ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                                మానవ విలువలనకు అద్దం పట్టిన 'జైలులోపల' కథలు
                                                                                                     - వాసిరెడ్డి నవీన్‌


   పాతికేళ్ళ క్రితంమాట. తెలంగాణా పోరాటాన్ని చిత్రించిన కథలతో సంకలనం వెయ్యాలన్న సంకల్పంతో ఆ కథలను సేకరిస్తున్న క్రమంలో 'ప్రజలమనిషి', 'గంగు' నవలల రచయితగా, చిరపరిచితమైన వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన 'జైలులోపల' కథల సంపుటి చేతికొచ్చింది. ఆ కథలు చదివినప్పుడు చకితుడనైపోయాను. వివిధ సమస్యల పట్ల ఆయనకున్న దృక్పథానికి జోహారులర్పించాను. అయితే ఆ కథలు తెలంగాణా పోరాటాన్ని నేరుగా చిత్రించిన కథలు కాకపోవటంతో 1981లో జనసాహితి ప్రచురించిన 'తెలంగాణా పోరాటకథలు' సంకలనంలో ఆ కథలు చేర్చలేకపోయాను.

   ఆ తర్వాత ఆ కథలను మళ్ళీమళ్ళీ అనేకసార్లు చదివాను. అనేకమందికి ఆ సంపుటి జిరాక్సు కాపీలిచ్చి చదివించాను. ఆ కథల గురించి నాలుగు ముక్కలేవైనా రాయాలనే నా కోరిక ఈ నాటికి ఇలా తీరింది.

   అందులో ఓ కథయితే- 'పతితుని హృదయం'- నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. సామాన్య నేరస్తుడి నుండి, భూమయ్య కిష్టగౌడ్‌, ముక్బూల్‌భట్‌ వంటి రాజకీయ నేరస్తుల ఉరితీత గురించి చదివినప్పుడు, విన్నప్పుడు ఈ కథ గుర్తుకు వచ్చి మనసు వికలమైపోతుంది. ఒక రచనకు ఇంత శక్తి ఉంటుందని మొదటిసారి నాకు ఎరుకలోకి తెచ్చిన కథ అది. తరువాత దాన్ని ప్రజాసాహితి మాసపత్రికలో సజీవ సాహిత్యం శీర్షికన ప్రచురించాను.

   మళ్ళీ ఈ వ్యాస సంకలనం కోసం జైలులోపల కథల్ని, ఎన్‌. వేణుగోపాల్‌ రచించిన 'సార్థక జీవనం' పుస్తకాన్నీ చదువుతూ ఉంటే 90ల్లో జైలువ్యవస్థలో మార్పుల కోసం జైలులోపల నక్సలైట్‌ ఖైదీలు, బయట సంఘీభావ కమిటీ జరిపిన పోరాటం గుర్తుకు వచ్చింది. ఒక చిన్న వ్యవస్థకు కొద్దిపాటి ప్రజాస్వామిక స్వభావాన్ని తీసుకురావటానికి ఎన్ని పోరాటాలు అవసరమయ్యాయి? ఖైదీలు ఈ మాత్రపు సౌకర్యాలయినా పొందగలగటం వెనుక ఎందరి ఆవేదనలు, ఆగ్రహాలు, ఆలోచనలు, పోరాటాలు జీవితాలు ఉన్నాయో!

   ఆళ్వారుస్వామి జైలు జీవితం గడిపి దాదాపు 60 ఏళ్ళు గడిచాయి. ఆయన బయటకు వచ్చిన వెంటనే 1952లో దేశోద్దారక గ్రంథమాల 13వ ప్రచురణగా 'జైలులోపల' కథాసంపుటి విడుదలయింది. ఈ 60 సంవత్సరాలుగా పోరాటాలు సాగుతున్నా, నిరసనలు వ్యక్తమవుతున్నా- ''ఒకడు మనిషిని చంపటమే తప్పు అంటున్న ఖానూను ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది. మాట్లాడవేం?" అంటూ పతితుని హృదయం కథలో జమేదారుని నిలదీసిన సాధారణ నేరస్తుడు గండయ్య ప్రశ్నకు ఈ సమాజం ఇంకా సమాధానం చెప్పుకోవలసే ఉంది.

