారు ఎత్తుగడలు లేవు. పాఠకుడిని బోల్తా కొట్టించే మలుపులు తిరగదు కథ. ప్రయోగం పేరుతో పాఠకుల్ని దూరం చేసుకోలేదు. అక్షరజ్ఞానం గల ప్రతిపాఠకుడూ చదివి స్ఫూర్తి పొందగలిగిన శిల్పం 'ప్రజలమనిషి' నవలలో కనిపిస్తుంది.