   1947 నుండి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అయిదు ప్రాంతాల్లో జైలు జీవితం గడిపారు వట్టికోట ఆళ్వారుస్వామి. గుల్బర్గాలో కాళోజి, నిజామాబాద్‌లో దాశరథి సహచర్యం లభించింది. అనేక మంది ఖైదీలకు ఆయన బహుశా ఆత్మీయుడయి ఉంటాడు. ఆయన మృదుస్వభావం, నిక్కచ్చిగా ఉండటం, వారి సమస్యలకు ఆయన స్పందించిన తీరు ఆయన్ని వారు తమవాడుగా భావించేట్లు చేసి ఉండాలి. అంత దగ్గరితనం లేకపోతే ఆ ఖైదీలు తమ జీవితాలను ఇలా ఆయన ముందు పరిచేవారు కాదు.

   వారి జీవితాలే ఆయన దృష్టికోణం నుండి ఈ కథలుగా రూపొందాయి. ఈ క్రమంలో ఆయన ఆలోచనలు అనేక రకాలుగా సాగి ఉండవచ్చు. అప్పటికి సమాజం పట్ల ఒక దృక్పథం కలిగిన ఆయనకు వీరి జీవిత కథలు మరింత స్పష్టతనిచ్చి ఉండవచ్చు. ఈ ఆలోచనా స్రవంతి యావత్తూ ఈ కథల్లో ప్రతి పేజీలోనూ కనబడుతుంది. లేకపోతే 'మెదడుకి మేత', 'అవకాశమిస్తే', 'పతితుని హృదయం' వంటి కథలు రాయటం సాధ్యంకాదు.

   ఆళ్వారుస్వామి 'జైలులోపల' సంపుటిలోని ఆరు కథలు కాక మరో 20 కథల వరకు రాసి ఉండవచ్చని అంచనా. అవి ఈనాడు అందుబాటులో లేవు.

   జైలు జీవితంపై అనేకమంది రచయితలు కవితలను, వ్యాసాలను, అనుభవాలను వివరించారు. అయితే ఖైదీల జీవితాలను వస్తువుగా చేసుకొని కథలు రాసింది మాత్రం వట్టికోట ఆళ్వారుస్వామే. బహుశా తెలుగు సాహిత్యంలో ఖైదీల జీవితగాథలను కథలుగా వెలుగులోకి తెచ్చిన మొట్టమొదటి రచయిత వట్టికోటే కావచ్చు.

   ఈ ఆరు కథలు సామాజిక జీవనంలోని వివిధ పార్శ్వాలను తడిమి తద్వారా ఆయా సమస్యలను పాఠకుల ముందుంచాయి. ఆకలి విశ్వరూపాన్ని 'పరిగె' కథలోను, హిందూ ముస్లిం ఐక్యత అవసరాన్ని 'మెదడుకు మేత' కథలోను తెలియజేశారు. 'అవకాశమిస్తే' కథ ఒక వ్యక్తి నేరస్తుడిగా మారటానికి గల కారణాలను విశ్లేషిస్తే, అంది వచ్చిన అవకాశాలను తమ కనుగుణంగా మార్చుకొనే రాజకీయ నాయకుల నేర స్వభావాన్ని చిత్రిస్తుంది 'మాకంటే మీరేం తక్కువ' కథ. 'విధి లేక' జైలుపాలైన ఖైదీల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని రాసిన కథ. ఇలా ఆరు కథలూ సామాజిక గమనాన్ని నిర్దేశించే భిన్న కోణాలను చిత్రించినవి. ఒక్కో కథలో ఆయా సమస్యల పట్ల తన దృక్పథాన్ని ప్రకటించటంతోపాటు ఆ సమస్య చుట్టూ ముడిపడి ఉన్న వివిధ అందాలను చిత్రించటంలో ఆయన ప్రదర్శించిన పరిణితిని, ప్రజాస్వామిక ఆకాంక్షను మెచ్చుకోకుండా ఉండలేం. అంతేకాదు శిల్పరీత్యా ఆరు కథలను వివిధ నిర్మాణ పద్దతుల్లో రాశారు. రెండు కథలు హాస్యవ్యంగ్య ధోరణిలోను (అవకాశమిస్తే, మాకంటే మీరేం తక్కువ), ఓ కథను కేవలం సంభాషణల ద్వారాను, మరో కథను చర్చగాను (మెదడుకు మేత), పతితుని హృదయం కథను సర్వసాక్షి కథన పద్దతిలోనూ నడిపించారు. ఇలా కథా నిర్మాణంలో వివిధ పద్దతులను అవలంభించడం వల్ల అన్ని కథల్లో అంతస్సూత్రం ఒకటే అయినా దేనికదే భిన్నమైన కథగా పాఠకులకు తోస్తుంది.

   ప్రతి కథలోనూ ఏదో ఒక పాత్రలో రచయిత ఆళ్వారుస్వామి మృదుస్వభావం, మానవీయ విలువల పట్ల ఆయనకున్న ఆర్ద్రత, మానవ సంక్షేమం కోసం ఆయన పడే తపన, ఆలోచన... ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పరిపూర్ణ వ్యక్తిత్వం దోబూచులాడుతూ కనబడుతుంది. అందుకే వట్టికోట ఆళ్వారుస్వామి అర్థం కావటానికి ఈ కథలు మనకు దోహదపడతాయి. ఆయన ప్రాపంచిక దృక్పథానికి అద్దం పట్టిన కథలు కూడా.

  'పరిగె' కథలోని మల్లయ్యదీ, 'విధిలేక' కథలోని నర్సయ్యదీ దాదాపు ఒకే స్థితి. తిండికోసం పరిగె ఏరుకొని నాలుగు గింజలు సంపాదించి, తన వాళ్ళకు పెట్టాలన్న మల్లయ్యకు దొంగతనం అంటగట్టి జైలుకు పంపాడు దొర, తినడానికి తిండిలేక, చెయ్యడానికి పని దొరకక దొంగతనం వృత్తిగా మార్చుకొన్నాడు వస్తాదు నర్సయ్య. ఒకరిది పల్లెటూరు, మరొకరిది పట్టణం. ఈ ఇద్దరూ జైలు జీవితం గడిపినన్నాళ్ళు వాళ్ళ ఆలోచనంత కుటుంబాలపైనే... వీరు జైలుకు రావటంతో రెండు కుటుంబాలు సర్వనాశనమైపోవటం అనివార్య పరిణామమే. వల్లెటూరి మల్లయ్య తండ్రి చనిపోవటం, చెల్లి ఏమైందో తెలీనితనం- ఇటు పట్టణం నుండి వచ్చిన నర్సయ్య భార్య మరో దొంగ లక్ష్మయ్యతో వెళ్ళిపోవటం. ఈ స్థితిని జీర్ణించుకోలేని వారు వారివారి స్వభావాల రీత్యా ఒకరు 'చెల్లెలు ఏమైందో' అంటూ హృదయంతో పరితపిస్తే, మరొకరు 'లక్ష్యయ్యను చంపేస్తా' నంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతాడు. ఇంతకీ ఆ ఇద్దరు స్త్రీలు ఏమైపోతారు? ఇది పాఠకుల మెదళ్ళకు వట్టికోట సంధించిన ప్రశ్న. మరో ముఖ్యమైన ప్రశ్న- నేరస్తులు అలాగే మిగిలిపోవాలా అనేది? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ వెదుకుదాం?

   ఎక్కడంటే... "నిజానికి మనదేశంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నూటికి 85 మంది నేరవృత్తి కలవారు కారు. తక్కిన 15 మంది కూడా స్వభావత: నేరకాండ్రు కారు. పరిస్థితులే వారినా విధంగా చేశాయి." ఈ నెహ్రూ మాటలతో పుస్తకం మొదలవుతుంది. ఒక రకంగా ఈ మాటలు పుస్తకానికి ప్రిల్యూడ్‌ (ప్రారంభవచనాలు) లాంటివి. ఈ ఆరు కథలకు అంతస్సూత్రం ఈ మాటలే అయినా స్వభావరీత్యా భిన్నమైన కథలుగా రూపొందాయి. అయితే కేవలం ఈ మాటలు ఆధారంగానే రాసిన కథ 'అవకాశమిస్తే...' ఒక పఠాను పన్నెండేళ్ళు శిక్షకు గురై పిచ్చివాడుగా మారి మరణిస్తాడు. ''అతనికి అవకాశం కలిగితే రాణించగలవాడే. అతనావిధంగా తయారుకావడానికి పరిస్థితులే కారణం,'' అంటూ భర్త శాస్త్రి పఠాను కథను చెబుతూ భార్యతో అన్న ఈ మాటల వెనుక ఆళ్వారుస్వామి ఆలోచనలు, వాటిని ప్రభావితం చేసినా నెహ్రు మాటలు ఉన్నాయి. 'నేను నిర్దోషిని నా ఇంటికి పంపండి,' అంటూ ఒకే మాట మాట్లాడుతూ పిచ్చివాడైపోయి తుదకు చచ్చిపోవటానికి కారణం ఈ జైలు. పఠాను నేరస్తుడు కావటానికి సమాజం కారణమైతే అతని చావుకి ఈ జైలువ్యవస్థ కారణమయింది.

   అత్యంత విషాదమైన ఈ కథ భార్యభర్తల మధ్య హాస్య సంభాషణగా ప్రారంభమై అలాగే సాగి ఇద్దరూ కళ్ళనీళ్ళు పెట్టుకోవటంతో ముగుస్తుంది. అతి తక్కువ పేజీల నిడివిలో ఇలాంటి నిర్మాణంలో కథను నడిపించటం కత్తి మీద సాము వంటిది. కథ ప్రారంభంలో పాఠకులను తీసుకెళ్ళిన మూడ్‌ నుంచి అందుకు భిన్నంగా ఒక్కసారి ముఖం మీద గుద్దినట్లు వాస్తవాన్ని చెప్పిన తీరు- కథ నిర్వహణలో వట్టికోట సాధించిన విజయానికి నిదర్శనం.

  'మాకంటే మీరేం తక్కువ' కథ వ్యంగ్య ధోరణిలో సాగింది. ప్రభుత్వ నియమించిన జైలు విజిటర్‌కి, ఇద్దరు దొంగలకు మధ్య సంభాషణ రూపంలో జరిగిన ఈ కథలో రాజకీయ నాయకుడు ఇంద్రసేనారెడ్డిని ఖైదీలు వెంకడు, రంగడు వ్యంగ్యంగా మాట్లాడుతూ నిలదీసిన తీరు కథకు ప్రత్యేకతను సంతరించి పెట్టింది.

   జైలులో జరిగిన కొన్ని సంఘటనలను మరికొన్ని చర్చలాంటి సంభాషణలను జోడించి తన ఈ దృక్పథాన్ని విప్పి చెప్పటానికి రాసిన కథ 'మెదడుకు మేత.' ప్రధానంగా హిందూ ముస్లిం ఐక్యత గురించిన రాసిన కథ.

   హిందువుగా ఓం జెండాను గౌరవించినందుకు జైలు జీవితం గడుపుతున్న హుకుంసింగ్‌కి- 'తాగి తందనాలాడి ఒకడి ప్రాణాలు తీసి ఇరవై ఏండ్లు శిక్ష తెచ్చుకొని సిగ్గులేక కులుకుతూ పూలరంగడిలా తిరిగే' లతీఫ్‌ల మధ్య జరిగిన కొట్లాటల స్వభావాన్ని విప్పిచెప్పే మోహన్‌బాబు పాత్రలో వట్టికోట ఆళ్వారుస్వామి హిందూ ముస్లింల మధ్య చిచ్చు రగలటానికి గల కారణాలను విశ్లేషిస్తారు.

  "ప్రజలలో చైతన్యం, విజ్ఞానం, వికాసం కలుగుటలో వారి భావనాశక్తి ప్రధాన సమస్యలపై ప్రసరించి విశాల హృదయంతో ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు. అప్పుడు ప్రజల నైతిక, రాజకీయ. ఆర్థిక సమస్యలే ప్రధాన విషయాలుగా పరిగణించబడతాయి," అంటూ ఓ సందేశంతో ముగిసే ఇటువంటి కథ రాయటం, రాసి మెప్పించటం కష్టతరమైన పనే. ఈ సంవుటిలో కాస్త పెద్ద కథ కూడా ఇదే. ఖైదీల స్వభావం, సాధారణంగా జైళ్ళలో జరిగే సంఘటనలు, ఖైదీల మధ్య సంభాషణలు, వాటిలో తొంగిచూసే వ్యంగ్యం, హాస్యం మేళవించి రాసిన ఈ కథ సహజంగా సాగిపోతుంది.

   ఈ సంపుటానికే తలమానికం అయిన కథ 'పతితుని హృరయం' అతి చిన్న కథ కూడా.

   తోటి ఖైదీని ఉరితీసే సన్నివేశాన్ని, అతని మరణాన్ని చూసి చలించిపోయిన మరో ఖైదీ గండయ్య వెళ్ళగ్రక్కిన ఆవేశం, ఆక్రోశం, బాధ కథగా రూపొందింది.

   "అయ్యా! ఉరి తీసినప్పటి నుండి నా కడుపులో ఎట్లాగో ఉంది. నాకెటు తోచటం లేదు. మీరు చదువకున్నోరు కూడా. ఇటువంటి పనులు చేస్తే ఇక మా సంగతి ఎవరు అడగాలె," అంటూ అమాయకంగా జైలరుని ప్రశ్నించిన గండయ్య ఆత్మఘోష ఈ కథ.

   ఇన్ని సంవత్సరాలుగా ఇంత చర్చ జరిగాక, అనేక దేశాల్లో ఉరిశిక్ష రద్దయిన తర్వాత కూడా ఇంకా అనాగరికమైన ఉరిశిక్ష రద్దుకాని ఈ దేశంలో గండయ్య కున్న పాటి మానవతా దృక్పథం పాలకులకు లేదంటే బాధ, ఆవేశం తన్నుకొస్తాయి.

   నవలా రచయితగా తెలుగు పాఠకులకు చిరపరిచితుడైన వట్టికోట ఒక ఉద్యమకారుడు, జర్నలిస్టు, గ్రంథాలయోద్యమ నిర్మాత, తెలంగాణలో 1942 నుంచి సాగిన నిజాం వ్యతిరేక పోరాటం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదిద్దుకోవడంలో ఆయన ముద్ర ప్రముఖమైనది. ఆంధ్ర మహాసభ చీలిక సందర్భంలో ఆయన నిర్వహించిన పాత్ర ఉద్యమానికి ఎందరో సానుభూతిపరులను సాధించి పెట్టింది.

   ఇలా వివిధ ఉద్యమాలతో మమేకమై జీవితం గడుపుతూ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, ఆ సిద్ధాంతంలోనే ఇమిడి ఉన్న అత్యున్నతమైన మానవతా విలువలకు మారుపేరుగా నిలిచిన వట్టికోట ఆళ్వారుస్వామి ఆ విలువల పరిరక్షణ కోసం తెలుగు పాఠకులపై సంధించిన ఆలోచనాస్త్రాలు ఈ 'జైలులోపల' కథలు.